నాలుగేళ్లలో 4,709 బడులు మూత

Nov 27,2023 10:03 #schools, #special story
  • 2,045 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు తాళం
  • ప్రైవేట్‌ పాఠశాలలు 2,664 కనుమరుగు
  • తల్లిదండ్రులకు పెరిగిన ఫీజుల భారం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడులు మూతకు దారితీశాయి. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధమని, తాను పేదల పక్షమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదల బడులను లేకుండా చేస్తోంది. సంస్కరణల ప్రభావంతో 2,045 ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడులకు తాళాలు పడ్డాయి. కరోనా ప్రభావంతో చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు నడపలేక 2,664 కనుమరుగయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 63,463 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 61, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 4,287, స్థానిక సంస్థలు (జెడ్‌పి, ఎంపిపి, మున్సిపల్‌) ఆధ్వర్యంలో నడిచేవి 40,708, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు 2,234, ప్రైవేట్‌ పాఠశాలలు 16,173 ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 58,754 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు సంఖ్య 58కు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 3,902కు, స్థానిక సంస్థలవి 40,495, ఎయిడెడ్‌ 787, ప్రైవేట్‌ 13,509కు పడిపోయాయి. మొత్తంగా నాలుగేళ్లలో 4,709 పాఠశాలలు కనుమరుగయ్యాయి.

సంస్కరణలతో సర్కారు బడికి తాళం

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి), అదేవిధంగా అప్పు కోసం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న సాల్ట్‌ పథకం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ప్రభావం పాఠశాలల మూతకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,234 పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం ప్రభుత్వం విలీనం చేసింది. తరగతులను తరలించడంతో మిగిలిన 1, 2 తరగతుల పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయించారు. పిల్లలు లేరని కారణం చూపుతూ ఈ సంవత్సరం 111 ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. జిఓ 117తో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేసింది. దీంతో చేరేవారు లేక 500 వరకు మూతపడ్డాయి.

ప్రైవేట్‌పై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం చిన్న, మధ్య తరగతి ప్రైవేట్‌ పాఠశాలలపై తీవ్రంగా పడింది. ఈ సమయంలో పాఠశాలలు నడవకపోవడంతో సిబ్బందికి, నిర్వహణకు పాఠశాలలకు కష్టంగా మారింది. అప్పులు కూడా పుట్టకపోవడంతో 2,600కుపైగా మూసేశారు.

పెరిగిన ఫీజుల భారం

ప్రభుత్వ, ఎయిడెడ్‌, చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు భారీగా మూతపడటంతో ఉన్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజులను పెంచేశాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై చదువుల భారం పెరిగింది. గతంలో ప్రాథమిక స్థాయిలో సుమారు రూ.15 వేలు ఉంది. ప్రస్తుతం ఇది రూ.25 వేలకు పెరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన ఎన్‌రోల్‌మెంట్‌

పాఠశాలల మూతతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. కరోనా వల్ల 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ బడుల్లో చేరే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలు నడవకపోవడంతో ఈ రెండేళ్లల్లో సుమారు 44 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే ఉన్నారు. 2019-20లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివిన వారి సంఖ్య 40,15,881. ప్రస్తుతం విద్యాసంవత్సరం ఈ సంఖ్య 38,25000కు పడిపోయింది. అంటే నాలుగేళ్లలో 1,90,881 మంది ప్రభుత్వ విద్యకు దూరమయ్యారు.

ఎయిడెడ్‌ నిర్వీర్యం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరితో ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డాయి. వీటిని ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించి సొంతంగానే నడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో కేవలం తక్కువ సంఖ్యతో మాత్రమే ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. మిగిలిన వాటిల్లో చాలామంది పాఠశాలలను నిర్వహించడం లేదు. ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలకు పంపి మూతవేశాయి. విజయవాడలో మాంటిస్సోరి పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ ఇక్కడ పాఠశాలను నడపకుండా సబ్‌కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలను నడుపుతోంది. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు కొంతమంది దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లగా, మరికొంత మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1,400పైగా పాఠశాలలు మూతపడ్డాయి. 2019-20లో 2,234 ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 787కు పడిపోయింది. దీంతో వీటిల్లో చదివే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. 2019-20 విద్యా సంవత్సరంలో 1,96,750 మంది విద్యార్థులు వీటిల్లో చదవగా, ప్రస్తుత విద్యాసంవత్సరం ఈ సంఖ్య 95 వేలకు పడిపోయింది.

➡️