అమరావతి : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు నష్టపరిహారమివ్వాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం అర్థరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద అగ్నిప్రమాదం సంభవించి 40 బోట్లు దగ్థమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోమవారం లోకేశ్ మాట్లాడుతూ … విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులకు చెందిన 40కిపైగా బోట్లు అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందని అన్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతంలో భద్రతా చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ”ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద మత్స్యకారులు. ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి” అని లోకేశ్ డిమాండ్ చేశారు.