‘చిలకమ్మ చిట్టి కొట్టిందా అమ్మా, వెళ్ళావ తోటకి తెచ్చావా పండు’
‘పిల్ల రామచిలుకా నువ్వు మాటలే తికమకగా మాట్లాడతావు నీకెందుకు పాటలు’ అన్నాడు తాబేలు. ‘ఇష్టం నా మాట, నా పాట’ అంటూ తుర్రుమని వెళ్ళిపోయింది.
‘ఒకటి ఇది కోసిన చెవులు మేకలా’ అన్నాడు తాబేలు.
‘అల్లుడు నువ్వు కూడా పిల్ల రామచిలుకలా మాట్లాడుతున్నావు. చెవులు కోసిన మేకలా కదా అనాలి’ అన్నాడు కుందేలు.
‘సహవాస దోషం.. పిల్ల రామచిలుక మాటలు వినీ వినీ.. మామా ఈ ఎండలు ఇలా కొనసాగితే మనకు మంచినీటి కొరత ఏర్పడుతుందేమో!’ అన్నాడు తాబేలు.
‘అల్లుడు మన అడవిలో నీటి కొరతతో పాటు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎండు కట్టెలు సేకరించేవారు, చెట్లను నరికేవారు విచ్చలవిడిగా బీడీ, సిగరెట్లు కాలుస్తూ ఎక్కడపడితే అక్కడ ఆర్పకుండా పడేస్తున్నారు. అలాగే వారు ఆహారం తయారుచేయడానికి అడవిలో నిప్పు రాజేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో వారు తెలుసుకోలేకపోతున్నారు. నిప్పు రాజేసిన మనుషులు అగ్నిప్రమాదం జరిగితే వారు పరుగులు తీస్తూ వారి గ్రామానికి వెళతారు. కానీ మనం ఎక్కడికి వెళతాం? అగ్ని జ్వాలలకు మనతోపాటు ఎంతో విలువైన వనమూలికలతో కూడిన అటవీ సంపద భస్మం అయిపోతుంది. అడవుల్లో నిప్పు రాజేయడం తప్పని ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో?’ అన్నాడు కుందేలు.
‘ముంచాడు కొంప బావ కోతి. అంటించాడు నిప్పు అడవికి’ అని అడవి అంతా అరచుకుంటూ తిరగసాగింది పిల్ల రామచిలుక.
జంతువులు అన్నీ కోతిబావ ఉన్న చెట్టు వద్దకు పరుగులు తీశాయి. అప్పటికే అక్కడకు చేరిన ఏనుగులు అందుబాటులోని నీటిని తమ తొండాలతో పీల్చుకొచ్చి, మంటలను ఆర్పివేసాయి.
‘కోతి బావ! అడవిలో నిప్పు రాజేయడం వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయని నీకు తెలుసుకదా’ అన్నాడు సింహరాజు.
‘చలి మంట వేశా. గట్టిగా గాలి వీచడంతో అడవికి నిప్పు అంటుకుంది’ అన్నాడు కోతి.
‘వేసవిలో చలిమంట వేసావా?’ పట్టరాని కోపంతో కోతిని బలంగా తన పంజాతో కొట్టాడు సింహరాజు.
‘అడవిలో నిప్పు రాజేయడం వలన ఎంత నష్టమో తెలుసుకున్నారుగా?’ అన్నాడు సింహరాజు. ‘తప్పు తప్పు అడవిలో నిప్పు అనకూడదు. నిప్పులో అడవి అనాలి’ అన్నది పిల్ల రామచిలుక.
ఫక్కున నవ్వాయి అక్కడున్న జంతువులన్నీ దాని మాటలకు.
– డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
ఫోన్ : 98844 29899