పోషకాహార లోపం.. మూఢ నమ్మకాలు.. సామాజిక.. ఆర్థిక కారణాల రీత్యా ప్రతి ఏటా అనేకమంది శిశువులు మరణిస్తున్నారు. వైద్య రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శిశువులకు సంబంధించిన వైద్య సేవలు ఎన్నో విస్తరించాయి. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటికీ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల్లో మూఢ నమ్మకాలు పెరిగిపోవడం.. ఆ కారణంగా ప్రతి ఏటా లక్షల సంఖ్యలో శిశు మరణాలు జరగడం విచారించదగిన అంశం. శిశు మరణాల రేటు తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబరు 7వ తేదీన ‘శిశు రక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే కేవలం ఆ ఒక్కరోజున మాత్రమే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కాదు.. నిరంతరం శిశు రక్షణా కార్యక్రమాలను చేయడం వలన ప్రజల్లో అవగాహన పెరిగి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..
నేటికీ మూఢ నమ్మకాలతో గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక, శిశువుల మరణాలు సంభవిస్తున్నాయి. అవిద్య, పేదరికం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఇది సామాజికంగా రావాల్సిన చైతన్యం. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న దశలో నేడు మరింతగా మూఢ నమ్మకాలు ప్రబలడం విచారకరం. ఈ నేపథ్యంలో ఇలాంటివాటిని రూపుమాపే విధంగా, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిశువు అంటే..
అప్పుడే పుట్టినప్పటి నుండి మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకు శిశువుగా పరిగణిస్తారు. ఈ సంవత్సర కాలంలో శిశువులను జాగ్రత్తగా చూడటంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలోగానీ లేదా ఇతర దేశాలలోగానీ చూస్తే ఎక్కువగా మరణాలు ఏడాదిలోపు పిల్లల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల పిల్లల్లో మరీ ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఏడాదిలోపు పిల్లల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనే విషయాలను తెలుసుకోవాలి. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తరువాత మొదటి మూడు నెలలు అభివృద్ధికి కీలక దశ. ఈ సమయంలో వినికిడి, కంటి చూపు, ఆలోచన, స్పందన తదితర విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను కనుక పరిశీలిస్తే 2019లో పుట్టిన శిశువులు మొదటి నెలలోనే 24 లక్షలకు పైగా శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
కారణాలను పరిశీలిస్తే..
శిశు మరణాలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. తల్లికి, బిడ్డకు సంబంధించినవి, సామాజిక, ఆర్థికపరమైనవి ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నాలుగు కారణాల వల్లనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
తల్లికి సంబంధించి..
తల్లికి సంబంధించిన కారణాలను పరిశీలిస్తే చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ప్రధాన కారణంగా ఉంది. వివాహ వయసు రాకుండానే వివాహాలు చేయడం వలన తల్లిలో సక్రమంగా శారీరక ఎదుగుదల ఉండకపోవడం.. అలాగే పిల్లల సంరక్షణపైనా ఆమెకు సరైన అవగాహన లేకపోవడం.. ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అలాగే వివాహం అయిన వెంటనే గర్భం దాల్చడం వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది. శిశు మరణాలను కనుక పరిశీలిస్తే ఎక్కువ మంది బరువు తక్కువగా పుట్టడం వలన మరణిస్తున్నారు. గర్భిణీగా ఉన్న సమయంలో తల్లికి బిపి, షుగరు, గుర్రపువాతం వంటి లక్షణాలు ఉండటం కారణంగా బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారు. అలాగే నెలలు నిండకుండానే ఎక్కువ మంది తల్లులు ప్రసవిస్తున్నారు. ఈ కారణాల రీత్యా పిల్లల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. వీటిని నివారించాలంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిత్యం పరీక్షలు చేయించుకోవడంతో పాటు.. చక్కటి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహ వయసు వచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలి. అలా చేయడం వలన ఆడపిల్లలకు అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది. దాని కంటే ముఖ్యంగా శిశు రక్షణ ఎలా చేయాలో తెలుసుకోగలుగుతారు.
బిడ్డకు సంబంధించి..
బిడ్డకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోక పోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా మంది గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.. వీటన్నింటివల్ల పిల్లలు పుట్టిన తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా జన్యు పరంగా ఎటువంటి సమస్యలు వున్నాయో కూడా ముందుగానే తెలుసుకోవాలి. గర్భిణీగా ఉన్న సమయంలోనే బిడ్డ ఎదుగుదల గురించి, బరువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలున్నాయేమో గుర్తించేందుకు మూడు సార్లు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
సామాజిక కారణాలు..
సామాజిక కారణాలను అనేక విధాలుగా చూడవచ్చు. నేటికీ మన సమాజంలో ఆడపిల్ల అంటే తక్కువగా చూసే దుస్థితి కనబడుతోంది. దీని నుండి ముందు మనం బయటపడాల్సిన అవసరం ఉంది. శిశువు పుట్టగానే అమ్మాయిలు అయితే తక్కువగా చూడటం, అబ్బాయిలు అయితే అల్లారుముద్దుగా పెంచడం కూడా జరుగుతుంది. దీని కారణంగా తొలి రోజుల్లోనే శిశువు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అవిద్య, పేదరికం, సరైన సమయంలో ఇబ్బందులను గుర్తించకపోవడం, సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం వలన కూడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.
