సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తారల్లో నటి త్రిష ఒకరు. ఈ మధ్య ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్ 1, 2, లియో చిత్రాలు విజయం తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దర్శకుడు అరుణ్ వశీకరన్ తీసిన ‘ది రోడ్డు’ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల చేశారు. అందులో మెయిన్‌లీడ్ రోల్ పాత్రలో త్రిష నటించారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
ప్రేమ, యాక్షన్ సినిమాలతో అలరించే త్రిష ఇందులో ఎమోషన్, సస్పెన్స్‌తో కనిపిస్తారు. దాంతో ఆమె నటనకు ప్రేక్షకులు ఆనందించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. మరి తాజాగా ఆహాలో రిలీజైన ‘ది రోడ్’ సినిమా ఎలా ఉందంటే..
కథలోకి వెళితే .. మీరా (త్రిష) తన కొడుకు కెవిన్ బర్త్‌డేకు కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ మీరా గర్భవతి కావడంతో డాక్టర్ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లకూడదని సలహా ఇస్తారు. చివరి నిమిషంలో తాను ట్రిప్ నుంచి తప్పుకుంటుంది. ఆమె భర్త ఆనంద్‌తో (సంతోష్ ప్రతాప్) పాటు ఆమె కొడుకు కెవిన్ మాత్రమే కొడైకెనాల్ కారులో వెళతారు. దారిలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఇద్దరూ చనిపోతారు. తన భర్త, కొడుకు యాక్సిడెంట్‌లోనే చనిపోయారని అందరితో పాటు మీరా అనుకుంటుంది. కానీ అది ప్రమాదం కాదని, మర్డర్ అని మీరాకు ఆ తర్వాత తెలుస్తుంది? తన భర్త చనిపోయిన ప్రదేశంలోనే తరచుగా యాక్సిడెంట్‌లు జరుగుతున్నాయని మీరా అన్వేషణలో తేలుతుంది. ఆ ప్రదేశంలోనే యాక్సిడెంట్‌లు జరగడానికి కారణం ఏమిటి? ఆ యాక్సిడెంట్స్ వెనుక ఎవరున్నారు? ఆ క్రైమ్ వెనకున్న గుట్టును మీరా ఎలా బయటపెట్టింది? నిజాయితీపరుడైన మాయ (షబీర్) అనే కాలేజీ ఫ్రొఫెసర్ క్రిమినల్‌గా ఎందుకు మారాడు? ఈ క్రైమ్‌ను సాల్వ్ చేయడంలో మీరాకు ఉమ (మియా జార్జ్) ఎలా అండగా నిలిచింది? అన్నదే కథ.
ఫేక్ యాక్సిడెంట్స్‌కు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధారణ యువతి ఎలా కనిపెట్టింది? తన భర్త, కొడుకు మరణానికి కారుకులను ఎలా బయటకు రప్పించింది. వారిపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో దర్శకుడు ‘ది రోడ్’ కథను రాసుకున్నారు. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఓ వైపు మీరా కథ, మరోవైపు విలన్ స్టోరీ రెండు కథలను సమాంతరంగా చూపిస్తూ సినిమా సాగుతుంది. అయితే మీరా స్టోరీ ప్రజెంట్‌లో నడిస్తే.. విలన్ కథ మాత్రం పాస్ట్‌లో రివర్స్ స్క్రీన్‌ప్లేతో కొనసాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే టెక్నిక్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అమాయకుడైన ఓ వ్యక్తి తనపై పడ్డ తప్పుడు ఆరోపణల కారణంగా సమాజం నుంచి ఎలాంటి అవమానాల్ని ఎదుర్కొంటాడు? ఆ సంఘటనలు అతడిని ఏవిధంగా తప్పుడు దారి పట్టించాయన్నది విలన్ పాత్ర ద్వారా చూపించిన విధానం బాగుంది.
మీరా ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్స్‌తోనే ‘ది రోడ్’ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత యాక్సిడెంట్‌లో ఆనంద్, కెవిన్ చనిపోవడం, వారిది యాక్సిడెంట్ కాదని మీరా కనిపెట్టే సీన్‌తోనే అసలు స్టోరీలోకి డైరెక్టర్ ఎంటర్ అయ్యారు. ద్వితీయార్ధంలో మీరా ఒక్కో క్లూని సాల్వ్ చేస్తూ చివరి వరకు సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తుంది. అసలు ఎవరూ ఊహించని మలుపు ఉంటుంది. ప్రతీ రోడ్డుకి ఒక మలుపు ఉన్నట్టే ఈ నేషనల్ హైవే (ది రోడ్) కి ఒక కథ ఉందంటూ ముగించిన తీరు బాగుంది. అసలు కథలో వచ్చే ట్విస్ట్‌లకి చూసే ప్రేక్షకులు ఒక గొప్ప థ్రిల్‌ని ఫీల్ అవుతారు. ఒక మనిషి బతకడానికి డబ్బు కావాలి. కానీ అదే డబ్బు మనిషిని చంపి తీసుకుంటే అది నేరం. డబ్బు లేదని చావాలనుకున్న వాడిని ఆ రోడ్ (ది రోడ్) బతికిస్తే.. అతను ఎలా మారాడో చూపిస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఫేక్ యాక్సిడెంట్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దానిని స్క్రీన్‌పై చూపించడంలో కొంత తడబడ్డారు డైరెక్టర్. హీరోయిన్, విలన్ కాన్‌ఫ్లిక్ట్ సరిగా పండలేదు. మీరా ఇన్వేస్టిగేషన్ మొత్తం నిదానంగా సాగుతుంది. పెద్ద క్రైమ్‌ను వెలికితీసే సాధారణ యువతిగా త్రిష యాక్టింగ్ బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించారు. అమాయకుడి నుంచి విలన్‌గా మారే యువకుడిగా షబీర్ నటన ఆకట్టుకుంటుంది.