నేను నిరుద్యోగుల గొంతుకను…

Nov 25,2023 10:21 #Jeevana Stories

‘నేను నిరుద్యోగుల గొంతుకను. పేదింటి ఆడపిల్లను. ఉద్యోగం కోసం కోచింగ్‌సెంటర్ల చుట్టూ పరుగులు పెట్టే అన్నలు, అక్కల్లో నేనొకదాన్ని. కొలువు కోసం తినీ తినక ఊళ్లో పోగేసుకున్న సొమ్ములు, అప్పులు చేసి పట్నానికి పయనమైన దాన్ని. ఎలాగైనా ఉద్యోగం కొట్టాలన్న లక్ష్యంతో ఆకలితో పస్తులున్న వారందరికీ ప్రతినిధిని’ అంటున్న కె.శిరీష (అలియాస్‌ బర్రెలక్క), ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల బరిలో కొల్లాపూర్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. డబ్బు లేదు, బలగం లేదు. ఏ రాజకీయ పార్టీ అండలేదు. రోజుకూలీతో పొట్టనింపుకునే కుటుంబం. అయినా ఆమె రాజకీయాల్లోకి ఎందుకు అడుగుపెట్టింది? ఆమెని ఇంతలా ప్రభావితం చేసిన అంశాలేంటి? చూద్దాం..

‘నేను పుట్టి పెరిగింది నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, మరికల్‌ గ్రామం. చిన్నప్పుడే నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. నాన్న కోసం ఎంతో ఏడ్చాను. మా కోసం అమ్మ పడే కష్టం చూడలేక ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచాను. అయినా నాన్న రాలేదు. అమ్మ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుని మమ్మల్ని పెంచింది. ఇద్దరు తమ్ముళ్లు. ఊళ్లో ఉన్న స్కూల్లో ఏడో తరగతి వరకు చదివాను. కస్తూర్బా హాస్టల్లో పదో తరగతి పూర్తిచేశాను. నారాయణ ఖేడ్‌ కాలేజీలో అగ్రికల్చర్‌ డిప్లొమా చదివాను. ఇంటర్‌ చదివితేనే ఉద్యోగం వస్తుంది అన్నారు. మళ్లీ ఇంటర్‌ చదివాను. డిగ్రీ పూర్తి చేశాను. పోలీసు జాబ్‌ కోసం ప్రయత్నించాను. ఉద్యోగం రాలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మకు సాయంగా ఉందామని ఎంతో తపించాను. ఏదైనా ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డాను. ఏదీ జరగలేదు. అప్పుడే బర్రెలను కాచి ఆ సొమ్ముతో అమ్మకు అండగా నిలబడాలనుకున్నాను. నాలుగు బర్రెలు కొన్నాను. పగలంతా వాటిని మేపేదాన్ని. ఉదయం, సాయంత్రం పాలు అమ్మేదాన్ని. అప్పుడే ఓ వీడియో చేశాను.

‘ఎంత చదివినా డిగ్రీలు, మెమోలు వస్తున్నాయి కానీ ఉద్యోగం రాలేదు ఫ్రెండ్స్‌. అందుకే, ఇగో ఈ బర్రెలు కాస్తున్నా’ అని ఓ 30 సెకన్ల వీడియో చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేశాను. అది బాగా వైరల్‌ అయ్యింది. యూట్యూబ్‌లో కూడా చాలామంది చూశారు. అదే నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఆ వీడియో తరువాత కొందరూ నన్ను ‘బర్రెలక్క’ అని ట్రోల్‌ చేశారు’ అని తన ప్రయాణం గురించి శిరీష వివరించారు. ఈ వీడియో తరువాత ఆమెపై సుమోటాగా కేసు నమోదైంది.

ఇప్పుడు తృప్తిగా ఉంది..

‘నా బిడ్డ ఎంతో కష్టపడుతుంది. పెద్దదిక్కు లేని కుటుంబమని నాకు సాయంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించేది. పెనిమిటి పట్టించుకోక పోవడంతో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ని నడుపుకుంటూ పిల్లలను పెంచాను. డేరాలు కట్టుకుని, రేకుల కప్పు ఉన్న ఓ చిన్న ఇల్లు మాది. పిల్లలు ప్రభుత్వ బళ్లోనే చదివారు. పెద్ద చదువులు చదివించే స్థోమత లేదు. ఉపాధి కోసం శిరీష ఎన్నో ప్రయత్నాలు చేసింది. నాతో పాటు టిఫిన్‌ సెంటర్‌లో పనిచేసేది. ఉద్యోగం కోసం పట్నం పోవడం, పరీక్షలు రాయడం, ఇదే పనిగా పెట్టుకుంది. పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలని కలలుగంది. జాబ్‌ రాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. బర్రెలు కాసి, కుటుంబానికి సాయంగా ఉండేది. అప్పుడు చేసిన వీడియోనే ఇప్పటి మా పరిస్థితికి కారణమవుతుందని మేమసలు ఊహించలేదు. ఆ వీడియోను లక్షలాది మంది ఫాలో అయ్యారు. ఇదే పాలకులకు నచ్చలేదు. ప్రభుత్వాన్ని కించపర్చేలా ఆ వీడియో ఉందని ఆమెపై కేసు పెట్టారు. ఎవరు పెట్టారో.. ఎందుకు పెట్టారో తెలియకుండానే ఇప్పటివరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాపై కేసు పెట్టిన సారు ఎవరో మాకు తెలియదు. పోలీసులు కూడా చెప్పలేదు. కోర్టుకు మాత్రం వెళుతున్నాం. సుమోటోగా కేసు తీసుకున్నారని చెప్పారు. అసలు ఎవరు పెట్టారో తెలియాలి కదా? అదే విషయం అడిగితే ‘డిపార్టుమెంటు నుండి ఒత్తిడి ఉందమ్మా అని మాట దాటేశారు. మాకు ఆస్తులు లేవు. అండ లేదు. ఎన్నో పాట్లు పడ్డాం. ఇగో ఇప్పుడు మళ్లీ నా బిడ్డ నామినేషన్‌ వేస్తే ఎవరెవరో.. ఎక్కడెక్కడి నుండో పెద్ద సార్లు వస్తున్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషమేస్తోంది. నా బిడ్డకు అండగా ఇప్పుడు ఇంతమంది తోడున్నారని తృప్తిగా ఉంద’ని శిరీష తల్లి అనురాధ చెబుతున్నారు.

