- విశాఖ ఆటో నగర్‌లో మూడేళ్లలో 200 ఎంఎస్‌ఎంఇలు మూత
- అప్పారెల్ పార్కుల్లో 30 పరిశ్రమలకుగానూ పనిచేస్తున్నవి ఐదే
- రోడ్డున పడ్డ వేలాది మంది కార్మికులు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల కారణంగా చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇల ఎగుమతులు ఏటికేడాది పడిపోతున్నాయి. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నెలకొన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇల దుస్థితికి ఉదాహరణ. ఒకప్పుడు విశాఖకు ఖ్యాతి తెచ్చిన ఆటోనగర్ ఇప్పుడు వెలవెలలాడుతోంది. 30 ఏళ్ల క్రితం 1,200 ఎకరాల్లో 800 పరిశ్రమలతో స్థాపితమైన గాజువాక, పెదగంట్యాడ, ఆటో నగర్‌లో చిన్న పరిశ్రమలు క్రమంగా రెండు వేల యూనిట్ల వరకూ పెరిగాయి. తాజాగా వీటిలో 200 వరకూ మూతపడి సరుకు గొడౌన్లుగా మారిపోయాయి. దీంతో ఇండిస్టీపై ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడిన సుమారు 40 వేల మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నెలా రూ.800 కోట్లు టర్నోవర్ ఉండే ఆటో నగర్ ఇండిస్టీలో పరిశ్రమల మూతతో రూ.400 కోట్లకు పడిపోయింది. అప్పారెల్ (దుస్తుల తయారీ) పరిశ్రమలు 30కి 25 పూర్తిగా మూతపడడంతో దీంట్లో పనిచేసే మహిళా కార్మికులు ఆరు వేల మంది వేర్వేరు చోట్లకు తరలిపోయారు. ఆటో నగర్‌లోని డి, బి బ్లాక్‌లో 90 శాతం ఇలా మూతపడ్డాయి. దేశంలో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కరువవుతోంది. దేశంలో ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం.
శరాఘాతంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం శరాఘాతంగా మారింది. ఐరన్ ఓర్ ప్లాంట్‌కు అందకపోవడం, మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల్లో ఒకదాన్ని పూర్తిగా, మరోదాన్ని పాక్షికంగా మూసేయడంతో ఆటో నగర్ ఇండిస్టీలో పరిశ్రమలకూ పనిలేకుండా పోయింది. వేల సంఖ్యలోకార్మికులకు ఉపాధి అనిశ్చితిలో పడింది. విశాఖ ఆర్థిక వ్యవస్థకు 30 శాతం ఆధారమైన స్టీల్‌ప్లాంట్‌పై నీలినీడలతో ఎంఎస్‌ఎంఇ పరికరాల సరఫరాతో జరగాల్సిన ఉత్పత్తుల ఎగుమతులు 15 శాతం పడిపోయాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
దెబ్బమీద దెబ్బ
ఒకవైపు స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం, మరోవైపు ఆర్థిక మాంద్య పరిస్థితులు, గతంలో నోట్ల రద్దు, జిఎస్‌టి భారం, కోవిడ్-19 పరిస్థితుల దుష్ప్ర భావాలు ఆటో నగర్ ఇండిస్టీస్‌పై పడ్డాయి. ప్రభుత్వాల సాయం లేకపోవడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రావాల్సిన రూ.15 కోట్ల మేర ఇన్సెంటివ్స్ మూడేళ్లుగా ఆగిపోయాయి. -ఎ.కృష్ణబాలాజీ, ఆలిండియా స్మాల్ స్కేల్ ఇండిస్టీస్ ఎపి కో-ఆర్డినేటర్ (నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్, లఘు ఉద్యోగ్ భారతి)
నెలలో 15 రోజులే పని దొరుకుతోంది
నెలలో 15 రోజులు మాత్రమే ఆటో నగర్‌లో పని లభిస్తోంది. నడుస్తున్న పరిశ్రమల చుట్టూ పనికోసం తిరగాల్సి వస్తోంది. పరిశ్రమలన్నీ వరస కట్టి మూతపడుతుండడంతో పనుల కోసం నాలాంటి కార్మికులంతా వెతుక్కోవాల్సి వస్తోంది. పాలకులు పట్టించుకోవడం లేదు. -ఎం.అప్పలనాయుడు, ఎలక్ట్రికల్ పేనల్ బోర్డు స్కిల్ వర్కర్, ఆటో నగర్
సిక్ ఇండిస్టీస్ జాబితా వచ్చింది
ఆటో నగర్ ఇండిస్టియల్ ఎస్టేట్‌లో సుమారు 35 పరిశ్రమల వరకూ సిక్ అయి మూతపడ్డాయన్న వివరాలు మా దృష్టికి వచ్చాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా అప్‌గ్రేడ్ కావాలి. అవసరాలు, డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. నిలదొక్కుకోవడానికి ప్యాకేజీలు ఇచ్చినా ఏం లాభమూ ఉండదు. -సిహెచ్.గణపతి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్