మనిషిని తట్టిలేపే కవిత్వం

Nov 27,2023 08:32 #sahityam

చార్య నందిపాటి సుబ్బారావు వెలువరించి న ‘అమరావతి’ కవితా సంపుటి రాజధాని యొక్క గొప్పతనాన్ని చాటుతూ, సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. ఇందులోని కవితలన్నీ కూడా మానవతా విలువలకు అద్దం పడతాయి. మనిషిత నాన్ని తట్టి లేపుతాయి. గోదావరి యొక్క గొప్పతనం, సర్వమత సామరస్యం ఆవశ్యకత, ఇంకా దేశంలోని విధ్వంసాలను ఆపేదె వరు అంటూ ఆర్తిగా, ఆవేదనాభరి తంగా సాగిపోయే కవితలూ చదువరులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఆచార్య నందిపాటి సుబ్బారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూవిజ్ఞానశాస్త్ర విభాగాధిపతిగా విద్యార్థుల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దారు. జలవనరుల పరిరక్షణపై విశేషంగా కృషి చేస్తున్నారు.ఈ సంపుటిలోని మొదటి కవిత ‘అక్షరమాల’. అక్షరమాలని అమ్మతో పోల్చి కమనీయం, రమణీయం తెలుగు భాష అంటూ కీర్తించారు. ‘అమరావతి వైభవం’ కవితలో ఆనాటి ధరణికోట ఈనాటి తెలుగు ప్రజల ఘన కీర్తి అంటూనే సర్వమత సమ్మేళనాలకు నెలవు అన్నారు. ‘పులకిస్తున్న అమరావతి’ కవితలో ఆంధ్రుల మహా స్వప్నం సాకారం కాబోతున్న వైనాన్ని చక్కగా చెప్పారు. ‘మార్గ త్రయం- ఒకటి’ కవితలో పరవళ్ళు తొక్కుతూ గలగల పారే గోదారిని కొనియాడారు. ‘మార్గత్రయం-రెండు’లో యేసు గురించి, ‘మార్గత్రయం-మూడు’లో రంజాన్‌ ప్రాముఖ్యం గురించీ వివరించారు. ‘నిరాడంబరుడు’ కవితలో అబ్దుల్‌ కలాంని ప్రస్తుతించారు.                       ‘భారతావని’ కవితలో- అవినీతి, అరాచకాలతో భారతమాత ఆవేదన చెందుతోందని హృద్యంగా చెప్పారు. ‘చిరునామా లేని ఉత్తరం’ కవితలో మనసుపెట్టి చెయ్యని పని చిరునామా లేని ఉత్తరం లాంటిదని పేర్కొన్నారు. ‘ప్రకృతి – వికృతి’ కవిత మనిషిలోని విధ్వంస చేష్టలకు అద్దం పట్టింది. ‘నేను వృక్షాన్ని నీ ప్రాణ భిక్షాన్ని’ కవితలో సకల ప్రాణికోటి మనుగడకు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్న వృక్షం ప్రాధాన్యాన్ని వివరించారు. ‘పచ్చనైన పల్లె వదిలి’ కవితలో పల్లెను వదిలి కాలుష్యమైపోయిన పట్టణానికి వెళ్లి డాంబికాలు పోతే ఎలా ఉంటుందో చక్కగా కవిత్వీకరించారు. ‘ఇదే ప్రపంచం’ కవితలో మానవుడు చరవాణికి బందీ అయిన వైనాన్ని తెలియజేశారు. ‘తానంటే తందానందురు’ కవిత నేటి రాజకీయ నాయకులు అధికారం చేజిక్కించుకోవడానికి చేసే విన్యాసాలకు చురకలంటించింది.

‘అనాగరికత’ కవితలో మానవత్వం మంటగలుస్తున్న తీరును ఎద్దేవా చేశారు. కులమతాల కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటారని సమాజాన్ని ప్రశ్నించారు రచయిత. బుద్ధుడు నడిచిన, గాంధీ పుట్టిన దేశంలో ఎప్పుడు మారణకాండలేనా, ఇకనైనా నిజాలు తెలుసుకొని అజ్ఞానాన్ని వీడండంటూ హితవు పలికారు. ఇలా అన్నీ కవితలు ఎంతో ఆసక్తిదయకంగా సాగిపోతూ సాహితీ ప్రియులను చదివింపజేస్తాయి. పుస్తక కోసం 98484 86967 మొబైల్‌ నెంబర్లో ఆచార్య నందిపాటి సుబ్బారావును సంప్రదించవచ్చు.

– పింగళి భాగ్యలక్ష్మి 97047 25609

➡️