ప్రస్తుతం సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎంతోమంది యువతకి ఉపాధిమార్గంగా ఉందనేది వాస్తవం. యూట్యూబ్ వీడియోస్, ఇన్‌స్టా రీల్స్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా ఒకటేమిటి నచ్చిన విభాగంలో విభిన్న పద్ధతుల్లో రాణిస్తున్నారు నేటి యువతీయువకులు. సోషల్‌మీడియా ద్వారా వచ్చే ఆదాయంతోనే తమ కుటుంబాలు గడుస్తున్నాయని కూడా చాలామంది బాహాటంగా చెబుతున్నారు. అలాంటివారిలో ఒకరే ఢిల్లీకి చెందిన నాన్సీ త్యాగీ.
21 ఏళ్ల నాన్సీ, అధునాతన డిజైనర్ దుస్తులు ధరించి తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ దుస్తులను కుట్టుమిషన్‌పై ఆమే స్వయంగా కుడుతుంది. షాపు నుండి ముడిబట్ట కొనడం దగ్గర నుండి వాటిని అందమైన దుస్తులుగా తయారుచేసే వరకు మొత్తం వీడియోని పోస్టు చేస్తుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే నాన్సీకి కుట్లు, అల్లికలలో అసలు ప్రావీణ్యం లేదు. చిన్నతనంలో తనకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మలకు వేసే అందమైన దుస్తులను తనే డిజైన్ చేసుకునేది. ఆ ఆసక్తే భవిష్యత్తులో తనకు ఉపాధిమార్గంగా మారుతుందని అసలు ఊహించని మలుపు ఆమె జీవితంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ బాగ్‌పట్ జిల్లా బరన్వా గ్రామానికి చెందిన నాన్సీ లాక్‌డౌన్‌కి ముందు 12వ తరగతి పూర్తిచేసి యుపిఎస్‌సికి శిక్షణ పొందేందుకు ఢిల్లీ నగరానికి చేరుకుంది. తనతోపాటే అమ్మ, తమ్ముడు వచ్చేశారు. ఉన్నత చదువులు కోరుకున్న కూతురుకు తండ్రి ఆటంకాలు సృష్టించాడు. పై చదువులకు అవసరమయ్యే డబ్బు సాయం చేయనన్నాడు. తండ్రి నుండి ఎదురైన నిరాదరణకు కూతురు కలత చెందకుండా ఆమె తల్లి తోడుగా నిలిచింది. కూతురు కోరికను ఎలాగైనా తీర్చాలని ఆమెను తీసుకుని ఢిల్లీ వచ్చేసింది.
కరోనా మార్చిన కల
నాన్సీ కల సాకారమవ్వాలని ఆ తల్లి భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసింది. ‘పొద్దున్నుండి పని చేసి ఇంటికి వచ్చేసరికి అమ్మ ముఖమంతా దుమ్ము, ధూళి ఉండేవి. చాలా శ్రమించేది. నా చదువు కోసం ఎంతో కష్టపడి రూ.2.5 లక్షలు కూడబెట్టింది. ఇక శిక్షణకు బయల్దేరే సమయం వచ్చేసరికి కరోనా వచ్చిపడింది. లాక్‌డౌన్‌లో అమ్మ పని పోయింది. నాన్న నుండి దూరంగా వచ్చేసిన మేం తిరిగి ఊరు వెళ్లే పరిస్థితి లేదు. ఉన్న డబ్బు తింటూ కూర్చొంటే ఎన్ని రోజులు వస్తుంది? పోనీ ఆ డబ్బును చదువు కోసం వినియోగించుకుంటే తిండి ఎలా తింటాం! ఈ గందరగోళ పరిస్థితుల్లో నా ముందు ఉన్న రెండు దారుల్లో నేను రెండో మార్గాన్ని ఉపయోగించుకున్నాను’ అంటూ తన కథను చెబుతోంది నాన్సీ.
‘అవుట్‌ఫిట్స్ ఫ్రమ్ స్క్రాట్చ్’ పేరుతో నాన్సీ మొదలుపెట్టిన వీడియోస్ ద్వారా వచ్చే ఆదాయమే ఇప్పుడు ఆమె కుటుంబానికి ఆధారంగా ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. ‘చదువు కోసం ‘దాచుకున్న డబ్బుతో ముడి సరుకు, కెమెరా, కావాల్సిన సామగ్రి కొనేసాను. ఇక నా చేతిలో చిల్లిగవ్వ లేదు. మొదట్లో నా వీడియోస్‌కి వ్యూస్ రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా ప్రతిరోజూ పోస్టు చేస్తూనే ఉన్నాను.
యుపిఎస్‌సి పరీక్షలను ఎంత సీరియస్‌గా తీసుకుని చదవాలనుకున్నానో నా వీడియోస్‌ని కూడా అంతే శ్రద్దగా తీయాలనుకున్నాను. ఇది నాకు చావో, బతుకో సమస్య లాంటిది. తమ్ముడి సాయంతో వీడియోస్ షూట్ చేసేదాన్ని. రకరకాల డిజైనర్ దుస్తులు ధరించి చేసిన వీడియోస్‌కి లైక్స్ కంటే ట్రోల్స్ ఎక్కువ వచ్చేవి. చాలా బాధపడేదాన్ని. ఆ క్షణంలో మా అమ్మ కష్టం గుర్తుకుతెచ్చుకునేదాన్ని. ఆమె నా రోల్ మోడల్. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడింది. నాన్న వదిలేసినా, నన్ను, తమ్ముడిని పెంచుతోంది’ అంటోన్న నాన్సీ సొంతంగా డిజైన్ చేసిన దుస్తులతో పాటు, హాలీవుడ్, బాలీవుడ్ నాయికామణులు ధరించే దుస్తులను కూడా అదే రీతిలో కుట్టి, ధరించిన వీడియోస్‌ను ప్రస్తుతం ఓ సిరీస్‌లా చేస్తోంది. 100 సిరీస్‌లను తీయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ సందర్భంగా తన కథను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘అవమానాలు, అవహేళనలు ఎన్ని ఎదురైనా ఎంచుకున్న రంగం నుండి దూరం కావద్దు. మీలో దాగున్న శక్తిసామర్థ్యాలను ముందు మీరు గుర్తించండి. ఆ తరువాత వాటంతట అవే వెలుగులోకి వస్తాయి’ అని చెబుతోంది నాన్సీ.