కార్తీకమాసంలో వనభోజనాలు, జనసమూహాల సందళ్లూ కనువిందుగా సాగుతాయి. పండుగలు, పబ్బాలకో.. జాతరలు, ఉత్సవాలు జరిగినప్పుడో ఒకచోట కలిసే జనం మరొక్కసారి ఏకమయ్యే ఆహ్లాద సందర్భాలివి! నిత్యం ఎన్నో సంఘర్షణలతో తలమునకలౌతూ ఉండే మనుషులకు కాస్తంత విరామం, వినోదం కావాలి. ఆధునిక సమాజంలో వినోద మాధ్యమాలకేం కొదవ లేదు. అయితే అవన్నీ తాత్కాలిక ఆనందాలే! ఒక్క క్షణమో, ఒక్క రోజో గుర్తుండిపోయే అల్ప సంతోషాలు. అదే, ఏడాదిలో ఒక్కరోజు నిర్వహించుకునే ఈ వనభోజనాలకు ప్రణాళికాబద్ధంగా సమాయత్తమైతే, ఆ ఆనంద క్షణాలు ఏడాది పొడుగునా గుర్తుంటాయి.
ముందుగా ప్లాన్ చేసుకోండి..
వనభోజనాలకు సిద్ధమయ్యే కుటుంబాలు ముందుగా అంటే నిర్దేశించుకున్న రోజుకు ఓ పదిరోజుల ముందే ఏ ప్రాంతాలు అనువుగా ఉంటాయో ఆలోచించాలి. వాటిలో అందరూ ఇష్టపడే ప్రాంతం ఎంచుకోవాలి. అక్కడి వాతావరణంపై కాస్తంత అవగాహన ఉన్న వారి అభిప్రాయం తప్పక తీసుకోవాలి. అప్పుడే అక్కడి సదుపాయాల్లో లోటుపాట్లు తెలుస్తాయి. అలాగే బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కలసి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూసి వస్తే మేలు. అలా చేస్తే, రోడ్డు పరిస్థితులు, రవాణామార్గంలో ఎదురయ్యే సమస్యలపై ఒక అవగాహన వస్తుంది. అలాగే ఆ ప్రాంతం అనువైనదీ లేనిదీ ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అన్ని వయసుల వారితో పెద్ద సంఖ్యలో వెళుతున్నప్పుడు జలపాతాలు, నదీ ప్రవాహాలు, సముద్ర తీరాలను ఎంచుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అలాంటి ప్రదేశాలకే వెళ్లాల్సి వస్తే – పిల్లలు, యువకులు ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా తగిన జాగ్రత్త వహించాలి.
వంటావార్పుపై ప్రత్యేక శ్రద్ధ
వనభోజనాల్లో ఎక్కువగా వంట మాస్టర్లను మాట్లాడుకుని అక్కడే వంటలు చేయిస్తుంటారు. వారు, ఉదయం మొదలుపెట్టి, మధ్యాహ్నానికి వంట పూర్తిచేసి, నిర్వాహకులకు అప్పజెప్పి వెళ్లిపోతుంటారు. ఎంతమందికి భోజనాలు అవసరమో ముందుగానే అంచనా వేసుకొని వండించాలి. అలాగే ఆహారపదార్థాలు వృధా కాకుండా జాగ్రత్తపడాలి. వండివార్చేవారు కార్యక్రమం పూర్తయ్యేవరకు అక్కడే ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. ఒకవేళ ఆహారం మిగిలిపోతే దాన్ని ఏం చేయాలో కూడా ముందే ఆలోచించాలి. ఆ ఆహారాన్ని సమీపంలోని అనాథ శరణాలయాల్లోనో, వసతి గృహాల్లోనో ఇచ్చేలా ప్రణాళిక వేసుకోవాలి.
ఆటపాటల్లో అందరూ ఉండాలి
ఈ వనభోజనాల్లో ఆటపాటలది ప్రత్యేకస్థానం. నిర్వాహకులు రకరకాల ఆటలపోటీలు నిర్వహిస్తుంటారు. వీటిలో అందరూ పాల్గొనేలా చూడాలి. చిన్న పిల్లలు ఆడే ఆటలు, పెద్దలు భాగస్వామ్యమయ్యేవి, వృద్ధులు చొరవ చూపేవి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వన విహారం అందరికీ మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే వినోదం పంచే కార్యక్రమాలుగా వెగటు పుట్టించే జబర్దస్త్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. అలాగే పిల్లలు ఆస్వాదించేలా ఏదైనా మ్యాజిక్ షో ఏర్పాటు చేస్తే ఎంజారు చేస్తారు. అందరినీ ఆనంద పరచడమే లక్ష్యంగా ఉండాలి.
