చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూ, ఇతర శీతాకాల సంబంధిత సమస్యల నుండి వారిని రక్షించుకోవాలి.
ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించాలి
వృద్ధులు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు చలికి ఎక్కువగా ప్రభావితమౌతారు. కాబట్టి ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉన్నవాళ్లు వింటర్ మోడ్‌కు సర్దుబాటు చేసుకోవాలి. గదులు ఎల్లప్పుడూ వెచ్చగా ఉండేలా చూడాలి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
పడిపోయే ప్రమాదాన్ని గుర్తించండి, నివారించండి
చలికి రక్షణగా వృద్ధులు ఇంట్లో మేజోళ్లు, చెప్పులు ధరిస్తారు. అవి కొన్ని సార్లు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల నేలపై లేదా మెట్ల మీద పడే ఆస్కారం ఉంటుంది. దీనిని నివారించాలంటే, బలమైన పట్టును కలిగి ఉండే బూట్లు, చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే నేల (ఫ్లోర్) ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూడాలి.
దుస్తుల ఎంపికలో జాగ్రత్తలు
పిల్లలు ఎప్పుడూ గాలి, వాటర్ ప్రూఫ్‌తో కూడిన దుస్తులు ధరించేలా చూడాలి. బయటకు వెళ్లినప్పుడల్లా ఉన్ని దుస్తులను ధరించమని చెప్పాలి. వృద్ధులు థర్మోకోట్ ధరించవచ్చు. ఇది వారి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే ముఖం, చేతులు, చెవులు, మెడను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ చేతి తొడుగులు, స్కార్ఫ్‌లు, మంకీ క్యాప్‌లను ధరించాలి.
భద్రతపై అశ్రద్ధ వద్దు
చలికాలంలో ముఖ్యంగా కాస్త పెద్ద పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు, రోడ్డుపై మంచు పడడం వల్ల వాహనం టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదముంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారిని రక్షించడానికి వీలుగా హెల్మెట్, మణికట్టు, మోచేయి, మోకాలికి గార్డులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పోషణపై శ్రద్ధ అవసరం
శీతాకాలంలో వృద్ధులు, పిల్లలు ఇద్దరికీ విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్, ముక్కలు చేసిన పచ్చి కూరగాయలు, పెరుగు తరచూ తీసుకునేలా చూడాలి. ఇవి వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
హైడ్రేటెడ్‌గా ఉంచాలి
చలికాలంలో చెమట పట్టదు. దీంతో పిల్లలు తగినంత నీళ్లు తాగక డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనిని నివారించడానికి విటమిన్ సి అధికంగా ఉండే తక్కువ – చక్కెర రసాలను వారికి అందిస్తూ ఉండాలి. ఇవి వారి శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తోడ్పడుతుంది. దాంతో పాటు వేడి పానీయాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి.