చర్మవ్యాధులపై అప్రమత్తత అవసరం

Nov 26,2023 10:45 #Jeevana Stories

ప్రస్తుత శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ కాలంలో రోగాలతో పాటుగా ముఖ్యంగా చర్మ సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వాటిలో చర్మం పొడిబారిపోవటం, పెళుసుగా మారిపోవటం, పగుళ్లు, రాషెస్‌, దురదలు, మంటలు వంటి సమస్యలు ఎక్కువగా పీడిస్తుంటాయి. వీటిలో అత్యంత క్లిష్టమైన సమస్య సొరియాసిస్‌. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవొచ్చు.

ఇవీ, ఎలర్జీ లక్షణాలు :

చర్మం ఎర్రగా మారుతుంది

దురద

వాపు

దద్దుర్లు పైకి ఉబ్బిన బొబ్బలు

చర్మం పొలుసులుగా మారటం

చర్మ పగులు, చీలిక

ప్రతి ఒక్కరూ రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం గడపటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి పొలుసులు రాకుండా ఉంటుంది. అయితే ఎక్కువ ఎండలో ఉండేవారు మాత్రం తప్పకుండా శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి దుస్తులు, తనపైన రక్షణకు టోపీ వంటివి వాడటం శ్రేయస్కరం. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటం వల్ల కూడా తగిన తేమ లభించి చర్మ సమస్యలు దరిచేరబోవు. ఇందుకు మాయిశ్చరైజర్‌ వంటివి తప్పకుండా ఉపయోగించాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే అనారోగ్యం కారణంగా అనేక చర్మ సమస్యలు వెంటాడుతుంటాయి. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ … ఇలా అనేక రకాల కారణాల వల్ల కూడా అనేక చర్మ సమస్యలు వస్తాయి. కాలుష్య ప్రాంతాలకు వెళ్లటం తగ్గిస్తే మంచిది. వెళ్లాల్సి వస్తే వీలైనంత త్వరగా చర్మాన్ని వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవాలి. ఒత్తిడులకు దూరంగా ఉండాలి. ధూమ, మద్యపానం వంటివి చేయకూడదు. చాలామంది సమతుల్యమైన, పోషకాహారం తీసుకోకపోవటం, లోపం కారణంగా చర్మ వ్యాధుల బారినపడుతున్నారు. తగినంతగా నీరు తాగటం, క్యారెట్లు వంటివి తీసుకోవటం వల్ల విటమిన్‌-ఎ పొంది చర్మం పొడి బారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. విటమిన్‌-సి ఉండే నారింజ, స్ట్రా బెర్రీలు, యాపిల్‌, పుచ్చకాయ, అరటిపండు, బొప్పాయి వంటి వాటిని తీసుకోవాలి. శరీరంలో సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. చర్మపు అలెర్జీ ఉన్న వ్యక్తులు అతి సున్నితమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు. ఎగ్జిమా (గజ్జి), దద్దుర్లు, కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ (చర్మవాపు), ఆంజియోడిమాలు వంటివి సాధారణ చర్మ ఎలర్జీకి ప్రతి చర్యలు.

శీతాకాలంలో ఇంకా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రధానంగా ఎగ్జిమా, సొరియాసిస్‌ సమస్యలతోనే ఎక్కువ మంది బాధపడుతున్నారు. శరీరంపై దద్దుర్లు మనం తీసుకునే ఆహారాలు, నీరు, మందులు, చలి, అతినీలలోహిత కాంతి, చర్మంపై ఒత్తిడి, మొక్కలు, జంతువులు లేదా పలు రసాయనాలు తాకినప్పుడు కూడా కలుగుతాయి.

ఎగ్జిమా (గజ్జి) : గజ్జి అనే చర్మవ్యాధిని స్కేబీస్‌అని, ఎగ్జిమా అని పిలుస్తారు. ఇది చిన్నగా ఉండే కాళ్లమైట్‌ అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి ఆహారం కోసం చర్మం పొరలోకి ప్రవేశించినప్పుడు గజ్జి అనే చర్మ వ్యాధి వస్తుంది. తీవ్రమైన దురదను కలిగివుండటం దీని ప్రధాన లక్షణం. గజ్జి వ్యాధి చర్మం నుంచి చర్మానికి వ్యాప్తి చెందుతుంది.

దద్దుర్లు : వీటిని వైద్య పరిభాషలో అర్టికేరియా అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ప్రభావితం చేస్తుంది. దద్దుర్లు చర్మంపై వాపు, దురద, చికాకును కలిగించటమే కాకుండా చర్మంపై బొబ్బలు, పొక్కులకు కూడా కారణమవుతుంది. చాలా రకాల దద్దుర్లు కొన్ని రోజులు లేదా వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఆరు వారాలకంటే ఎక్కువ రోజులు కనుక ఉంటే, అది దీర్ఘకాలిక దురదగా చెప్పుకోవచ్చు.

సొరియాసిస్‌ : సొరియాసిస్‌ని కేవలం సాధారణ చర్మ వ్యాధిగా పరిగణించటానికి వీల్లేదు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ వికటించటం వల్ల వచ్చే చర్మవ్యాధి ఇది. సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కన్పిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మంపై మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. వ్యాధి నిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటంతో సొరియాసిస్‌ వస్తుంది. కొన్ని కుటుంబాల్లో అనువంశికంగా వస్తుంటుంది. దీర్ఘకాలం బాధించటం వల్లన రోగులు డిప్రెషన్‌కు గురౌతారు. తద్వారా వ్యాధి తీవ్రతకు గురౌతారు. సొరియాసిస్‌ జాయింట్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఉన్నప్పుడు సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌కు గురౌతుంటారు. తీవ్రత పెరిగితే హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌ వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటిక్‌, రక్తపోటుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. చర్మ సంరక్షణకు ఇలా చేయండి (బాక్సు)చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకునేందుకు పగుళ్ల నుంచి దూరంగా ఉండేందుకు కోల్డ్‌ క్రీములు వాడాలితగిన విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న పోషకాహారం తీసుకోవాలిచర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన సహజమైన క్రీములనే వాడాలిఆహారంలో కుంకుమ పువ్వు వాడితే చర్మం నిగారింపుతో ఉంటుంది.ఆహారంలో తగినంత పసుపు, అల్లం, జీలకర్ర వాడితే తుమ్ములు,జలుబు, దురదలు వంటి ఎలర్జీల నుంచి బయటపడొచ్చు.చర్మ వ్యాధులు ఎక్కువైతే నిపుణులైన వైద్యులను సంప్రదించటం శ్రేయస్కరం.

డాక్టర్‌ హిమబిందు గొట్టాపు, ఎండి డివిఎల్‌అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డెర్మటాలజిస్ట్‌సిద్ధార్థ మెడికల్‌ కళాశాల, విజయవాడ

➡️