గొర్రెల గుంపు చెల్లా చెదురుగా పరిగెడుతున్నది. వాటినెవరూ తరమడం లేదు. కానీ అవి అడ్డదిడ్డంగా పరుగులు పెడుతూనే ఉన్నాయి. అక్కడ చూడండి, అగ్ని గోళాల లాంటి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ ఒకామె ఇటువైపు వస్తున్నది- ఆమే, అమ్మతల్లి మండవల్లి మరియమ్మ. ఈ ఊరి గ్రామదేవత. ఈ గ్రామం అంటురోగాల బారిన పడకుండా కాపాడే దేవత. అవును, ఆ ఉగ్రరూపంలో ఉండే దేవత కోసమే ఈ గ్రామప్రజలు గుడిని కట్టి, కొలుపులు చేస్తున్నారు. ఎంతయినా, మెదడంతా భయంతో నిండినప్పుడే కదా, భక్తి ఉప్పొంగేది. ఆ గుడి ఇప్పుడు శిథిóలావస్థలో ఉంది- గుడి చుట్టూ గుంపులు గుంపులుగా జనాలు చేరారు.. గుడి ఎదురుగుండా రెండు గొర్రెలను కట్టారు. వాటిని నీళ్లతో స్నానాలు చేయించారు. పసుపు కుంకుమలద్దారు. పూలదండలతో అలంకరించారు. మరియమ్మ రంకెలేసింది, ‘ఆ గొర్రెలను బలివ్వకండి. మీరు గనక ఆ గొర్రెలను బలిచ్చారంటే, నేను వెంటనే గ్రామమంతా మశూచిని వ్యాపింపచేస్తాను.. ఊరంతా ఊడ్చేస్తాను. అసలు మీరు నా భక్తులేనా లేక రాక్షసులా? నాపేరు మరియమ్మ. ఈ గ్రామంలోని, గొర్రెలతో సహా సకల జీవరాశులను కాపాడే బాధ్యత నాది. కానీ మీరేం చేస్తున్నారు? నా రక్షణలో ఉన్న జీవాలను నాకే బలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు అసలు బుద్ధి లేదు. నాకు అర్పించడానికి మీరెవరు? కావాలనుకుంటే నా ఆహారాన్ని నేను సంపాదించుకోలేనా? గొర్రెలను చంపుకుని నేనే తినలేనా?”అమ్మా – నువ్వు అలా అనవచ్చా? కొన్ని క్షణాల ముందు ఇదిగో ఈ వెధవ ఇదే ప్రశ్న వేశాడు. అంతే, వాడి తల నరికేందుకు మేము సిద్ధపడ్డాము. ఆ దెబ్బతో వాడు నోరు మూసేశాడు.”వాడు కాదు వెధవ. మీరు వెధవలు. మీకసలు మెదళ్ళు ఉన్నాయా? మీ మెదళ్ళు పుచ్చిపోయాయి. నిజంగా నేను శక్తివంతమైన దేవతనని మీరనుకుని ఉంటే, నా సృష్టిని నాకర్పించే సాహసం చేసేవారా?”అమ్మా ! అది మన సంప్రదాయం కాదా?”మీరు సాంప్రదాయాల పేరుతో ఈ రోజు మీ దేవతలకు నమ్మకద్రోహం చేస్తున్నారు. వేలాది దేవతలను సృష్టించుకున్నారు. ప్రతి దేవతకూ ఒక కుటుంబాన్ని తయారుచేశారు. ప్రతి దేవతకి వందలాది గుడులను కట్టారు. అక్కడ రకరకాల ఉత్సవాలు జరుపుతున్నారు. బలులు ఇస్తున్నారు. బాణాసంచాలు కాలుస్తున్నారు – అదంతా ఓ పనికిమాలిన ఆటని ఈ రోజు తేటతెల్లమైంది’ అంటూ మరియమ్మ కట్టివేసిన గొర్రెల తాళ్లు తెంపేసింది. గొర్రెలు పరుగులు తీయకముందే మూక చెల్లాచెదురైంది.
