చిరుమువ్వల సవ్వడి

మన దేశ ప్రథమ ప్రధాని, ఆధునిక భారతదేశ రూపశిల్పిగా పేరొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినం నవంబర్‌ 14ని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన ఆయన 1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27న కన్నుమూసేంత వరకు ప్రధాని బాధ్యతలు నిర్వహించారు. రాజ్యాంగ రూపకల్పనలో, పాలనా వ్యవహారాలు సాగించడంలో ఆయన పాత్ర ప్రముఖమైనది. భాక్రా-నంగల్‌, నాగార్జున సాగర్‌ తదితర బహుళార్థ సాధక ప్రాజెక్టులుబీ దుర్గాపూర్‌, భిలారు వంటి ఉక్కు పరిశ్రమల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్వావలంబన కోసం ఐఐటిల వంటివి స్థాపించడం, వైద్యరంగంలో తలమానికంగా ఉన్న ఎయిమ్స్‌ ఏర్పాటు ఆయన దార్శనికతకు దర్పణాలు. స్వాతంత్య్రానంతర భారతదేశం లౌకిక, ప్రజాస్వామ్య దేశంగానే ఉండాలన్న భావనను జవహర్‌లాల్‌ నెహ్రూ పాదుకొల్పారు.
ఈ ఏడాది బాలల దినోత్సవానికి ముందు దీపావళి పండుగ వస్తోంది. పిల్లల సందడికి ఇది పెద్ద పండుగ. ఈ ‘స్నేహ’ సంచికను బాలల దినోత్సవం, అలాగే దీపావళి ప్రత్యేక సంచికగా ‘చిరుమువ్వలు’ పేరిట వెలువరిస్తున్నాం. ప్రముఖ బాలసాహితీవేత్త , ఆల్‌ ఇండియా రేడియో మాజీ డైరెక్టర్‌ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి అతిథి సంపాదకులుగా వ్యవహరించారు. వారికి మా ధన్యవాదాలు. కోరిన వెంటనే అద్భుతమైన ముఖచిత్రాన్ని అందించిన ప్రముఖ చిత్రకారులు అరసవల్లి గిరిధర్‌కు కృతజ్ఞతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వల్ప కాలంలోనే బొమ్మలు, కథలు గీసి, రాసి పంపిన పిల్లలందరికీ శుభాశీస్సులు. అందుకు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.
పిల్లలు కేవలం పిల్లలే కాదు.. ఈ విశ్వంలో వెలుగులు చిందించే దివ్వెలు.. రేపటి పౌరులు.. భవిష్యత్తు బంగారు భారతావని నిర్మాతలు.. పిల్లలు.. వారి నవ్వులు.. విరబూసే పువ్వులు.. వారి మనసులు స్వచ్ఛమైనవి. వారి కోరికలకు రెక్కలు ఇస్తే బోలెడన్ని కథలు.. కవితలు.. బొమ్మలు వారి బుల్లి బుల్లి చేతుల్లోంచి జాలువారతాయి. పిల్లలు ఆకాశంలో ఎగిరే పక్షుల్లా.. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. హరివిల్లు రంగులన్నీ కలగలిసిన ఆలోచనలతో విరాజిల్లుతారు. పిల్లల్ని పిల్లలుగా ఎదగనివ్వాలి. అందుకు సరైన వేదికలు కావాలి.. సమాజంలో పెద్దలు అందుకు బాధ్యత వహించాలి. ఎంతోమంది పిల్లలు సృజనకారులుగా ఎంచక్కటి సాహిత్య రచన చేసి, తెలుగు భాషకు పట్టం కట్టారు. ప్రోత్సాహం ఇస్తే – పిల్లలు కథలు, కవితలు, గేయాలు రాయగలరు. బొమ్మలు గీయగలరు. ఇంకా అనేకానేక ఊహలు చేయగలరు. ఈ సంచిక కోసం కొందరు పిల్లలు బొమ్మల కథలు కూడా వేసి, రాసి పంపారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేయగలరు. అందుకు పిల్లలంతా చేసిన ఈ చిరుమువ్వల సవ్వడే నిదర్శనం.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు వందలాది కథలు, కవితలు రాశారు. అదేమీ మామూలు విషయం కాదు. బొమ్మలు చిత్రీకరించారంటే వారి భావ సృజన ఎంత గొప్పదో.. బాలబాలికలకు అవకాశాలు ఇస్తే ఎలా అల్లుకుపోతారో అద్దం పట్టింది ‘చిరుమువ్వలు’ పిల్లల ప్రత్యేక సంచిక. పిల్లలు పంపిన రచనలు వీలైనంత వరకూ ప్రచురించాం. మిగిలిన రచనల్నీ, బొమ్మల్నీ తర్వాతి సంచికల్లో ప్రచురిస్తాం.
ఈ స్నేహ పిల్లలందరికీ గొప్ప వేదిక.. ఇప్పుడే కాదు.. ఇకముందూ పిల్లలకు పెద్ద పీట వేస్తుంది. సృజనాత్మకతకు చిగురులు తొడుగుతూ.. రచనలను మాకు పంపండి. వాటిని ప్రచురించి, పదుగురికీ పంచే బాధ్యత మాది.
చాచా నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవం సందర్భంగా, దీపావళి పండుగ వేళ అందరికీ మా శుభాకాంక్షలు. ప్రజాశక్తి గతంలో ప్రచురించిన ప్రత్యేక సంచికల మాదిరిగానే ‘చిరుమువ్వలు’ సంచికనూ ఆదరిస్తారని విశ్వసిస్తున్నాము.

(బి. తులసీదాస్‌)
సంపాదకుడు

➡️