జాడ్యం

Nov 19,2023 09:58 #Sneha

పూల నవ్వులతో పాల బుగ్గలతో
అమాయకంగా చూసే పసిదాని నుండీ
పళ్ళూడి బోసినవ్వులతో, అందని చూపుని
అద్దాల్లో బిగించిన పండుముసలి దాకా
ఎవ్వరినీ వదలని అంటుజాడ్యమేదో
వీధుల్లో విశృంఖల నాట్యం చేస్తోంది..!
మై డియర్‌ లేడీ..
స్వేచ్ఛ అర్థాన్ని మార్చుకున్నప్పుడంతా
అనేక నిర్వచనాలతో నీ ఒడి నిండుతూనే ఉంది
ముందూ వెనుకలని,
పక్కచూపులతో మాట్లాడే గుంపులు
ఏ కాలాల్లోనూ పుట్టుకొస్తూనే ఉన్నారు
వారికి నీ ఎత్తుపల్లాలపై ఉన్న శ్రద్ధ
తమ అసమతుల్యతలపై
ఉండకపోవడమే పెను విషాదం..!
అయినా.. నువ్వు జాలిపడినప్పుడంతా
ఒక తరం బతికిపోతూనే ఉంది!!
బండి అనూరాధ

➡️