మూఢ నమ్మకాలు..
మూఢ నమ్మకాలు శిశు మరణాలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా శిశువు జన్మించగానే తల్లిపాలు పట్టించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది నేటికీ తేనె, పంచదార నీళ్లు పట్టించడం, కొన్నిచోట్ల గోమూత్రం పట్టించడం వంటివి చేస్తున్నారు. వీటి కారణంగా శిశువుల్లో అనేక రకాలైన ‘ఇన్ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో విరేచనాలు అవుతుంటే అనాస పేరుతో నాటు వైద్యాలకు వెళుతున్నారు. ఇటీవలే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాగే జరిగి, చివరకు శిశువు పరిస్థితి ప్రాణాంతకం కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ శిశువులకు నాటు వైద్యం మంచిది కాదు. ఈ విధంగా అనేక మూఢ నమ్మకాల వలన ‘గోల్డెన్ అవర్’ లో శిశువులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికీ చాలాచోట్ల నాటు వైద్యం, నమ్మకాలు పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు, విశ్వాసాలు కూడా అంతకంతకు పెరగడం విచారించాల్సిన విషయం. పురోగమించాల్సిన దశలో ఈ తిరోగమన భావాలు శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకంటే ముఖ్యంగా శిశువుకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు గానీ లేదా సమీపంలోని ఆసుపత్రికిగానీ తీసుకువెళ్లాలి. కచ్చితంగా శిశువుకు వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉంది.
స్నానం జాగ్రత్తలు..
శిశువుకు స్నానం చేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
శిశువు టబ్‌లో ఉన్నప్పుడు మీ చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసుకోవాలి.
టబ్‌లో కొన్ని అంగుళాల వెచ్చగా ఉన్న నీటితో నింపాలి.
నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు.
వ్యాక్సినేషన్..
మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకూ శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్స్ వేయించాలి. సూది ఇవ్వడం వలన జ్వరం వస్తుందని.. లేదా ఇతరత్రా సమస్యలు వస్తాయనే మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి. దీనివల్లే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో వ్యాక్సినేషన్ వేయించడానికి వెనకాడుతున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా అక్కడక్కడా కొంత మంది కుటుంబ పెద్దల అవగాహన లేని మాటల కారణంగా వ్యాక్సినేషన్ వేయించడం లేదు. కానీ మొదటి ఏడాది లోపు క్యాలెండర్ ప్రకారం కచ్చితమైన వ్యాక్సినేషన్ శిశువులకు అందించాల్సిన అవసరం ఉంది. ఇది బిడ్డకు రక్షణగా నిలుస్తుంది. ఆ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
ఆర్థిక కారణాలు..
సమాజంలో నేటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ప్రస్తుతం ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా కొంతమంది వైద్యం చేయించు కునే అవకాశం కోల్పోతున్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాలలో ‘రవాణా’ వ్యవస్థ అందుబాటులో లేక వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు. వీరికి పట్టణ ప్రాంతాలకు వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉండటం లేదు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
అయితే కొన్నిచోట్ల ఇంటి వద్దనే కాన్పు చేయిస్తున్నారు. అలా చేయడం వలన తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే కాన్పు జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మెరుగైన వైద్య సేవలు, తగిన వైద్య పరికరాలు ఉండేలా చూడటం, ప్రజలకు అవగాహన కల్పింవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
తల్లిపాలే బిడ్డకు రక్ష ..
బిడ్డకు తల్లిపాలే రక్ష. అసలైన పోహాకాహారం, ఆరోగ్యాన్నిచ్చేది తల్లిపాలే. కానీ నేటి సామాజిక పరిస్థితులు, తల్లులు ఉద్యోగ రీత్యా, కొన్ని అనారోగ్య కారణాల వలన.. మరికొందరు తమ అందం పోతుందనే భయంతో బిడ్డకు పాలివ్వని పరిస్థితులున్నాయి. శిశువులకు తల్లిపాలు జీవితాంతం రక్షణనిస్తాయి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిపాలే బిడ్డను కాపాడేది. తల్లిపాలను బిడ్డకు ఆరు నెలలు కచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వకపోవడం వలన రోగనిరోధక శక్తి లేక బిడ్డకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చేలా కుటుంబంలో అందరూ బాధ్యత తీసుకోవాలి.
అవగాహన పెరగాలి..
