- కరువు ప్రకటించి 3 వారాలు దాటినా అసమగ్రమే
- ఇప్పటికి పది లక్షల ఎకరాల్లో నష్టం
- ఇది 103 మండలాల లెక్క
- గుర్తించని మండలాల్లో సాయంపై అస్పష్టత
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బ తిన్నట్లు అంచనాలు రూపొందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయ నిబంధనల ప్రకారం 33 శాతం, అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లిన ఏరియానే పరిగణనలోకి తీసుకున్నారు. సర్కారు తాజాగా విడుదల చేసిన జిఒఎంఎస్‌నెం.5 ప్రకారం పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) చెల్లింపుల కోసం రూ.వెయ్యి కోట్ల వరకు అవసరమవుతాయని ఎస్టిమేట్ చేశారని సమాచారం. వ్యవసాయ, ఉద్యానవన శాఖల వరకు ఈ అంచనాలతో కేంద్రానికి ఇచ్చే సమగ్ర విజ్ఞాపన పత్రంలో పొందుపర్చనున్నట్లు తెలిసింది. కాగా కరువు మండలాలను ప్రకటించడంలోనే జాప్యం జరగ్గా, కరువును గుర్తించాక మూడు వారాలు దాటిపోయినా పంట నష్టాలపై ఎన్యూమరేషన్ శనివారం వరకు కొలిక్కి రాలేదు. రాష్ట్ర కేంద్రానికి అనంతపురం, చిత్తూరు, ఎన్‌టిఆర్ జిల్లాల నుంచే సమగ్ర సమాచారం వచ్చింది. ఎన్యుమరేషన్ చేయాల్సిన తతిమ్మా నాలుగు జిల్లాల నుంచి త్వరలోనే వివరాలొస్తాయని చెబుతున్నారు. సమాచారం అందిన జిల్లాలను పరిశీలిస్తే ఒక్క అనంతపురంలోనే సర్కారు ఎక్కువ మండలాలు ప్రకటించింది. ఆ జిల్లాలో 28 మండలాల్లో కరువును గుర్తించింది. చిత్తూరులో నాలుగు, ఎన్‌టిఆర్‌లో రెండు మండలాలనే ప్రకటించింది. కర్నూలులో 24, శ్రీసత్యసాయి 21, అన్నమయ్య 18, నంద్యాలలో 6 మండలాలు ప్రకటించగా, వాటి ఎన్యుమరేషన్ వివరాలు హెడ్‌క్వార్టర్‌కు చేరలేదు. 103 మండలాలకుగాను 34 మండలాల వివరాలే అందాయి. ఇంకా 69 మండలాల ఎన్యుమరేషన్ పూర్తి కాలేదు. కేంద్రానికి, కేంద్రం పంపే అధికార బృందాలకు సమగ్ర వివరాలివ్వాల్సి ఉందని, అందుకే ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఆచితూచి..
ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి రాష్ట్రంలో 300 కుపైగా మండలాల్లో తీవ్ర దుర్భిక్షం ఉంది. కానీ ప్రభుత్వం గీచిగీచి 80 తీవ్ర స్థాయి, 23 మధ్యస్త స్థాయి కరువు మండలాలను ప్రకటించింది. కేంద్ర సాయం కోరుతూ ఆ మేరకే అంచనాలు పంపుతోంది. ప్రకటించిన మండలాల్లో తొలుత ప్రాథమికంగా ఆరేడు లక్షల ఎకరాల్లో 33 శాతానికి మించి పంటలకు నష్టం జరిగిందని, రూ.534 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులకు కావాలని అంచనా వేశారు. పూర్తి స్థాయి ఎన్యుమరేషన్ చేపట్టాక నష్టం 10 లక్షల ఎకరాలకు పెరిగేలా కనిపిస్తోంది.
రాష్ట్రానికి భారం
ఏ సీజన్‌లో పంట నష్టాలకు ఆ సీజన్‌లోనే పరిహారం అని మూడేళ్ల నుంచి స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెస్పాన్స్‌ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నిబంధనల కింద రైతులకు ప్రభుత్వం తృణమో పణమో చెల్లిస్తూ వచ్చింది. ఆ పరిహారానికి కరువు, లేదంటే వరద, తుపాన్ మండలాలను సర్కారు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఈ ఏడాది అనూహ్యంగా కరువు రావడంతో నష్టం పెరిగిపోయింది. ఖరీఫ్‌లో వ్యవసాయ పంటలు 62 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, వాటిలో సగభాగంలో 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఉద్యానవన పంటలు అదనం. జిఒ5 ప్రకారం కనీసం 30 లక్షల ఎకరాలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలంటే దాదాపు రూ.3 వేల కోట్లు కావాలి. ప్రభుత్వం కరువును తక్కువ చేసి చూపేందుకు కేవలం 103 మండలాలనే ప్రకటించింది. ఆ మండలాల్లోని నష్టాలకే, అదీ కేంద్రం దయదలిస్తే నిధులొస్తాయి. అవి ఎప్పుడొస్తాయో తెలీదు. మిగతా పంట నష్టాలకు గతంలో మల్లే ఎలాంటి గెజిట్‌లూ, ధ్రువీకరణలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలంటే రూ.2 వేల కోట్లు కావాలి. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేదంటే 103 మండలాలకే పరిమితమవుతుందా అనే విషయంలో ఇప్పటికైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ప్రకటించిన కరువు మండలాల్లోనే నష్టాలపై ఎన్యూమరేషన్ జరుగుతోంది.