పచ్చిమిర్చి అంటే కొందరికి మహా ఇష్టం. మరికొందరికి భయం. వాటికి దూరంగానూ ఉంటారు. అయితే పచ్చిమిర్చిలో గుణాలు ఎంతో ఆరోగ్యకరమైనవని నిపుణులు అంటున్నారు. అంతేకాదు పచ్చిమిర్చి తింటే బరువు తగ్గడంతో పాటు చాలా సమస్యలన్నీ దూరం చేస్తుంది. ఏ కూర వండినా కచ్చితంగా పచ్చిమిర్చి పడాల్సిందే. అంతెందుకు బిర్యానీ అయినా చిల్లీ చికెన్ అయినా పచ్చిమిర్చి మస్ట్. దీనిని వంటకి కారాన్ని పెంచడానికి వాడతాం. కానీ, దీనివల్ల కలిగే లాభాలు తెలిస్తే.. ఎంతకారంగా ఉన్నా ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది కదా! అందుకే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మనం నిత్యం వాడే కూరగాయల్లో పచ్చిమిర్చి తప్పనిసరి. చాలామంది వీటిని ఇష్టంగా తింటే మరికొంతమంది మాత్రం అబ్బో కారం అంటారు. కానీ, ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోని సుగుణాలు తెలిశాక.. ‘కొంచెం కారం..ఎంతో ఆరోగ్యం’ అని మీరే అంటారు. మరి ఆ గుణాలు ఏంటో తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్స్
యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని కలిగించే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌ని తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. ఇలాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పచ్చిమిర్చిలో మెండు. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గుప్పెడు గుండెకీ మేలే..
పచ్చిమిర్చిలో రక్తపోటుని తగ్గించే గుణాలున్నాయి. ఇది గుండెకి ఎంతో మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె రక్తనాళాలకి రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది. గుండె సమస్యల నుండి రిలీఫ్ చేస్తుంది.
జీర్ణ సమస్యలకు చెక్..
పచ్చిమిర్చి తింటే శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణమవుతుంది. మలబద్ధకానికి మందులానూ దీన్ని వాడొచ్చు.
నొప్పులు హుష్‌కాకి..
చాలా మంది నొప్పులతో బాధపడేవారు పెయిన్ రిలీఫ్, క్రీమ్స్ వాడతారు. అందులో చాలా వరకూ పచ్చిమిర్చి సారం ఉంటుంది. ఎందుకంటే, ఇందులో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి, ఎలాంటి నొప్పినైనా తగ్గించే గుణం ఇందులో ఉంటాయి. అందుకే, వీటిని కీళ్ళనొప్పులకి దివ్యౌషధం అని చెప్పొచ్చు.
అధికబరువు అదుపులో..
పచ్చిమిర్చి తింటే శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. ఇది బాడీలో కొవ్వుని కరిగించే జీవక్రియని వేగం చేస్తుంది. దీంతో ఈజీగా క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా పచ్చిమిర్చి తీసుకుంటే బరువు తగ్గుతారు.
పోషకాల గని..
మిర్చిల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మరి పచ్చిమిర్చి పసకస నమిలేయండి.. అదేనండీ.. సలాడ్స్‌లోనూ, బ్రేక్‌ఫాస్ట్‌ల్లో, ఆమ్లెట్స్‌లో పచ్చిమిర్చికే అధిక ప్రాధాన్యం ఇవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి..