సాంస్కృతిక వైభవం కోసం…

krishna tarang cultural org jeevana story

ప్రతిభ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అప్పుడే కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థుల నుంచి సీనియర్‌ విద్యార్థుల్లోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియజేయటానికి దోహదపడేవి కళా ఉత్సవాలే..కృష్ణాతరంగ్‌ పేరుతో కృష్ణా విశ్వ విద్యాలయం గత 12 సంవత్సరాలుగా (కరోనా రెండేళ్లు మినహా) అలాంటి వేడుకలకు వేదిక అవుతోంది. ఇలాంటి వేడుకల్లో ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మశీ తదితర కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు చూపించే నైపుణ్యత, నటనా శైలీ అబ్బురమనాల్సిందే. సంప్రదాయ, వెస్ట్రన్‌ డ్యాన్స్‌లతోపాటుగా విచిత్ర వేషధారణ, నాటిక ప్రదర్శనలు, నాటకాలు వంటివాటితో పాటుగా కళలు ప్రదర్శిస్తూ విద్యార్థినీ విద్యార్థులు అతిథులతో శబాష్‌ అని పించుకుంటున్నారు. సంప్రదాయ వస్త్రధారణలతోపాటుగా ర్యాంప్‌ వాక్‌లు చేసేస్తుంటారు. ప్రాచీన కూచిపూడి నృత్యాలు అలరిస్తాయి. ప్రతి అంశంలోనూ చక్కని అంగిక, వాచికాభినయాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు తన్మయత్వం కలిగేలా ప్రదర్శనలు ఇస్తుండటం అభినందనీయం. పల్లె జీవనం, సంస్కృతి, ఆహార, ఆచార వ్యవహరాలతోపాటుగా పండుగల సందర్భంగా పల్లె సీమల్లో కనిపించే కళారూపాల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మహిళాసుర మర్థిని, భామాకలాపం, దశావతారం తదితర నృత్యాంశాలు ఆకట్టుకుంటున్నాయి. తమ హ్యాస్యోక్తులతో ప్రేక్షకులను నవ్వించే ఉదంతాలు కూడా అనేకం ఉంటాయి. సినిమాల్లో నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతున్న ట్రెండ్స్‌పైనా పాటలు, కుర్రకారుని హుషారెత్తించే డ్యాన్సులు డీజేల్లో హోరెత్తాల్సిందే.

భిన్నత్వంలో ఏకత్వంతో అలరాలుతున్న దేశ ప్రజలను ఉన్నత స్థాయిలో నిలబెడుతోంది సాంస్కృతిక వైభవమే. ప్రాచీన కాలం నుంచి నేటికీ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. సమాజంలో అసమానతలు పోవాలంటే సమానత్వం సాధించాలి. అది అన్ని రంగాల్లో సాధించాల్సి వుంది. జన జీవనాడిని కదిపే, కదిలించే సాంస్కృతిక రంగంపైన కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరింత విస్తృతంగా, మరింత లోతుగా ఈ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రోత్సహిస్తే సాహితీ రంగం, సాంస్కృతిక రంగాల్లో రెండు తెలుగు రాష్ట్రాలో ప్రపంచ ఖ్యాతిని పొందుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కళా, సాంస్కృతిక వైభవం కోసం కృషిని కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వ విద్యాలయం గత 13 సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. మచిలీపట్నంలో 2008లో కృష్ణా యూనివర్శిటీ ఏర్పాటైంది. తొలుత ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రారంభమైన ఈ విశ్వ విద్యాలయం అనంతరం మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన కొత్త క్యాంపస్‌లోకి 2020 జనవరిలో మారింది. అప్పటి నుంచి ఏటేటా జాతీయ, అంతర్జాతీయ యూనివర్శిటీలతో సమన్వయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది. వెబినార్లు వంటివి కొనసాగిస్తోంది. విద్యార్థుల్లో ఆల్‌రౌండ్‌ ప్రతిభను వెలికితీయటానికి అన్ని విభాగాలు తమ వంతుగా కృషిచేస్తున్నాయి.

