ముప్పు గజాలకే కాదు..

Nov 19,2023 11:42

అనేక జీవజాతులు అంతరించి పోతున్నాయి. కొన్ని అత్యంత వేగంగా కనుమరుగవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆఫ్రికాలో అకస్మాత్తుగా డజన్లకొద్దీ ఏనుగులు చనిపోయాయి. ఆఫ్రికన్‌ సవన్నా ఏనుగులు అకస్మాత్తుగా చనిపోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించింది. విపరీతమైన వేడితో అస్పష్టమైన బ్యాక్టీరియా బారిన పడినట్లు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. కానీ అది నిర్ధారణగా పరిగణింపబడలేదు. ఇటీవల ఆ మిస్టరీకి తెరపడి, ఆందోళనకరమైన ఫలితాలు తెలిశాయి. ఈ ప్రభావం మరిన్ని జాతులను అంతమొందించే పరిస్థితులు ఎదురవబోతున్నాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.
జగానికీను..!
వాయువ్య జింబాబ్వేలో 2020 ఆగస్టు నుండి నవంబర్‌ మధ్య కాలంలో 35 ఏనుగులు, దాని పొరుగునే ఉన్న బోట్స్వానాలో, అదే సంవత్సరం 350 ఏనుగులు హఠాత్తుగా చనిపోయాయి. దాదాపు ఇరవైమైళ్ళ పరిధిలోనే ఈ విపత్తు జరిగింది. ఈ సామూహిక మరణాలను శాస్త్రవేత్తలు ‘పరిరక్షణ విపత్తు’గా అభివర్ణించారు. మరణించిన ఏనుగుల్లో పదిహేను మతదేహాలను పరిశీలించారు. బోట్స్వానా ఏనుగుల మరణానికి సైనోబ్యాక్టీరియా కారణమని నిర్ధారణ అయ్యింది.


కానీ జింబాబ్వే ఏనుగుల విషయంలో పాశ్చురెల్లా మల్టోసిడా అయితే కాదుగానీ, అలాంటిదే ఉందని అధ్యయనకర్త రోసెన్‌ చెప్పారు. ఆరు మృతదేహాల నమూనాలలో బ్యాక్టీరియాపై జన్యు విశ్లేషణ, ఐసోలేషన్‌ ప్రక్రియలను చేశారు. ఎట్టకేలకు ‘బిస్‌గార్డ్‌ టాక్సన్‌ 45’ అనే బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ అయింది. మిగిలిన తొమ్మిది ఏనుగుల నుండి వచ్చిన నమూనాలో ఈ బ్యాక్టీరియా లేదు. ఆ మృతదేహాలు బాగా కుళ్ళిపోయాయి. దాంతో వేరే ల్యాబ్‌లకు పంపి, అధ్యయనం చేసే అవకాశం లేకపోయింది.
AూనA విక్టోరియా ఫాల్స్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌, దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు జరిపారు. ‘ఏనుగులు అత్యంత స్నేహశీలి స్వభావం కలిగి ఉంటాయి. దానితోపాటు కరువు, అంటువ్యాధుల వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందేందుకు కారణమయ్యి ఉండవచ్చు’ అని వైరాలజీ హెడ్‌ ఫాల్కో స్టెయిన్‌బాచ్‌, యుకె యానిమల్‌ అండ్‌ ప్లాంట్‌ హెల్త్‌ ఏజెన్సీ, సర్రే విశ్వవిద్యాలయంలో వెటర్నరీ ఇమ్యునాలజీ ప్రొఫెసర్‌ తెలిపారు.


‘అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇవి మరణించాయి. విపరీతమైన బాధను అనుభవించాయి. ఇలానే చాలా జంతువులు చనిపోతున్నాయి. మున్ముందు చాలా జాతులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మానవులతో సహా అతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసిన తరుణం ఏర్పడనుంది’ అంటున్నారు అధ్యయన రచయిత, జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ పశువైద్యులు డాక్టర్‌ క్రిస్‌ ఫోగిన్‌.
శాస్త్రవేత్తల బృందం బ్యాక్టీరియా ఐసోలేషన్‌, జన్యు విశ్లేషణ అధ్యయనాల ద్వారా ‘బిస్‌గార్డ్‌ టాక్సన్‌ 45’ బ్యాక్టీరియా ఉనికిని నిర్ధారించింది. ఈ బ్యాక్టీరియా రక్తంలో ప్రవేశించి, రక్తాన్ని విషపూరితం చేస్తుంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఇబ్బంది, లోబిపి, అతి వేగంగా గుండె కొట్టుకోవడం, మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఎదురవుతాయి. అవయవ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. చివరకు మరణానికి దారితీస్తుంది.
డబ్ల్యుహెచ్‌ఓ, మరికొన్ని సంస్థలు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఎప్పటికప్పుడు విశ్వం క్లిష్ట పరిస్థితులను మనకు విశదపరుస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని మనకు అర్థమయ్యేలా చెబుతూనే ఉన్నారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ పర్యావరణ కర్తలుగా విధి నిర్వహణలో పాలుపంచుకుంటారని ఆశిద్దాం.

➡️