బొమ్మరిల్లు తల్లిదండ్రులు కావొద్దు..

Nov 26,2023 09:17 #Sneha, #Stories
respect children opinions

పిల్లలు ఏదైనా అడగటం ఆలస్యం.. ‘నీకేం కావాలో.. ఎలాంటిది కావాలో.. నాకు అర్థమయ్యిందిలే.. నేను తెస్తాగా..!’ అనేస్తుంటారు కొందరు నాన్నలు. ‘నీకు ఎలాంటి డ్రెస్‌ కావాలో నాకు తెలుసులే స్వీటీ.. నీకే ఏది తీసుకోవాలో, ఏంటో తెలియదు.. నేను తీసుకుంటాలే..!’ అంటారు ఇంకొందరు అమ్మలు.. ఇదేమీ అమ్మలు.. నాన్నలు తప్పు అని చెప్పటం కాదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు అన్నీ సమకూరాలనీ.. వారి భవిష్యత్తు బాగుండాలనీ కోరుకుంటారు. అలాగనీ అన్నీ తమకే తెలుసు.. పిల్లలకేం తెలియదని ఒక నిర్ణయానికి రావడం.. ఆ విధంగా వ్యవహరించడమే తప్పు. పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం మంచిదే.. అలాగని వారు అడగ్గానే వాళ్లకు ఏమీ తెలియదనీ, మనకే అన్నీ తెలుసనీ.. ఆ బాధ్యత తమది మాత్రమే అనే ధోరణి సరికాదు. పిల్లలు.. పిల్లలు.. అనీ ఎంత పెద్దవుతున్నా.. విషయాలు తెలుసుకుంటున్నా.. వాటిని అవగాహన చేసుకోవాల్సి పెద్దరికం అవసరం డియర్‌ ఫాదర్స్‌ అండ్‌ మదర్స్‌.

చదువులో..

పిల్లలు పదో తరగతి పాసవ్వగానే వాడు ఏం చదవాలో ఎప్పుడో అమ్మానాన్నలే నిర్ణయించేస్తారు. అందుకు తగ్గ ఆర్థిక ప్రాతిపదికన ప్రణాళికలు వేసేస్తారు. ఈ కార్పొరేట్‌ చదువుల్లో అంతా కొనడమే కదా.. అందుకే పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాడిని ఫలానా సబ్జెక్టే చదవాలని నిర్ణయించేస్తారు. పెద్దయ్యాక వాళ్లు ఏమవ్వాలని అనుకుంటున్నారో ఒక్కసారైనా, కూర్చోబెట్టి మాట్లాడం. దాంతో కొన్నిసార్లు వాళ్లకు ఇష్టంలేని సబ్జెక్టు ఎంపిక చేస్తే.. ఆ అభిప్రాయం చెప్పే ప్రయత్నాన్నీ మొగ్గలోనే తుంచేసి, ‘నీకేం తెలుసు? జీవితాన్ని కాచి వడపోసినట్లు మాట్లాడుతున్నావ్‌.. అన్నీ ఆలోచించే ఇది నిర్ణయించాం!’ అంటూ వాళ్లని నోరెత్తనీయకుండా చేస్తాం. దీంతో వాళ్లు ఆ చదువు ఇష్టంతో కాకుండా కష్టంతో చదువుతారు. ఫలితం తల్లిదండ్రులు ఊహించినట్లు కాకుండా భిన్నంగా వస్తుంది. అప్పుడు కారణం పిల్లలదే అని వాళ్లపై నెట్టేయకండి. అసలు పాత్రధారులు, సూత్రధారులు తల్లిదండ్రులే.

కాలేజీ ఎంపికలో..

ఏ కాలేజీలో చేరాలో కూడా తల్లిదండ్రులే నిర్ణయించేస్తారు. అలా అనీ వాళ్లనీ తప్పుబట్టలేం. ఆర్థికంగానే కాకుండా, చదువు నాణ్యత గురించి అన్ని రకాలుగా ఎంక్వయిరీలు చేసుకునే ఎంపిక చేస్తారు. పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని అక్కడ పోస్టర్లపై తమ పిల్లల ఫొటోలను ఊహిస్తూ కలల లోకంలో విహరిస్తుంటారు. అయితే పిల్లలు కూడా తమ తోటి విద్యార్థుల ద్వారా, అప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల నుంచి కొన్ని విషయాలు సేకరిస్తారు. ఆ సమాచారం కూడా ఏమిటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాకాకుండా.. ‘గాలి మాటలన్నీ పోగు చేసుకొచ్చి వినిపించకు.. మా చెవుల్లో భయం భయంగా ఆ కాలేజీకే వెళతారు. అక్కడ ఏదైనా జరిగినా తల్లిదండ్రులకు చెప్పడానికి జంకుతారు. చివరకు ఒక్కోసారి అటూ ఇటూ తేల్చుకోలేక బలహీన క్షణాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు ఎంత దుఃఖించినా ఉపయోగం ఉండదు.

డ్రెస్‌ విషయంలోనూ..

చివరకు పిల్లలు వేసుకునే డ్రెస్‌, ఇతర గార్మెంట్స్‌ విషయంలోనూ తల్లిదండ్రులదే పెత్తనం.. ‘మీకేం తెలియదు.. వాటి నాణ్యత, ధర అంచనా మీకేం తెలుసు. పిల్లలనీ పనికిరానివి అంటగట్టేస్తారు. తర్వాత ఏడుస్తారు.. అన్నీ పెద్దవాళ్లం మాకు తెలుసు కదా..!’ అంటూ వాళ్ల ఇష్టాయిష్టాలను చిదిమేస్తుంటాం. వాళ్లు స్నేహితుల దగ్గర ఒక్కోసారి అభాసుపాలవుతారు. ‘ఏరా ఈ రంగేంటి? ఆ డిజైన్‌ ఏంటి? నీకసలు టేస్ట్‌ లేదు బ్రో!’ ‘ఏంటే సుమా! ఇలాంటి ప్యాట్రన్‌ సెలక్ట్‌ చేసుకున్నావు.. అసలు నీకు ఏది నప్పుతుందో, లేదో కూడా నీకింకా తెలియకపోతే ఎలానే?!’ అంటూ కామెంట్స్‌ చేస్తుంటే.. ఈ పిల్లలు వాళ్ల ముందు ఇది మా సెలక్షన్‌ కాదనీ చెప్పలేరు.. అవుననీ చెప్పలేరు.. ఇలా వాళ్ల ముందు మనపిల్లలు షేమ్‌ కావడం ఎంత వరకు కరెక్టో పేరెంట్స్‌ ఆలోచించాలి. వాళ్లు నలుగురిలో ఉన్నప్పుడు గమనిస్తుంటారు. తమకు ఎలాంటివి నప్పుతాయో, ఎలాంటి ట్రెండ్స్‌ వస్తున్నాయో ఫాలో అవుతుంటారు. తల్లిదండ్రులు నాణ్యత, ధర విషయంలో వాళ్లకు కొన్ని సూచనలు చేసి వదిలేయాలి. అంతేతప్ప వాళ్లకేమీ తెలియదనే మాలోకాలు అన్నట్లు తయారుచేయకండి.. ప్లీజ్‌!

➡️