బిజెపికి ఎదురుగాలి !

Dec 1,2023 09:49 #details, #Polling
  • ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి
  • రాజస్థాన్‌ ఒక్కటే అవకాశం
  • తెలంగాణలో కాంగ్రెస్‌
  • మధ్య ప్రదేశ్‌లో హస్తానికే మొగ్గు
  • చత్తీస్‌గఢ్‌లో పోటాపోటీ
  • మిజోరాంలో హంగ్‌

న్యూఢిల్లీ : ఇడి, ఐటి, సిబిఐ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందలమెక్కాలని చూసిన బిజెపికి మరోసారి శృంగభంగం తప్పదని గురువారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ సంకేతాలిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికలకు అయిదు మాసాల ముందు జరిగిన రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణా, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రాజస్థాన్‌లో మినహా ఎక్కడా ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఛత్తీస్‌గడ్‌లో వరుసగా రెండోసారి బిజెపికి ఓటమి తప్పదని చెబుతున్నాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్‌, బిజెపిలను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంకు గతం కంటే సీట్లు తగ్గుతాయని అంచనా వేశాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 63-79 సీట్లు, బిఆర్‌ఎస్‌కు 31-47, బిజెపికి 2-4, ఎఐఎంఐఎంకు 5-7 సీట్లు వస్తాయని ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్‌ అంచనా వేయగా, కాంగ్రెస్‌కు 48-64 సీట్లు వస్తాయని జన్‌ కీ బాత్‌ అంచనా వేసింది. బిఆర్‌ఎస్‌కు 40-55, బిజెపికి 7-13, ఎఐఎంఐఎంకు 4-7 సీట్లు వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు 58-68, బిఆర్‌ఎస్‌కు 46-56, బిజెపికి 4-9, ఎఐఎంఐఎంకు 5-9 సీట్లు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ-మ్యాట్రిజ్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 49-59 సీట్లు వస్తాయని, బిఆర్‌ఎస్‌కు 48-58 సీట్లు వస్తాయని టీవీ9 భరతవర్ష్‌ పోల్‌స్ట్రాట్‌ పేర్కొంది.

యుపి తరువాత హిందీ రాష్ట్రాల్లో కీలకమైనదిగా భావించే మధ్య ప్రదేశ్‌లో హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కే మొగ్గు ఉండొచ్చని కొన్ని పోల్స్‌ చూపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో బిజెపికి 100-123 సీట్లు, కాంగ్రెస్‌కు 102-125 సీట్లు వస్తాయని జన్‌ కీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేయగా, రిపబ్లిక్‌ టీవీ-మ్యాట్రిజ్‌ బిజెపికి 118-130 సీట్లు, కాంగ్రెస్‌కు 97-107 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బిజెపికి 106-116, కాంగ్రెస్‌కు 111-121 వస్తాయని టివి9 భరత్‌వర్ష్‌ పోల్‌స్ట్రాట్‌ పేర్కొంది. టుడేస్‌ చాణక్య మధ్యప్రదేశ్‌లో బిజెపికి 151 (ప్లస్‌, మైనస్‌ 12 సీట్లు), కాంగ్రెస్‌కు 74 (ప్లస్‌, మైనస్‌ 12 సీట్లు) వస్తాయని అంచనా వేసింది. జిస్ట్‌- టిఐఎఫ్‌ – ఎన్‌ఎఐ అంచనా ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి 2018 లాంటి పరిస్థితి ఉందని, బిజెపికి 102-119 వస్తాయని, కాంగ్రెస్‌కు 107-124 సీట్లు వస్తాయి.

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ స్వల్ప మెజారిటీతో బిజెపి కన్నా ముందంజలో వుంటుందని యాక్సిస్‌ మై ఇండియా – ఇండియా టుడే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 86-106 సీట్లు, బిజెపికి 80-100 సీట్లు, ఇతరులకు 9-18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్‌ కీ బాత్‌ పోల్‌స్టర్లు బిజెపికి 100-122, కాంగ్రెస్‌కు 62-85, టివి 9 – భరత్‌వర్ష్‌ పోల్‌స్ట్రాట్‌ బిజెపికి 100-110, కాంగ్రెస్‌కు 90-100 వస్తాయని అంచనా వేశాయి. టైమ్స్‌ నౌ ఇటిజి పోల్‌ బిజెపికి 108-128 సీట్లు, కాంగ్రెస్‌కు 56-72 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకు అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయం కొనసాగుతుందని, బిజెపికి 110, కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని జిస్ట్‌-టిఐఎఫ్‌-ఎన్‌ఎఐ అంచనా వేసింది.