శిశు రక్షణపై పూర్తిస్థాయిలో పెద్దఎత్తున అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిండంతో పాటు ప్రజలను పిహెచ్‌సి (ప్రైమరీ హెల్త్ సెంటర్లు) కు రప్పించి, వైద్య సేవలు పొందేలా చూడాలి. దీంతో పాటు వైద్య సదుపాయాలు ప్రజల వద్దకే వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) ప్రచురించిన ‘లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ’ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు 2006 నుంచి 2019కి సగటున 37 నుంచి 22కు తగ్గింది. 1990 నుంచి చూస్తే 2019కి 57 నుంచి 22కు తగ్గింది. ఇదే పీరియడ్‌లో నవజాత శిశు మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గింది. శాతాలలో చూస్తే, నవజాత శిశు మరణాల రేటు 1990 నుంచి 2005కు 39% తగ్గగా, 2005 నుంచి 2019కి 41% తగ్గింది. 1990 నుంచి 2019కి 60% తగ్గింది. అంటే నవజాత శిశు కేంద్రాలను ఏర్పాటు చేశాక నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లల నివారించగల మరణాలను అంతం చేయడంలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) చేరుకోవడానికి ప్రపంచం గణనీయంగా దూరంగా ఉంది.
నివేదిక ప్రకారం 2030 నాటికి 50 కంటే ఎక్కువ దేశాలు ఐదేళ్లలోపు మరణాల లక్ష్యాన్ని చేరుకోలేవు. 60 కంటే ఎక్కువ దేశాలు తక్షణ చర్య లేకుండా నియోనాటల్ మరణాల లక్ష్యాన్ని కోల్పోతాయి. ఎస్‌డిజిలు నవజాత శిశువులు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలను నివారించాలని పిలుపునిచ్చాయి. అన్ని దేశాలు నవజాత శిశు మరణాల రేటు 1,000 సజీవ జననాలకు 12 లేదా అంతకంటే తక్కువ మరణాలు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ మరణాల రేటు 25 లేదా అంతకంటే తక్కువ మరణాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030 నాటికి 1,000 సజీవ జననాలు. 2020లో మాత్రమే ఐదు లక్షలకు పైగా పిల్లలు వారి ఐదవ పుట్టినరోజుకు ముందే మరణించారు. 22 లక్షల మంది పిల్లలు, 5 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు మరణించారని ఆ నివేదిక పేర్కొంది.
పిల్లల హక్కులు, శ్రేయస్సు అభివృద్ధి : యునిసెఫ్
పిల్లల శ్రేయస్సుపై ఎక్కువ ప్రభావం చూపే ప్రయత్నాలను ఏకీకృతం చేసే కన్వర్జెంట్ సోషల్ పాలసీ విధానం, సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రధానం. దీనిద్వారా సామాజికంగా మెరుగుపరచడం, పర్యావరణాన్ని బలోపేతం చేయడంపై యునిసెఫ్ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. పిల్లల కోసం ఫలితాలను మెరుగుపరచడంలో కేరళలో వివిధ కార్యక్రమాలతో శిశు మరణాలను తగ్గించడంలో గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతి సాధించింది. కేరళ ప్రోగ్రామ్ ప్రయత్నాల కోసం యునిసెఫ్ రాష్ట్ర కార్యాలయం సామాజికంగా మెరుగుపరచడం, సంఘటిత సామాజిక విధానం, సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. పిల్లల శ్రేయస్సుకు ఉపయోగపడేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది.
దేశంలోనే కేరళ ఆదర్శం..
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేరళ అగ్రగామిగా ఉంది. అత్యంత అట్టడుగువర్గాల్లోని పిల్లలు, మహిళల కోసం పేదల అనుకూల విధానాలు, సామాజిక రక్షణ కార్యక్రమాలను ప్రారంభించడంలో మనదేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాష్ట్రం సామాజిక భద్రతా చర్యలు, ఆరోగ్యం, పోషకాహారం, వాష్, విద్యావ్యవస్థల విస్తరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ప్రగతిశీల చట్టాలు, పథకాలను ఆ రాష్ట్రం ప్రవేశపెట్టింది.
యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్‌ఓ) కేరళను ప్రపంచంలోనే మొట్టమొదటి ”బేబీ-ఫ్రెండ్లీ స్టేట్” గా గుర్తించాయి. ఎందుకంటే ఫార్ములాల కంటే తల్లి పాలివ్వడాన్ని సమర్థవంతంగా ప్రోత్సహించింది కేరళ. కేరళలో ప్రసవాలు 95 శాతానికి పైగా ఆసుపత్రిలో జరిగేలా ప్రోత్సహిస్తోంది. దేశంలోనే అతి తక్కువ శిశు మరణాల రేటు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయింది. మూడవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వైద్య సదుపాయాలలో 100 శాతం జననాలతో ‘ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీ’లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
దశాబ్దాలుగా ఈ సామాజిక విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడితో, సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించింది. పర్యవేక్షణను సులభతరం చేసే బలమైన పరిపాలనా నిర్మాణాలు, వ్యవస్థలు సమర్థవంతంగా కేరళలో అమలు చేయబడ్డాయి. ఇది ఆరోగ్యం, పోషణ, విద్యలకు సంబంధించి పిల్లల శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. శిశు, నవజాత శిశు మరణాలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో మరణాల పెరుగుదల తక్కువగా ఉంది.
– డాక్టర్ ఎన్.ఎస్.విఠల్‌రావు
ఎం.డి.(పీడియాట్రిక్స్), డిసిహెచ్.
రిటైర్డ్ ప్రిన్సిపాల్, సిద్దార్థ ప్రభుత్వ వైద్యకళాశాల, విజయవాడ
944 000 6299