ప్రత్యేక సహాయంతోనే కరువు రైతుకు భరోసా

Nov 26,2023 07:15 #Editorial

దేశం మొత్తమ్మీద సాగు ఖర్చులను బేరీజు వేసుకొని కేంద్రం విపత్తు పరిహారం నిర్ణయిస్తుంటుంది. శాస్త్రీయత లేదు. రైతు సంక్షేమం దృష్టి అస్సలే లేదు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే, ఉన్నంతలో రాష్ట్రాలు ఎంతో కొంత పరిహారం పెంచడం కనీస బాధ్యత. విభజన తర్వాత మన రాష్ట్రం వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన ధర్మాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి.

ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర కరువొచ్చింది. ఎల్‌నినో వల్లనైతేనేమి నైరుతి రుతుపవనాల వైఫల్యం అయితేనేమి పంటల సేద్యానికి అనుగుణంగా అదనుకు సరైన వర్షాలు పడలేదు. నెల, అంతకంటే ఎక్కువ రోజులు చినుకు జాడ లేక తీవ్రాతి తీవ్ర డ్రైస్పెల్స్‌ చాలా ప్రదేశాల్లో నెలకొన్నాయి. ఫలితంగా సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణంలో దాదాపు 30 లక్షల ఎకరాలు సాగు లేక బీడు పడ్డాయి. ఇవి ప్రభుత్వ ఉజ్జాయింపు లెక్కలు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని ఇతర మెట్ట ప్రాంతాల్లో చాలా చోట్ల వేసిన పైర్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, మరికొన్ని చోట్ల ఎండు దశకొచ్చి మిణుకుమిణుకు మంటున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా, ఆయిల్‌ ఇంజన్లతో అధిక వ్యయ ప్రయాశలకోర్చి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికి రావని తెలిసి బాధను దిగమింగి ట్రాక్టర్లతో దున్నేస్తున్న హృదయవిదారక సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులలో నీరు లేక వారబందీపై వదులుతున్న కొద్దిపాటి నీరు పంటలను నిలపలేకపోతున్నాయి. చివరి భూములకు మొత్తానికే నీరు అందని దుస్థితి. ఇంతటి దారుణ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగం తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రైతుపక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతల విషయంలో కాఠిన్యంగా ఉంది. రాష్ట్రమంతటా దుర్భిక్షం తాండవిస్తున్నా కేవలం 103 కరువు మండలాలను ప్రకటించి ఇక అంతేనని భీష్మించుక్కూర్చుంది.