దేముడు సృష్టించిన జీవాలనే తిరిగి దేముడికి బలివ్వడం ఎంత తెలివితక్కువ తనం. అందులో దయ లేకపోవడం మాట అటుంచి, కనీసం తర్కం కూడా లేదు కదా! గొర్రెలు, కోళ్లు ఆహారంగా తీసుకోవడాన్ని అర్థంచేసుకోవచ్చు. అకారణంగా వాటిని చంపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనిషి సంపూర్ణ మానవునిగా ఇంకా వికసించకముందు పశువుల్ని చంపి, ఆ రక్తాన్ని దేవునిపై భక్తిని ప్రదర్శించడానికి భూమి అంతా వెదజల్లేవాడు. ‘ఆ సంప్రదాయాలను ఈ రోజు కూడా పాటించ వలసిందేనా? బలికోరే దేవతలను ముందు బలి ఇద్దాం!’ అన్నాడు ఓ హేతువాది. అతనికి మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు. వజ్రాలు అరుదుగా దొరుకుతాయి. అయినా వాటి విలువ తక్కువ ఉండదు. అదే ఇసుక ఎక్కడచూసినా కనిపిస్తుంది. కానీ దానిని ఎవరూ పట్టించుకోరు కదా!మూక హేతువాదిని బెదిరించి, అతని గొంతు నొక్కేసింది.
‘మనం ఈ భూమిని వదిలేసి- హాయిగా మన ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా భారతదేశాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాము. ఎన్నో దేశాలలో దేవతలు భూమిని వదిలేసి, వెళ్లిపోయారు. కొన్ని దేశాలలో అయితే దేవతలు బహిష్కరించబడ్డారు కూడా. థోర్, ఓడిన్ వంటి దేవతలు ఎక్కడికి మాయమయ్యారో నాకయితే తెలియదు. ఇక్కడ మాత్రం మారి, కాళీ, తిరుసూలి, ముత్యాలు, రావుత్తం, మునియమ్మ, సంగిలికరుప్పన్ తిరుగాడుతూనే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఈ మానవ ప్రపంచాన్ని విసర్జించాలని అనుకుంటున్నాను. అంటురోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడడం నా బాధ్యత. కానీ ఇప్పుడా అవసరం తీరిపోయింది. అంటువ్యాధులు సోకగానే ప్రజలు టీకా మందులు వేసుకుంటున్నారు- నా శక్తికి భయపడే వారెవరు? ఇక నా భక్తులకా, కావలసినన్ని తెలివితేటలున్నా ధైర్యం లేదు. వారికి ధైర్యం కన్నా, నా పట్ల ఉన్న భక్తి భావం మెండు. అందువలనే నా కోసం చేస్తున్న ఈ బలి క్రతువును ఆపలేకపోతున్నారు. ఇక నాకిక్కడ పనిలేదు. నేను భూమిని వదిలిపోవడానికే నిశ్చయించుకున్నాను. నా కోసం బలివ్వడం ఎంత హేయం! వాటిని ఆపేవారిని వ్యతిరేకించడం ఎంత మూర్ఖత్వం. నన్ను ఈ గుడి కట్టించిన కోణంగి పిళ్ళై దగ్గరికి వెళ్లనివ్వండి. అతనితోనే ఈ విషయం తేల్చుకుంటాను.’
గుడి పూజారి భోగలింగంకి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. గుడి లోపలి నుండి అతడికి స్పష్టంగా మాటలు వినిపించినట్టు అనిపించింది. మరియమ్మ గొణుగుకుంటూ గుడి లోపలి నుండి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ‘అమ్మా!”నన్ను ఆపే ప్రయత్నం చేయకు, బుద్ధిలేనివాడా అడ్డు లే!”కానీ, ఎక్కడికి..?”కోణంగి పిళ్ళై..!’అమ్మ క్షణాలలో అదృశ్యమైంది. పూజారి కాళ్ళు వణికాయి. అచేతనంగా నిలబడిపోయాడు.
