‘లెక్క’లేని ఖర్చు

Nov 25,2023 09:40 #accounts, #CAG
  • రూ. 73,694 కోట్లపై కాగ్‌ ఆక్షేపణ
  • బడ్జెట్‌ మాన్యువల్‌కు విరుద్ధమని వ్యాఖ్య

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రలో జరుగుతున్న ఖర్చుల తీరును కంప్ట్రోలర్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్రంగా ఆక్షేపించింది. బడ్జెట్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యయ నిర్వహణ జరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన ఆడిటర్‌ జనరల్‌ కార్యాలయ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందింది.ప్రతిపాదనలు లేకుండానే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొంది. నెలవారీ వ్యయ నివేదికల్లో భాగంగా సెప్టెంబర్‌ వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఏ శాఖకు ఎంత మొత్తంలో ఖర్చు చేయాలన్నది ముందుగానే బడ్జెట్‌లో స్పష్టం చేసి శాసనసభ ఆమోదాన్ని పొందాలి. అయితే సెప్టెంబర్‌ వరకు జరిగిన లావాదేవీల్లో ఏకంగా 73,694 కోట్ల రూపాయలను ఎటువంటి కేటాయింపులు లేకుండానే ఖర్చు చేసినట్లు కాగ్‌ గుర్తించింది. మొత్తం 260 అంశాల్లో ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఇందులో 66,596 కోట్ల రూపాయలను ‘ఆర్థిక నిర్వహణ ‘ అని పేర్కొంటూ ఖర్చు చేశారని తెలిపింది. ఈ నిధులను ఏయే శాఖలకు ఖర్చు చేశారన్న వివరాలు కూడా లేవని సమాచారం. రికార్డుల్లో మాత్రం కేవలం 25 అంశాల్లోనే ఈ వ్యయం చేసినట్లు కాగ్‌ పేర్కొనడం విశేషం. ఇక పట్టణాభివృద్ధి శాఖలో మరో 3,494 కోట్లను ఇలాగే బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా వ్యయం చేసినట్లు గుర్తించారు. సంక్షేమశాఖల్లో కూడా ఐదొందల కోట్ల వరకు ఖర్చు చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో కూడా 600 కోట్ల వరకు కేటాయింపులు లేకుండానే ఖర్చు చేసినట్లు తేల్చారు. ఇంధన శాఖలో కూడా 563 కోట్ల వరకు లెక్కల్లేకుండా ఖర్చు చేసినట్లు తేలింది. ఇక బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కన్నా అదనంగా 8,732 కోట్లను అనేక శాఖల్లో ఖర్చు చేసినట్లు పిఏజి విమర్శించింది.కేటాయింపులు అంకెల్లోనేకాగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ అవి అంకెలకే పరిమితమయ్యాయి. 1914 అంశాలకు సంబంధించి బడ్జెట్‌లో 34,171 కోట్లు కేటాయించగా, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. ఇలా బడ్జెట్‌కు, కేటాయింపులకు, ఆదాయానికి, వ్యయానికి మధ్య భారీ అంతరాలు ఉండడాన్ని నివేదికలో ప్రశ్నించారు.నియమాలకు విరుద్ధంగాఆర్థిక కమిషన్‌ నియమావళిలో భాగంగా బడ్జెట్‌లో చూపించినదానికన్నా ఎక్కువ వ్యయం చేయకూడదని ఉంది. అలాగే ఒక ఆదేశాల మేరకు మంజూరు చేసిన మొత్తాన్ని మాత్రమే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి అనేక నిబంధనలను తాజా కేటాయింపులు, వ్యయంలో అనుసరించలేదని ప్రధాన అక్కౌంటెంట్‌ కార్యాలయం తన నివేదికలో తేల్చిచెప్పింది.

➡️