బక్కచిక్కిన వాడంటాం
లెక్కలలోనే ఘనుడంటాం
నక్క వినయుములవాడంటాం
టక్కరి దొంగని అంటుంటాం..
రొక్కము కాజెయ్యొదంటాం
అక్కసు కలిగుండొద్దంటాం
లెక్కన కవిగారంటుంటాం
చుక్కలలో చంద్రుడు అంటాం..
తొక్కతీసి తింటారంటాం
లక్క సీలు వేస్తారంటాం
పిక్క బలము కలవాడంటాం
డొక్కచించి వేస్తామంటాం..
అక్కకి మగనిని బావంటాం
చిక్కని పాలను కొంటుంటాం
బుక్కపట్నమొక ఊరంటాం
చక్కర్లను కొట్టాడంటాం..
చెక్క భజన చేస్తారంటాం
వక్క ఆకు కిళ్లీ అంటాం
లిక్కరు తాగి చెడకంటాం
చుక్కల మందుని వాడంటాం..
ఉక్కకు ఫేను వెయ్యంటాం
కుక్కకు విశ్వాసంబంటాం
తొక్కను పారెయ్యాలంటాం
నొక్కుల జుట్టని అంటుంటాం..
పిక్కలతో ఆడెదరంటాం
నిక్కరు బాగుందని అంటాం
కుక్కంటే భౌభౌ అంటాం
ఇక్కడ లేదని అంటుంటాం..
మొక్కకు నీరు పొయ్యాంటాం
ఒక్కడే కొడుకు అని వింటాం
అక్కరకు రాని వాడంటాం
ఎక్కడివివి అని అంటుంటాం..
జక్కన్కొక శిల్పని వింటాం
గుక్కపట్టి ఏడ్చాడంటాం
దక్కదు లాభం అంటుంటాం
గుక్కతిప్పక ఇలా మాట్లాడేస్తాం..!
దుక్కలాగా ఉన్నాడంటాం
నొక్కకు నొప్పెడుతుందంటాం
ముక్క విరిగిపోయిందంటాం
ముక్కుట, మూల్గుట అని అంటాం..!
ముక్కలాటలాడొద్దంటాం
ప్రక్కదారి పట్టొద్దాంటాం
అక్కన్న మాదన్నలని వింటాం
రక్కసి చేష్టలు అంటుంటాం..!
ముక్కంటిది ఆ గుడి అంటాం
చుక్కమ్మక్కని వింటుంటాం
ముక్కలుకోసుకు తింటుంటాం
ఎక్కములన్నీ వల్లిస్తాం
ఇక్కడికివి చాలని చెపుదాం..! -ఎన్.వి.ఆర్ సత్యనారాయణమూర్తి,9440894087