ఇంతకుముందు వెలువడిన ఒపీనియన్‌ పోల్స్‌లోనూ రాష్ట్ర ప్రజలు తమ చారిత్రక సాంప్రదాయాన్ని అనుసరించి, ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీని పక్కనబెట్టి బిజెపిని గెలిపిస్తారని పేర్కొన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో, ఎబిపి న్యూస్‌-సి ఓటర్‌ బిజెపికి 36-48, కాంగ్రెస్‌కు 41-53 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా బిజెపికి 36-46 సీట్లు, కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్‌ బిజెపికి 30-40 సీట్లు, కాంగ్రెస్‌కు 46-56 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్‌కీ బాత్‌ ప్రకారం బిజెపికి 34-45, కాంగ్రెస్‌కు 42-53 వస్తాయి. బిజెపికి 33 సీట్లు (ప్లస్‌-మైనస్‌ 8 సీట్లు) వస్తాయని, కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ 57 సీట్లు (ప్లస్‌-మైనస్‌ 8) సాధిస్తుందని టుడేస్‌ చాణక్య అంచనా వేసింది.

మిజోరాంలో, ముఖ్యమంత్రి జొరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), మరో ప్రాంతీయ పార్టీ అయిన జొరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (జెడ్‌ఎన్‌ఎఫ్‌) నేతృత్వంలోని జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం)కి మధ్య గట్టి పోటీ వుందని వెల్లడైంది. ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్ర వుంటుందని భావిస్తున్నారు. బిజెపి ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు. మిజోరంలో, ఇండియా టివి – సిఎన్‌ఎక్స్‌ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-18, జెడ్‌పిఎంకు 12-16, కాంగ్రెస్‌కి 8-10, బిజెపికి 0-2 వస్తాయని పేర్కొంది.

ఎబిపి న్యూస్‌ – సి ఓటర్‌ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 15-21, జెడ్‌పిఎంకు 12-18, కాంగ్రెస్‌కు 2-8,పి మార్క్‌ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-20, జెడ్‌పిఎంకు 9-15, కాంగ్రెస్‌కు 7-13 వస్తాయి. ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ప్రకారం ఎంఎన్‌కు 3-7, జెడ్‌పిఎంకు 28-35, కాంగ్రెస్‌కు 2-4 సీట్లు వస్తాయి. ఎంఎన్‌ఎఫ్‌కు 10-14 సీట్లు, జెడ్‌పిఎంకు 15-25 సీట్లు, కాంగ్రెస్‌కు 5-9, బిజెపికి 0-2 సీట్లు వస్తాయని జన్‌ కీ బాత్‌ తెలిపింది.ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉండగా, మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం వుంది. తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) అధికారంలో వుండగా, మిజోరాంలో ప్రాంతీయ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) ప్రభుత్వం వుంది.

తెలంగాణలో 75 శాతం పైగా పోలింగ్‌ – 3న కౌంటింగ్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 స్థానాలకు గురువారం నిర్వహించిన పోలింగ్‌లో 75 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఇవిఎంలు మొరాయించడం తో పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ సమయం ముగిసినా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడంతో క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు నిబంధనల మేరకు అనుమతించారు. ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. హైదరాబాద్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. 2018 ఎన్నికల్లో 79.7 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ కేంద్రాల నుంచి ఇవిఎం యూనిట్లను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపాయి. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. అంతేకాకుండా కామారెడ్డిలో సిఎం కెసిఆర్‌ ఓడిపోతున్నారని విశ్లేషించాయి. ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్ర నేతలందరూ తెలంగాణలో మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీకి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతుందని స్పష్టం చేశాయి.

➡️