నామినేషన్‌ ఎందుకు వేశానంటే..

‘మాలాంటోళ్లు ఉపాధి కోసమే ఉన్నత చదువులు చదువుతున్నారు. స్థోమత లేకున్నా కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారు. అగో నేను కూడా అలాగే వెళ్లాను. కడుపుమాడ్చుకుని ఫీజు కట్టాను. నోటిఫికేషన్లు పడలేదు. పోటీ పరీక్షలకు వెళితే, ఎన్నో అవకతవకలు. ఇక ఉద్యోగం మీద ఆశ వదిలేసుకుని నా ఉపాధి నేనే వెతుక్కున్నాను. ‘డిగ్రీ చదివి బర్రెలు కాస్తున్నా’ అని చేసిన వీడియోలో ఎవర్నీ దూషించలేదు. ఏ పార్టీ పేరు చెప్పలేదు. అయినా నా మీద కేసు వేశారు. కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఈ పరిస్థితికి కారణమెవరు? వాళ్లెవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఓ నిరుద్యోగికి అన్యాయం చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి చెప్పాలనుకున్నాను. ఎంతో ఆలోచించాను. అప్పుడే ఎలక్షన్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నాను. నాలాంటి ఎందరో నిరుద్యోగులకు ప్రతినిధిగా నిలబడాలనుకున్నాను. అయితే నామినేషన్‌ వేసే రూ. 5000 ఫీజు కూడా నా దగ్గర లేదు. అమ్మ, స్నేహితులు సాయం చేశారు’ అని చెప్పారు శిరీష.

దాడులు జరుగుతున్నాయి..

అక్టోబరు 8న శిరీష నామినేషన్‌ వేశారు. అప్పుడు ఆమె వెనుక ఎవరూ లేరు. ప్రచారం చేసేందుకు అనుమతి కోరితే ‘ఏదైనా ప్రచార వాహనం ఉందా’ అని అడిగారు. అప్పుడు ఆమె వెనుక మద్దతుగా నిలబడే మనుషులే లేరు. నామినేషన్‌ ఫీజు కట్టే పరిస్థితి లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా ముందుకురికింది. సోషల్‌మీడియా వేదికగా ఆమెను అనుసరిస్తున్న లక్షలాది మంది ఇప్పుడు రెట్టింపు అయ్యారు. దేశవిదేశాల నుండి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విశేష స్పందన ఆమెపై, సాయం నిలిచిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవలె ఆమె తమ్ముడిని అటకాయించి కొట్టారు. ఆ క్షణం శిరీష బావురుమని ఏడ్చుకుంటూ తమ్ముణ్ణి అక్కున చేర్చుకున్న దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. తనకు రక్షణగా పోలీసులు వచ్చేవరకు ఆమె తమ్ముడిని అంటిపెట్టుకునే ఉంది. ఆ దాడి తరువాత శిరీష గోడకు కొట్టిన బంతి వలె మరింత శక్తిమంతంగా తయారైంది. ‘నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? నేను పోటీచేయకూడదని రాజ్యాంగంలో రాశారా? మా తాత నా చిన్నప్పుడు చెప్పాడు రౌడీ రాజకీయాల గురించి.. అప్పుడు నాకు అర్థం కాలే. ఇప్పుడు నా కళ్లతో చూస్తున్నా.. నా దగ్గర డబ్బులు లేవు. కానీ నాకు అధికారం ఇస్తే ఏయే గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషిచేస్తాను. గ్రామంలో ఆస్పత్రి కడతాను. కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తా. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలండర్లు వచ్చేలా చేస్తా. ‘డబ్బులు ఇస్తాం. నామినేషన్‌ వెనక్కి తీసుకో’ అన్నారు. ఆ డబ్బులు నా జీవితాన్ని బాగు చేయొచ్చు. కానీ నా గెలుపు నాలాంటి వారందరికీ గొప్ప భరోసా ఇస్తుంది. అందుకే నేను ఆ ఒప్పందాలకు లొంగిపోలేదు. దీంతో బెదిరించారు. దాడులు చేశారు. ఈ ప్రయాణంలో మొదట నేను ఒక్కదాన్నే.. ఇప్పుడు నా వెనుక అనేక మంది ఉన్నారు. ఈ బలం నాలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపుతోంది’ అంటూ శిరీష చేస్తున్న ఉద్వేగ ప్రసంగాలను ప్రజలంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, సోషల్‌ మీడియా ఆమె ప్రయాణంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ అండగా నిలబడుతున్నారు.ఈ ఎన్నికల్లో శిరీష గెలవొచ్చు. గెలవకపోవచ్చు. కానీ, ఆమె తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. ఆమె తెగువ, పోరాటపటిమ నేటి యువతకి గొప్ప ఆదర్శం.

                                                                                                                                                      – జ్యోతిర్మయి

➡️