అనగనగా విలాస్పూర్ అనే గ్రామం. ఆ ఊరికి విలాస్పూర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే? ఆ గ్రామంలో ఉండే జనం స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.
కానీ ఆ ఊరికి ఒకరోజు దొంగల ముఠా వచ్చింది. ఒక పథకం ప్రకారం ఊరిలో దొంగతనం చేయాలనుకున్నారు. ఆ రోజు పది ఇళ్లల్లో చొరబడి, బంగారం, డబ్బు అంతా దొంగిలించారు. ఆ మొత్తం కలిపి ఒక మూట కట్టారు. ఊరిలో ఓ వ్యక్తి ఇంట్లో చొరబడి, కడుపునిండా అన్నం తిన్నారు. అంతా కలిసి దక్షిణాన ఉన్న పెద్దకొండ కింద ఉన్న గుహలో తలదాచుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఊరిలో జనం తమ ఇళ్లల్లో కనిపించకుండా పోయిన డబ్బు, బంగారం గురించి మాట్లాడుకోసాగారు. రాత్రివేళలో దొంగలు ప్రవేశించినట్లు గ్రహించారు. ఈ విషయాన్ని ఊరి పెద్ద రామారావుకు తెలియజేశారు. దాంతో ఆయన గ్రామస్థులను ‘అరుగు వద్దకు రావాలి’ అని చాటింపు వేయించారు. జనం అంతా అరుగు దగ్గరకు వచ్చారు. ఊరి పెద్ద కూడా వచ్చారు. రాత్రి వేళల్లో దొంగలు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆ సమయంలోనూ ఇళ్లల్లో జనం ఉండరని గ్రహించి, దొంగలు ఇళ్లల్లోకి ప్రవేశించారు. దొరికినంత సొమ్మును మూట కట్టుకుని, కొండ దగ్గరకు వెళ్లారు. వరుస దొంగతనాలతో ఊరి జనం భయాందోళనలకు లోనయ్యారు. అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఊరి పెద్ద రామారావు కొడుకు బాబుకి సమస్య అర్థమయ్యింది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని, దొంగలు తెలివిగా దొంగతనాలు చేస్తున్నారని, అసలు దొంగ ఊరిలోనే ఉన్నాడని అనుమానించాడు. ఓ రోజు రాత్రి ఓ వ్యక్తి ముసుగు వేసుకుని కొండ వద్దకు నడవసాగాడు. అతన్నే అనుసరించిన బాబు ఆ పెద్దమనిషి అసలు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన తండ్రే ఊరిలో దొంగతనాలకు కారణమని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి, కొండ దగ్గర ఉన్న దొంగలను పట్టుకున్నారు. అక్కడ ఉన్న బంగారం, డబ్బును ఊరి జనానికి ఇచ్చారు. తమ కష్టార్జితం తిరిగి దక్కినందుకు సంతోషించారు జనం.
– రోహిత్ కుమార్