- డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఆర్టికల్ 14 నుండి 19 వరకు సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్షతలు ఉండరాదని పేర్కొంది. ఇవేవీ వికలాంగులకు దక్కడం లేదు. సమాజంలో నేటికీ వారు ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తున్నది. వికలాంగులు అంటేనే చిన్నచూపు చూస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో సైతం వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారిని సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఓ) 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. వికలాంగులు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, సకలంగులతో సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా చైతన్యపరిచేందుకు 1992 డిసెంబర్ 3 నుండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. యుఎన్‌ఓ సభ్య దేశాలన్నీ వికలాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకునే విధంగా ఐక్యరాజ్యసమితి రూపొందించిన వికలాంగుల హక్కుల ఒప్పంద పత్రంపై భారతదేశం కుడా సంతకం చేసింది. 2007 అక్టోబర్ 1న భారత ప్రభుత్వ క్యాబినెట్ సిఫార్సులతో రాష్ట్రపతి ఆమోదించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి అంగవైకల్యం ఉంది. ఆరోగ్య అసమానతల వలన అనేకమంది వికలాంగులు చనిపోతున్నారు. సమాజంలో వివక్షత, అసమాన విధానాలు ప్రజల ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాలుగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణలో నాణ్యత లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తలు తక్కువ మంది ఉండడం వంటివి వికలాంగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్య అసమానతల వలన వికలాంగులు మెరుగైన వైద్యం పొందడంలో వెనకబడి ఉంటున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు సాధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆరోగ్య సమానత్వం వారి హక్కు. కానీ వారు హింస, అవమానాలు, అన్యాయాలకు గురవుతున్నారు. ఫిలిప్పైన్స్, ఖతార్, బెలూచిస్తాన్, పాకిస్తాన్, దుబారు, యూఏఈ దేశాల్లో నిర్వహిస్తున్న మోడల్ డిజెబిలిటీ సర్వేని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చేయాల్సిన అవసరం ఉంది. సహాయ పరికరాలు ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ను నిర్దేశించింది. వీటి ద్వారా వికలాంగులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వికలాంగుల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్నారు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధుల్లో 46 శాతం మందికి వైకల్యం ఉందని అంచనా.
రాజ్యాంగ ఫలాలు అందుకునే హక్కు లేదా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఆర్టికల్ 14 నుండి 19 వరకు సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్షతలు ఉండరాదని పేర్కొంది. ఇవేవీ వికలాంగులకు దక్కడం లేదు. సమాజంలో నేటికీ వారు ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తున్నది. వికలాంగులు అంటేనే చిన్నచూపు చూస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో సైతం వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆదివాసీ, గిరిజనులు, వికలాంగుల హక్కుల కోసం గళం విప్పిన 90 శాతం వైకల్యం కలిగిన ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసి జైల్లో పెట్టడం చూస్తున్నాం. దీంతో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ వికలాంగులకు ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఆర్టికల్ 41 ప్రకారం వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని అభివృద్ధి చేయాలని, పని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొంది. ఇవేవీ అమలు కాకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.
విద్య, ఉద్యోగాల్లో వాటా ఎక్కడ ?
విద్య, ఉద్యోగాల్లో న్యాయ మైన వాటా వికలాంగులకు దక్కకపోవడం తో అనేకమంది ఉన్నత చదువులు చదివి నిరుద్యోగు లుగా మారుతు న్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఉద్యోగ నియామకల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వికలాంగుల కు ప్రత్యేక స్కూళ్లు, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఆటిజం, అంధత్వం, వినికిడి సమస్యతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని 2017 అక్టోబర్ 30న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికలాంగులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తున్నా పాలకులకు పట్టడం లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయమే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొనసాగుతున్నది.
21 రకాల వైకల్యాల గుర్తింపు ఎప్పుడు?
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. కానీ వైకల్య ధృవీకరణ పత్రాలు మాత్రం 1995 పిడబ్ల్యుడి చట్టం గుర్తించిన 7 రకాల వైకల్యాలకు మాత్రమే ఇస్తున్నారు. కండరాల క్షీణత, తలసేమియా, ఆటిజం, సెరిబ్రల్‌పాల్సీ వంటి తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు సర్టిఫికెట్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఆ ఏడు రకాల వైకల్యాలకు మాత్రమే వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు.
అమలుకు నోచుకోని చట్టాలు
పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేసింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017 ఇంటర్ హెల్త్ కేర్, నేషనల్ ట్రస్ట్, ఆటిజం యాక్ట్, ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం వంటి అనేక చట్టాలు దేశంలో వికలాంగుల సంక్షేమం కోసం అమలులో ఉన్నాయి. కానీ దేశ పాలకులకు చట్టాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలనే పేరుతో కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్స్‌గా అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాలను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 89, 92, 93 రద్దు చేసేందుకు, 1999 నేషనల్ ట్రస్టు సవరించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది నేషనల్ ఇన్‌స్టిట్యూషన్లను విలీనం కావించేందుకు చేసిన ప్రయత్నాలను ఎన్‌పిఆర్‌డి దేశ వ్యాప్త పోరాటాల ద్వారా తిప్పికొట్టింది.
‘సుగమ్య అభియాన్ భారత్’ ప్రచారం కోసమేనా!
సామూహిక ప్రాంతాలను వికలాంగులు వినియో గించుకునే విధంగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘సుగమ్య అభియాన్ భారత్’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో సగం వరకైనా అవరోధరహితంగా మార్చాలని నిర్దేశించిన లక్ష్యం నెరవేరలేదు. నేటికీ సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అందనంత దూరంలో ఉన్నాయి. ప్రధానమంత్రి వికలాంగులను దివ్యాంగులుగా నామక రణం చేశారు. పేరు మార్చినంత మాత్రాన వికలాంగులకు ఒరిగిందేమీ లేదనే విషయం ప్రభుత్వాలు గుర్తించాలి.
ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికలాంగుల వ్యతిరేక విధానాలపై ప్రపంచ వికలాంగుల దినోత్సవ స్ఫూర్తితో ఉద్యమించాలి. దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం, రైల్వేలో సౌకర్యాలు, అంత్యోదయ రేషన్ కార్డులు, నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్లు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి, మహిళా వికలాంగుల రక్షణ వంటి సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
/ వ్యాసకర్త ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షుడు, సెల్ : 9490098713 /యం. అడివయ్య