ప్రకటించిన కరువు మండలాలలోనైనా రైతులకు ఏ మేరకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) వస్తుందో ప్రభుత్వ నిబంధనలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. కరువు బారిన పడి పంటలు నష్టపోయిన రైతన్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే పరిహారం పిసరంత కూడా లేదు. దానికే రైతులను ఆదుకుంటున్నామని గొప్పలకు పోతున్నాయి. విపత్తుల బారిన పడ్డ రైతులకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను ఎప్పుడో 2015లో కేంద్రం నిర్ణయించింది. ఆ కొలబద్దలు 2020 వరకు కొనసాగుతాయంది. ఆ గడువు ముగిసినా స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను మూడేళ్లపాటు సవరించలేదు. ఈ సంవత్సరమే నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) నిబంధనలను సవరించి, వాటిని అమలు చేయాలని రాష్ట్రానికి లేఖ పంపింది. కేంద్రం నిర్ణయించిన సహాయం చూస్తే విస్తుపోవాల్సిందే. ప్రధాన వ్యవసాయ పంటలు 33 శాతానికి మించి నష్టపోయిన పక్షంలో, వర్షాధారంపై సాగు చేసే పంటలకు ఎకరానికి రూ.3,400 నిర్ణయించారు. అదే సాగునీటి వసతి గ్యారంటీ ఉన్న ఏరియాల్లో రూ.6,800 చేశారు. 2015లో వర్షాధారమైతే రూ.2,720, కాల్వల కింద రూ.5,400. ఎనిమిదేళ్లలో కేంద్రం పెంచింది రూ.680, రూ.1,400. ఇదిలా ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను ఆమోదిస్తూ 2023 నవంబర్‌ 14న జిఒఎంఎస్‌ నెం.5 జారీ చేసింది. ఈ జిఒ సరిగ్గా కరువుతో ఖరీఫ్‌ పంటలు నష్టపోయి ప్రభుత్వ సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న సమయంలో వచ్చింది. రైతులకు కనీసం ఎకరాకు రూ.యాభై వేలివ్వాలని రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు. సర్కారు నిర్ణయంలో మార్పేమీ చేయలేదు. జిఒ5 ప్రకారం ఈ నెలాఖరులోపు ఎన్యుమరేషన్‌ తంతు చేసి ఎన్ని నిధులు కావాలో తెలపాలని యంత్రాంగానికి మెమో సైతం పంపించింది. క్షేత్ర పరిశీలన చేస్తున్న అధికారులు ఆ రకంగానే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎ.పి. సర్కారు ఆ మేరకే కేంద్రాన్ని నిధులు కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇన్‌పుట్‌ సబ్సిడీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పరిమితులు కరువు బాధిత రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తెలిసిపోతుంది. కేంద్రం ఒక్కో రైతుకు ఐదెకరాల వరకు ఒక అమౌంట్‌, ఆ పైన ఇంకో అమౌంట్‌ ఇస్తామంది. కనీసం 33 శాతం నష్టం జరిగి తీరాలి. కాగా రాష్ట్ర సర్కారు ఒక రైతు ఎన్ని చోట్ల ఎన్ని ఎకరాల్లో పంటలు వేసి నష్టపోయినా ఐదెకరాల్లోపు నష్టాలకే పరిహారం అంది. ఆ పైన జరిగిన నష్టానికి పైసా ఇవ్వదు. 33 శాతం నష్టం నిబంధన సరేసరి. ఒక సీజన్‌లో ఎన్నిసార్లు ఎన్ని విపత్తుల్లో పంట నష్టపోయినా ఒక సారే పరిహారం ఇస్తామంది. ఇ-క్రాప్‌లో నమోదు కావాలని మెలిక పెట్టింది. ఇ-క్రాప్‌ ఎంత తప్పుల తడకగా సాగుతోందో చూస్తున్నాం. పంటలు వేయకపోయినా వేసినట్లు ఎంట్రీ చేస్తున్నారు. అనర్హుల పేర్లు ఎక్కిస్తున్నారు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపులూ ఉండవు కనుక వారి పేర్లు ఇ-క్రాప్‌లోకి ఎక్కే ఛాన్సే లేదు. ఇ-క్రాప్‌ నిబంధన ఎవరికి మేలు చేయడానికో ప్రభుత్వమే శెలవివ్వాలి.

కేంద్రం నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు, ఆ తర్వాతి టిడిపి ప్రభుత్వం కొంత పెంచి రైతులకు పంపిణీ చేశాయి. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య గ్యాప్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. అప్పటికీ రైతుకు జరిగిన నష్టంతో పోల్చితే ప్రభుత్వాలిచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ నామమాత్రం. కొంచెమైనా పెరిగింది కాబట్టి ఆ మేరకు రైతన్నలకు స్వల్పంగానైనా ఉపశమనం కలిగింది. కానీ ప్రస్తుత వైసిపి ప్రభుత్వం గత ఆనవాయితీకి చెల్లుచీటి ఇచ్చింది. కేంద్రం ఎంతైతే స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ ప్రకటించిందో అంతకే జిఒ ఇచ్చింది. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 2014లో హుదూద్‌ ప్రచండ తుపాను సందర్భంగా అప్పటి టిడిపి ప్రభుత్వం, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను కొద్దిగా పెంచింది. 2015లో కేంద్ర ప్రభుత్వం యుపిఎ-2 సర్కారు నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను సవరించి అమలు చేయాలని రాష్ట్రానికి లేఖ పంపింది. 2015 చివరిలో టిడిపి ప్రభుత్వం కేంద్రం సవరణలను ఆమోదిస్తూనే, అప్పటికే తాము ‘హుదూద్‌’ నుంచీ అమలు చేస్తున్న స్కేల్‌ను ఇకపై కూడా అమలు చేస్తామని జిఒ ఇచ్చింది. ఉదాహరణకు 2015లో ప్రధాన పంటలు వరి, వేరుశనగ, పత్తి, చెరకు, పసుపు, మిర్చి, కూరగాయలు, ఉల్లి, పూలు, బొప్పాయి, పుచ్చకాయలు ఎకరాకు కేంద్రం ఖరారు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2,720 కాగా రాష్ట్రం అప్పటికే ఇస్తున్నది రూ.6 వేలు. ఈ తడవ 2023లో కేంద్రం ప్రధాన పంటలను రెండు భాగాలుగా విడగొట్టి పరిహారం నిర్ధారించింది. వర్షాధార పంటలకు రూ.3,400, సాగునీటి వసతి గ్యారంటీ ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పంటలకు రూ.6,800గా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రధాన పంటలనూ ఒకే కేటగిరీలో చేర్చి పరిహారం రూ.6,800గా నిర్ధారించింది. ఎలా చూసినా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ కంటే రాష్ట్రం తన స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌) నిబంధనల్లో ఒక్క పైసా పెంచలేదు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో తిత్లీ తుపాన్‌ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. అప్పటి టిడిపి సర్కారు ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, తామొచ్చాక ఎంత నష్టం జరిగిందో అంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లయినా ఆ హామీని నెరవేర్చలేదు. ఏ సీజన్‌లో నష్టాలకు ఆ సీజన్‌లోనే పరిహారం అని సర్కారు ప్రస్తుతం ఇస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ నాడు హుదూద్‌ వేళ 2014లో టిడిపి ప్రభుత్వం నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ ప్రాతిపదికనే. తొమ్మిదేళ్లనాటి వ్యవసాయ ఖర్చులతో పోల్చితే రైతుకు కొన్ని రెట్ల ఖర్చు పెరిగింది. అరకొరగా ప్రభుత్వాలిచ్చే సాయం ఏ మాత్రం పెరగలేదు.

