డిజిటల్‌ అక్షరాస్యత.. అభ్యున్నతికి ఆవశ్యం..

Nov 26,2023 06:47
digital illiteracy

‘అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న/ నక్షరంబు లోకరక్షకంబు/ అక్షరంబులేని యబలున కెందును/ భిక్ష పుట్టబోదు ఫృథ్విలోన’ అని ఒక చాటువు చెబుతుంది. జీవన వికాసానికి, పరిపూర్ణతకు అక్షరం ఓ గీటురాయి. అక్షరాస్యత మానవ ప్రగతికి దిక్సూచి. ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో.. మానవ ప్రగతికి చదువు కూడా అంతే అవసరం’ అని యునెస్కో నిర్వచించింది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందంటే అక్కడి అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశాలలో ప్రధానమైనది అక్షరాస్యత. ‘ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు.. జనాన్ని చదవకుండా చూడండి చాలు’ అంటాడు అమెరికన్‌ రచయిత రే బ్రాడ్బరీ. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ కాలం. రోజువారీ జీవితంలో డిజిటల్‌ అవసరాలు కూడా కలగలిసిపోయాయి. కంప్యూటర్లు మానవ జీవితంలో ముఖ్య భాగమయ్యాయి. ఈ క్రమంలో ‘కంప్యూటర్‌ అక్షరాస్యత’ అవసరం పెరిగింది. డిసెంబర్‌ 2వ తేదీ ‘కంప్యూటర్‌ అక్షరాస్యత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

అంతర్జాతీయ పాఠశాలల నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంప్యూటర్‌ అక్షరాస్యత అంటే- కంప్యూటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించగల జ్ఞానం, సామర్థ్యం. అంతేకాదు, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు, అప్లికేషన్‌లను ఉపయోగించగల నైపుణ్యం కూడా కంప్యూటర్‌ అక్షరాస్యతా స్థాయిని సూచిస్తుంది. కంప్యూటర్‌ అక్షరాస్యత అంటే కంప్యూటర్‌లను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సహా అన్నిరకాల సాంకేతిక పరికరాలతో ఎంతో కొంత పరిచయం వుండటం.

డిజిటల్‌ అక్షరాస్యత.. అభ్యున్నతికి ఆవశ్యం..
ప్రోత్సాహం అవసరం..

కంప్యూటర్లు ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకే సమయంలో అనేక మందితో కమ్యూనికేట్‌ చేయడం సాధ్యమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ స్మార్ట్‌ఫోన్‌.. ఒక అవయవంలా మనతోనే వుంటోంది. మనం సాంకేతికతపై ఎంతగా ఆధారపడుతున్నామో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పటితరం పూర్తిగా డిజిటల్‌ సాంకేతికతే లోకంగా బతికేస్తున్నారు. అదే సమయంలో పట్టణాలకు, పల్లెలకు, చదువుకున్నవారికి, చదువుకోనివారికి మధ్య అంతరం చాలానే వుంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, ప్రపంచ వ్యాప్తంగా బాలబాలికలు, మహిళల్లో డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది డిసెంబర్‌ 2వ తేదీని ‘కంప్యూటర్‌ అక్షరాస్యత దినోత్సవం’గా పాటిస్తున్నారు. 2001లో ఎన్‌ఐఐటి అనే భారతీయ సంస్థ దీనిని ప్రారంభించింది. ప్రపంచంలోని కంప్యూటర్‌ వినియోగదారుల్లో పురుషులే ఎక్కువగా వున్నారని వెల్లడైన ఒక అధ్యయనానికి ప్రతిస్పందనగా ఎన్‌ఐఐటి ఈ దినాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వెనుకబడిన తరగతులలో అవగాహన కల్పించడం, మహిళలు, పిల్లల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచడం దీని లక్ష్యం.

పెరిగిన అంతర్జాల ఆవశ్యకత..