ఏం తీసుకెళ్లాలి ?
ఏం తీసుకెళ్లాలి? ఎన్ని తీసుకెళ్లాలి? అనే వాటిపై కూడా అవగాహనకు రావాలి. అంటే ఆటలు, ఇతర కార్యక్రమాలకు వెంట తీసుకెళ్లే వస్తువులను ఒక జాబితా తయారు చేసుకోవాలి. వాటి నిర్వహణను ఉత్సాహవంతమైన యువతకు అప్పగిస్తే బాధ్యత నేర్పిన వారవుతారు. అలాగే చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఇలా వయసుల వారీగా, గ్రూపులను విడగొట్టుకోవాలి. ఆ గ్రూపుల బాధ్యతను ఒక్కొక్క వ్యక్తికి కాక, బృంద సభ్యులకి అప్పగించాలి. ఆ బృందంలో తమకు అప్పగించిన సభ్యులు అందరూ పాల్గొనేలా చూడడానికి ఒకరు, ఆటసామగ్రి నిర్వహణకు మరొకరు, విజేతలను ప్రకటించే సభ్యులు, ఇలా వెసులుబాటును బట్టి బాధ్యతలు పంచుకోవాలి. అప్పుడు నిర్వహణ తేలిక అవుతుంది. అందరూ పాల్గొనే అవకాశం వస్తుంది.
అవసరాలను గుర్తించాలి
మరుగుదొడ్ల నిర్వహణ, నీటి వసతిపై శ్రద్ద పెట్టాలి. చిన్నపిల్లలకు ఉపయోగపడే డ్రైపర్లు, శానిటరీ ప్యాడ్లను కూడా సామగ్రిలో భాగం చేసుకోవాలి. ఎవరికి వారే తెచ్చుకున్నా, అత్యవసరాలప్పుడు పనికివస్తాయి. అలాగే జలుబు, దగ్గు, కీళ్లనొప్పుల టాబ్లెట్లు, వాంతులు, విరేచనాల టాబ్లెట్లు, గ్యాస్ టాబ్లెట్లు, గుండెపోటు నివారణకు పనికివచ్చే ఆస్పిరిస్ టాబ్లెట్లు, సిపిఆర్ కిట్ వెంట తీసుకెళ్లడం శ్రేయస్కరం.అతివేగం వద్దు..బైక్, ఆటో, వ్యాన్, బస్‌ల్లో వనభోజనాలకు చేరుకుంటుంటారు. ఈ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి.
అతివేగం వద్దు..
వాహనాల బ్రేక్‌లు, కండిషన్ ఒకసారి సరిచూసుకోవాలి. అనుభవం ఉన్న డ్రైవరును ఎంచుకోవాలి. ఒక్కోసారి ఎంత అనుభవం ఉన్నా, అలసత్వం ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడూ జాగరూకతతో ఉండాలి. సమయం మించిపోయిందని, గమ్యానికి త్వరగా చేరాలని, వేగంగా వెళ్తున్న డ్రైవర్లను హెచ్చరించాలి.
చెత్త సేకరణపై దృష్టి
పెట్టాలిభోజనాలకు ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామగ్రిని ఎక్కడపడితే అక్కడ పారేయకుండా చూడాలి. చెత్త సేకరణ డబ్బాల్లో నిల్వచేసి దూరంగా పారేయాలి. వనాలు, తోటలు లాంటివైతే మొక్కలు, చెట్లకు హానిచేయకుండా ఉండాలి. సాధరణంగా ఇలాంటిచోట కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి నుండి రక్షణ కోసం ముందుగానే జాగ్రత్త వహించాలి.
మధుర జ్ఞాపకంగా..
ఊరు ఊరంతా ఏకమై చేసుకునే జాతర కంటే, ఇంటిల్లిపాది పాల్గొనే పండగ కంటే ఈ వనభోజనాలు ఎంతో ప్రత్యేకమైనవి. పేద, ధనిక తారతమ్యం లేకుండా, చిన్నా, పెద్దా ఆస్వాదించేవి. కుల మతాలకు తావివ్వకుండా, విద్వేష చర్చలు రానీయకుండా జరుపుకునేవి. ఆహ్లాద వాతావరణంలో ఆత్మీయతలు, అనుబంధాలు వెల్లివిరిసేవి. అన్ని జాగ్రత్తలతో, అందరి భాగస్వామ్యంతో వన భోజనాలు మధురజ్ఞాపకంగా మిగిలిపోవాలి.