‘భ్రష్టుడా! నువ్వొక దోషివి. భక్తుడినని చెప్పుకోడానికి నీకు సిగ్గయినా లేదా?’ అమ్మ మాటలు వినిపించాయి. ‘గొర్రెలను బలివ్వడం పాపమని నేను అరుస్తూనే ఉన్నాను.”కానీ ఇప్పటికే నాలుగు గొర్రెలను అమ్మ పేరు మీద బలివ్వడం అయిపోయింది కదా!”హంతకుడా !”అది హత్య కాదు.. బలి”అంతేనా, నువ్వు అబద్ధాలను కూడా ప్రచారం చేశావు. అంతకంటే ఘోరం, ప్రజల మధ్య నాకు శక్తులేవీ లేవని ప్రచారంలో పెట్టావు. నా గుడి నుండి నా విగ్రహాన్ని దొంగిలించావు.”అదా! అది కేవలం ఆ హేతువాదులను ఇరికించడానికి. వాళ్ళను తెలివితక్కువ వారిగా చూపడానికి.”నన్ను ఒక ఆటబొమ్మగా ఆడుకుంటున్నావు. నీ అబద్ధ ప్రచారానికి వాడుకుంటున్నావు.”కాదు కాదు కాదు”నువ్వే గనక నేను శక్తిలు కల దానిని అని నమ్మి ఉంటే, ఆ పోలీసుల దగ్గరికి వెళ్లి, తప్పుడు కేసు నమోదు చేసేవాడివి కాదు. నా దగ్గరికి వచ్చి ఉండేవాడివి!”అబ్బే! అలా కాదమ్మా !! ఆ నీతిమాలినోళ్లకి శిక్ష పడవద్దా?”వాళ్ళని శిక్షించే అధికారం నీకెక్కడిది? నీ దేవతను నేనిక్కడ ఉన్నాను. జరుగుతున్న ప్రతిదానినీ పరికిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు నువ్వు నా పని ఎందుకు చేయడానికి పూనుకున్నట్టు? అతడు నాకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. పైగా అతడు మాట్లాడిన దానిలో నిజం ఉంది.”కానీ, అతడు బలులిచ్చే సంప్రదాయం..”అవును. అది పాపమే. నన్ను అవమానం నుంచి కాపాడడానికే అతడలా అన్నాడు.’కోణంగి పిళ్ళైకి మగతగా అనిపించింది. జరుగుతున్నదేమిటో అతనికి అర్థం కావడం లేదు. ‘కోణంగి.. నీలాంటి భక్తుల వలనే మేమీరోజు అపఖ్యాతి పాలయ్యాం. మీవలనే మేమిక ఇక్కడ ఉండలేకపోతున్నాం. మీరొక పక్క మా భక్తులమని చెప్పుకుంటుంటారు. మమ్మల్ని అనుసరిస్తున్నాం అంటారు. మరోపక్క మమ్మల్ని అపఖ్యాతి పాలు చేస్తుంటారు. నేనిక వెళ్ళిపోతున్నాను. ఈ గ్రామం ఇలాగే ఉంటుంది. కానీ నీలాంటి తెలివితక్కువ వారు ఇక్కడ ఉండరు.’అంతే, ఆమె వెళ్ళిపోయింది.కోణంగి పిళ్ళైకి మెలుకువ వచ్చింది. జరిగినదంతా ఒక కల అని గ్రహించాడు. తన ఎదురుగుండా తాను దొంగిలించిన అమ్మవారి విగ్రహం నవ్వుతూ నిలబడి ఉంది. అతడు ఊళ్లోని హేతువాదుల నోళ్లు మూయించాలని అనుకున్నాడు. అమ్మవారి విగ్రహం దొంగిలించారని వారిపై నింద మోపాలనుకున్నాడు. అందులో భాగంగానే తన దగ్గర పనిచేస్తున్న వారితో ఊరంతా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని ప్రచారం చేయించాడు. పూజారి భోగలింగానికి కూడా ఈ విషయమే చెప్పాడు. కానీ దురదృష్టం కొద్దీ ఊరు తెల్లవారక మునుపే విగ్రహం దొంగిలించడంలో ప్రధానపాత్ర పోషించిన పనివాడు ఊరందరి ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంకా తనకొచ్చిన కల పూర్తిగా చెరగక మునుపే.. ఊరి జనాలు కోణంగి ఇంటిని చుట్టుముట్టారు. కోణంగి వణికిపోయాడు. తన ముందున్నవారు కేవలం ఒక మూక కాదు. గుంపు. ప్రజలందరూ సంఘటితమైన గుంపు.
(2023 నవంబర్ 3 ఫ్రంట్‌లైన్ నుంచి)
తెలుగు : కె. ఉషారాణితమిళమూలం : సిఎన్ అన్నాదురై (1951లో)
ఆంగ్లం : వి. రామకృష్ణన్