ప్రపంచం డిజిటల్‌ భవిష్యత్తు వైపు కదులుతున్నప్పటికీ, సమాజంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కంప్యూటర్లు, ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నాయి. చైనా, జపాన్‌ వంటి దేశాలు 6జి వైపు అడుగులు వేస్తోంటే, మనం ఇంకా 4జీ తోనే కుస్తీ పడుతున్నాం. 5జీ వచ్చేసింది అని చెబుతున్నా.. 4జీ కూడా సరిగా రాని గ్రామాలు అనేకం మన దేశంలో వున్నాయి. నేటికీ కోట్లాది మంది ప్రజలు కనీసం వారి పేరు చదవటం, రాయడం చేయలేని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మరోవైపు సాంకేతిక విజ్ఞానం దూసుకుపోతూనే వుంది. కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు సాంకేతికత తాకని రంగమంటూ లేదు. రోజువారీ పనులు కూడా ఈ సాంకేతికతతో ముడిపడిపోయాయి. చదువులోనూ, ఉద్యోగాల్లోనూ మార్పులొచ్చాయి. కంప్యూటర్‌ అక్షరాస్యత అంతా ఇంటర్నెట్‌ చుట్టూనే తిరుగుతోంది. ఇదొక సమాచార సముద్రం. ఇందులో నిజాలు, అబద్ధాలు, అపోహలు, అపార్థాలు.. అన్నీ ఉంటాయి. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విచక్షణకు కంప్యూటర్‌ అక్షరాస్యత చాలా ముఖ్యం. దీనిపై సరైన అవగాహన లేక అనేకమంది సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. అవసరంలేని విషయాలను సెర్చ్‌ చేయడం, అనవసరమైన లింక్‌లపై క్లిక్‌ చేయడం వంటివి డిజిటల్‌ ప్రమాదాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయట పడాలంటే.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ కంప్యూటర్‌ అక్షరాస్యత అవసరం. విద్యార్థులు, ఉద్యోగార్థులకైతే కంప్యూటర్‌ విద్య తప్పనిసరి. ‘2025 చివరికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలు మనుషుల నుంచి యంత్రాల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి’ అని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అంచనా. దీనికి డిజిటల్‌ నైపుణ్యం అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎలాంటి నైపుణ్యం కావాలి…

కంప్యూటర్‌ అక్షరాస్యత ఎందుకు ముఖ్యమైనదో చెప్పాలంటే- నేడు అధిక శాతం ఉద్యోగాలకు కంప్యూటర్‌ సామర్థ్యం అవసరమౌతున్నది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి)లో ఉద్యోగాలతో పాటు, కంప్యూటర్‌ నైపుణ్యం ప్రాథమిక అవసరం అయిన ఇతర ఉద్యోగ రంగాలూ అనేకం ఉన్నాయి. అదనంగా, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ నేర్చుకోవడం, కమ్యూనికేషన్‌, వినోదం కోసం అనివార్య సాధనాలుగా మారాయి. వాటిని ఎలా ఉపయోగించాలో బాగా తెలిసిన వ్యక్తులు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఎక్కడి నుండైనా విలువైన ఆన్‌లైన్‌ వనరులను యాక్సెస్‌ చేయవచ్చు. మంచి కంప్యూటర్‌ వినియోగదారులు కూడా వారి సమయంపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు. మంచి టైపింగ్‌ స్కిల్స్‌ ఉన్నా, సాఫ్ట్‌వేర్‌ను ఎలా ఉపయోగించాలో తెలిసినా సరిపోతుంది. అలాగే వినియోగదార్లు కూడా ప్రతి విషయాన్ని చేతితో రాయాల్సిన అవసరం లేదు. వీరంతా టైప్‌ చేసేవారి కంటే వేగంగా డాక్యుమెంట్‌లను సృష్టించగలరు. ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ అక్షరాస్యత కలిగి ఉండటం చాలా అవసరం. ఉద్యోగ అవకాశాలను విస్తృతం చేయడం, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉండటం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, సమస్యలను పరిష్కరించడం వంటి అనేక కారణాల వల్ల కంప్యూటర్‌ అక్షరాస్యత ముఖ్యమైనదిగా మారింది. సాంకేతిక ప్రపంచం విస్తృతమవుతున్న కొద్దీ కంప్యూటర్‌ అక్షరాస్యత నైపుణ్యం కూడా అంతే స్థాయిలో అవసర మవుతోంది. బ్లాగ్‌లు రాయడం నుండి ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించడం వరకు, మనం చేసే ప్రతి పనికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. కాబట్టి కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం విద్యార్థులకే కాదు.. వయోజనులకూ అవసరమే.అయితే, ప్రాథమిక అవసరంగా మారిన కంప్యూటర్‌ విద్యను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. స్కూళ్లు, కాలేజీలు కంప్యూటర్‌ ల్యాబ్‌లతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. విండోస్‌తోనే నిండిపోయి వున్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి, ఈ సాఫ్ట్‌వేర్లు కొనలేని సాధారణ ప్రజలకు, పేద విద్యార్థులకు ఈ సాంకేతికత అందని ద్రాక్షయే. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోగదారులలో పురుషులే ఎక్కువని, మహిళలు, పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో వున్నారని ఒక సర్వే వెల్లడించింది. భారత్‌లో 53.9 శాతం మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఉన్నప్పటికీ.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్నవారు 22.2 శాతం మాత్రమేనని దేశవ్యాప్తంగా చేపట్టిన పలు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 140 కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో ప్రస్తుతం 64.6 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. కంప్యూటర్లను, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలంటే.. ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య, డిజిటల్‌ అక్షరాస్యత అవసరం. లైనక్స్‌ వంటి ఉచిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, ఉచిత సాఫ్ట్‌వేర్‌లను ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. కేరళ తరహాలో వీటిని ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ, కాలేజీల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల స్థాయి నుంచే తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ విద్యను అందించే అవకాశం వుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి సాంకేతికతకు పట్టం కట్టాలి.

– కంచర్ల రాజాబాబు, 9490099231

➡️