గోదారి చూద్దాము ఎక్కండి నావ
బలము పెరుగేనులే తాగండి జావ
మొదలు ముదిరిన చెట్టుకుంటుంది చేవ
పదిమంది నడిచేది అసలైన త్రోవ
గోడ బీటలు బారు, మొలిస్తే రావి
మల్లెపూలకు ఉండులే మంచి తావి
నీరు చుట్టిన ఎత్తు దిబ్బయే, దీవి
ఊరికుపకారమోయ్ తవ్వండి, బావి
కాకి చెబుతుందంట చుట్టాల రాక
బంధాలు పెరుగనా, మనమింక పోక
గొర్రెకుంటుందంట బెత్తెడే తోక
పొదుపు చేయాలండి, రోజుకో రూక
కావుకావంటుంది చూడండి కాకి
అడవి మార్మ్రోగగా అరచేను కేకి
ఆనందమౌతుంది మన చెవిని తాకి
గుండెలే పులకించు ఆ ధ్వనులు సోకి ..!
– కిలపర్తి దాలినాయుడు,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,రామభద్రపురం.