ఆత్మస్థైర్యం ముందు ఎన్ని అవరోధాలు వచ్చినా నిలబడవు. వైకల్యం కూడా తలవొంచుతుంది. అలా ‘నడకను కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు’ అంటున్న జమ్ము-కాశ్మీర్‌కి చెందిన సదాఫ్, చక్రాల కుర్చీకి పరిమితమైనా ఎన్నో సవాళ్లను అధిగమించారు. బొటిక్ నిర్వహణలో, బాస్కెట్‌బాల్ ఆటలో రాణించిన ఆమె ఇప్పుడు వ్యాపారమార్గంలో అడుగుపెట్టారు.
సదాఫ్‌కి పదేళ్ల వయసువరకు అందరిలా ఆడుతూ పాడుతూ తిరిగింది. ఒకరోజు తీవ్ర జ్వరంతో స్కూలు నుండి ఇంటికి వచ్చేసింది. అదే ఆమె చివరిసారి నడవడం. జ్వరంలో ఆమె రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. ‘కాశ్మీర్‌లోని ఆస్పత్రులన్నీ తిప్పారు. అయినా నడక రాలేదు. ముంబయి తీసుకెళ్లారు. అక్కడి డాక్టరు సలహా మేరకు కృత్రిమ షూ అమర్చుకున్నాను. అవి విపరీతమైన బరువు ఉండేవి. కాళ్లు నొప్పి పుట్టేవి. ఇక భరించలేక వాటిని వాడడం మానేశాను. అప్పటినుండి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ స్కూలుకు వెళుతుంటే నేను మాత్రం ఇంట్లోనే ఉండిపోయాను. నాన్న నాకు అండగా నిలబడ్డారు. వైకల్య బాధను నా దరిచేరకుండా చూసుకునేవారు. కుటుంబం, బంధువులు అందరూ నా బలహీనతను చూసి బాధపడితే, నాన్న మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించేవారు. నా శక్తియుక్తులపై నమ్మకం పెట్టేవారు. అలాంటి నాన్న మరణం నాకు కోలుకోలేని దెబ్బ. రోజంతా ఏడుస్తూ కూర్చొండేదాన్ని. తీవ్ర మానసిక వేదనతో కుంగిపోయాను. ఆ పరిస్థితుల్లో నా జీవితం ముగించుకోవాలా? ధైర్యంగా నిలబడాలా అన్న ప్రశ్న వేసుకున్నాను. రెండోదాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నాను’ అని సదాఫ్ తన ప్రయాణం గురించి పంచుకున్నారు.
‘వైకల్యంతో ఉన్న వారు కూడా ఏదైనా సాధించగలరని ఈ ప్రపంచానికి నిరూపించాలనుకున్నాను. నేను నడకను మాత్రమే కోల్పోయాను. నా ఆత్మస్థైర్యాన్ని కాద’ని చూపాలనుకున్నాను. 2015లో బొటిక్‌ను ప్రారంభించాను. కొన్నేళ్ల తరువాత నా చూపు మందగించడం మొదలైంది. దీంతో ఆ షాపును మూసేయాల్సివచ్చింది. అప్పుడు.. ‘ఇప్పటివరకు నేను నడవలేను, ఇప్పుడు చూపూ పోయింది. అయితే ఇంకా నా చేతులు బాగానే ఉన్నాయి కదా! వీటితో ఏదైనా సాధించాల’ని లక్ష్యం పెట్టుకున్నాను. ఎంతో సాధన చేసి, బాస్కెట్‌బాల్ నేర్చుకున్నాను. జమ్మూ-కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ తరపున పలు పోటీల్లో పాల్గొని విజేతగా కూడా నిలిచాను. నేనెంటో నిరూపించుకున్న తరువాత ఇక కుటుంబానికి సాయంగా ఒకసారి విఫలమైనా, మరోసారి ప్రయత్నించాలనుకున్నాను. కాశ్మీరీ కారానికి దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈసారి దాన్నే నా వ్యాపారమార్గంగా ఎంచుకున్నాను. ‘చక్రాల కుర్చీలో కూర్చొని వ్యాపారం ఎలా చేస్తావ’ని ప్రశ్నించిన వారే ఇప్పుడు వారి పిల్లలకి నన్ను ఉదాహరణగా చూపిస్తున్నారు’ అంటున్న సదాఫ్,
‘వైకల్యంతో బాధపడేవారు ఎప్పుడూ తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ‘బాధకరమైన అవమానాల నుండే మిమ్మల్ని మీరు నిరూపించుకునేలా ఎదగాలి. నిరాశలో జీవించకుండా మీ శక్తిసామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వైకల్యంతో మిమ్మల్ని ఎంత వెనక్కి లాగినా ఎంచుకున్న లక్ష్యంలో ముందుకే అడుగులు వేయాలి’ అంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.