దేశం మొత్తమ్మీద సాగు ఖర్చులను బేరీజు వేసుకొని కేంద్రం విపత్తు పరిహారం నిర్ణయిస్తుంటుంది. శాస్త్రీయత లేదు. రైతు సంక్షేమం దృష్టి అస్సలే లేదు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే, ఉన్నంతలో రాష్ట్రాలు ఎంతో కొంత పరిహారం పెంచడం కనీస బాధ్యత. విభజన తర్వాత మన రాష్ట్రం వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన ధర్మాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. కనీస మద్దతు ధరలను నిర్ణయించే వ్యవసాయ పంటల ఉత్పత్తి ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) తాజా నివేదిక ప్రకారం అన్ని రాష్ట్రాల్లోకెల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఖర్చులు అధికం. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పలు ప్రభుత్వేతర సంస్థలు, రైతు సంఘాల సర్వేల ప్రకారం ఒక్క వరి పంటనే తీసుకుంటే ఎకరాకు రైతు పెట్టే పెట్టుబడి కనీసం రూ.40 వేలు. కౌలు రైతులైతే రూ.55 వేలు. బ్యాంకులు పంట రుణాలిచ్చేందుకు నిర్ణయించిన సగటు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ రూ.34 వేల నుంచి 38 వేలు. పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిస్తామంటున్న పరిహారం కేవలం రూ.6,800. వర్షాధారంపై వేసే వేరుశనగకు రైతుకయ్యే పెట్టుబడి రూ.30 వేలు. బ్యాంకులు నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ రూ.24-26 వేలు. ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.6,800 మాత్రమే. వాణిజ్య పంటలు, కొన్ని ఉద్యానవన పంటలు, తోటల పరిస్థితి చెప్పనలవి కాదు. రైతుల కోసమే పుట్టామంటున్న ప్రభుత్వాలు అదే రైతుల పట్ల ఎంత విద్రోహంగా వ్యవహరిస్తున్నాయో ఈ కొన్ని ఉదంతాలతో తేటతెల్లమవుతుంది. ఎ.పి. రైతుల్లో 93 శాతం మంది రుణ గ్రస్తులు. ఒక్కో రైతు కుటుంబంపై ఉన్న సగటు అప్పు రూ.2.45 లక్షలు. ఇవి నేషనల్‌ శాంపిల్‌ సర్వే, ఇతర కేంద్ర ఏజెన్సీల లెక్కలు. ఈ తరుణంలో కరువుల వంటి విపత్తులొస్తే రైతులు ఆర్థికంగా లేవలేరు. తిరిగి వ్యవసాయం సాగించలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు అమలు చేస్తే కరువు రైతులకు దక్కే సహాయం గోరంత. అదీ అందరికీ రాదు. కరువు తీవ్రత దృష్ట్యా ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఇత్యాది నిబంధనలను పక్కనపెట్టి ప్రత్యేక సహాయం లేక స్పెషల్‌ ప్యాకేజీ ఇస్తేనే రైతులకు కొంతైనా ఉపశమనం, భరోసా దొరుకుతుంది.

/ వ్యాసకర్త సెల్‌ : 9490099019 / – కె.ఎస్‌.వి. ప్రసాద్‌

➡️