సాంస్కృతిక ప్రత్యేకతలు : యడవల్లి శ్రీనివాసరావు

తెలుగు నేలపై ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు సాంస్కృతిక ప్రత్యేకతలు ఉన్నాయి. భాష ఒక్కటే అయినా యాసలు చాలా ఉన్నాయి. మాండలికాలు ఉన్నాయి. సాధారణ సంప్రదాయాల తోపాటు ప్రతి ప్రాంతానికీ ప్రత్యేక ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. పెళ్ళిళ్లు, పండుగలు, ఆహారం, ఆహార్యాల్లో తేడాలున్నాయి. వాటికి విభిన్న, చారిత్రక నేపధ్యాలు ఉన్నాయి. అలాంటి ప్రదర్శనా కళారూపాలు కృష్ణాతరంగ్‌లో ఆత్యంతం ఉత్సాహాన్నిస్తుంటాయి.

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీతకు దోహదం : డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు, కన్వీనర్‌, కృష్ణాతరంగ్‌-2023

యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మక, కళా, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికితీయటానికిగాను మొత్తం 27 అంశాల్లో ప్రదర్శనలకు అవకాశం కల్పించాం. గురువారంనాడు ఉదయం 11 గంటలకు ప్రారంభసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సిలర్‌ ప్రొఫెసర్‌ కె.జ్ఞానమణి హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా మచిలీపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేకతోటి దయాసాగర్‌ (ఐఆర్‌ఎస్‌ రిటైర్డ్‌), యూనివర్శిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ డి.సూర్యచంద్రరావు, రిజిస్ట్రార్‌ (ఎఫ్‌ఎసి) డాక్టర్‌ వి.వీరబ్రహ్మాచారి హాజరుకానున్నారు. పరిపాలనా విభాగం ఎదురుగా ఉన్న యూనివర్శిటీ ప్రారగణంలో ఉత్సవాలు వైభవంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణాతరంగాలు మ్యాగజైన్‌కు చీఫ్‌ పాట్రన్‌గా విసి జి.జ్ఞానమణి, పాట్రన్‌గా రిజిస్ట్రార్‌ పి.వీరబ్రహ్మాచారి, చీఫ్‌ ఎడిటర్‌గా ప్రొఫెసర్‌ ఇ.దిలీప్‌ (ఇంగ్లీష్‌ విభాగం,యుసిఎఎస్‌), కో ఎడిటర్‌గా వై.ఎవిఎస్‌ఎన్‌ మారుతి (బయాలజికల్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, యుసిఎఎస్‌, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులుగా డాక్టర్‌ ఎ.శివశేషారెడ్డి (ఫిజిక్స్‌ విభాగం), కె.సుబ్బారావు (ఇంగ్లీషు విభాగం), డి.శాంతికృప (ఫార్మశీ విభాగం) వ్యవహరిస్తున్నారు.

సాంస్కృతిక వైభవం కోసమే : జి.జ్ఞానమణి, యూనివర్సిటీ ఉపకులపతి, కృష్ణా

కృష్ణాతరంగ్‌-2023 యువజనోత్సవాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాం. గురు, శుక్ర, శనివారాల్లో మూడురోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 2000 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. 27 అంశాలతో జరిగే పోటీల్లో విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల తరపున అన్ని కళాశాలలనుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. యువజనోత్సవాల్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటుచేశాం. ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మ్యూజిక్‌, డ్యాన్స్‌, లిటరరీ, థియేటర్‌ ఆర్ట్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ వంటి కళలను ప్రదర్శించనున్నారు. యూనివర్శిటీ ప్రారంభం నుంచి నేటి వరకూ ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యార్థుల్లో నిబిడీకృతమైన కళలు, సాహిత్యం, ఇతర నైపుణ్యాలను వెలికితీయటానికి ఈ కృష్ణాతరంగ్‌ ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ జరిగే పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాం. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో త్వరలో ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల యూనివర్శిటీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు పాల్గొంటారు. అక్కడ జరిగే ఉత్సవాలు జాతీయస్థాయిలో జరుగుతాయి.

 

➡️