‘బ్రతుకునిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం/ భేద భావములు నెరగని మానవీయ సంగమం/ మన సంస్కృతి ఘన ప్రతీక సమ్మేళనం/ ఇది తెలిసిన నాడే నిజమైన విందు భోజనం/ రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం’ అంటారు కవయిత్రి బి.సుజాత. కార్తీకం అంటే వెన్నెల నెల. ఏటా కార్తీక మాసం మధ్య నుంచి చివరి వారం వరకు వన భోజనాల సందడి కొనసాగుతుంది. ‘వేడివేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి/ పప్పూ దప్పళం కలిపి కొట్టడం/ భోజనం వన భోజనం/ వన భోజనం జన రంజనం…/ తల్లితోడు పిల్లామేకా ఆలూమగలు అత్తాకోడలు బాసూబంటూ ఒకటేనంటూ కలవడం/ భోజనం వన భోజనం’ అంటారు ఆరుద్ర. బంధు మిత్రులతో సమయం గడుపుతూ… ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మంచి ఆటవిడుపు. బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఇది ప్రకృతితో మనిషికి వున్న బంధాన్ని గుర్తుచేసుకునే రోజు. ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. ‘దీపావళి వెళితే కార్తీక మాసం వస్తుందని, అంటే శరదృతువు ద్వితీయార్థంలో వుంటామని, కార్తీకంలో వెన్నెల బావుంటుందని చెబుతూ, వెన్నెల మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని ప్రముఖ రచయిత శ్రీరమణ పేర్కొన్నారు. ఇది స్పీడ్ యుగం. పక్కవారి గురించి పట్టించుకునే తీరిక కూడా లేని తనం మనిషిని ఒంటరి చేస్తున్నది. ఆ ఒంటరితనం నుంచి, ఒత్తిళ్లతో కూడిన జీవనపోరాటం నుంచి బయటపడి, కూసింత సేదతీరేందుకు ఈ వన భోజనాలు చక్కని వేదికలవుతాయి. అంతేకాదు, బయట గడిపేందుకు ఈ కార్తీక మాసపు రోజుల్లో వాతావరణం అనువుగా ఉంటుంది. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతుంటాయి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆరుబయట అందరూ కలిసి వంటలు వండుకోవడం, చిన్నా పెద్ద తేడా లేకుండా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. అందుకే కార్తీకం రాగానే వన భోజనాలు చేయాలని అందరం సరదా పడుతుంటాం. అయితే… ఉసిరి చెట్టు వంటి ఔషధ గుణాలున్న వనంలో వన భోజనాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. వన భోజనాలంటే సంప్రదాయం ఒక్కటే కాదు… అందులో సామాజిక కోణమూ వుంది. అంతస్తుల తారతమ్యాలు, కుల, మత బేధాలు లేని స్నేహం, సమైక్యతా భావం ఈ భోజనాల్లో వెల్లివిరుస్తుంది. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేద’న్న మహాకవి మాటల స్ఫూర్తి అందరూ కలిసి పనిచేయడంలో కనబడుతుంది. కుల మతాలకతీతంగా బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సిన వన భోజనాలను కొందరు కుల భోజనాలు, ఎన్నికల భోజనాలుగా మార్చేస్తున్నారు. ఈ సంస్కృతి పల్నాటి బ్రహ్మనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు చూపిన సహపంక్తి భోజన స్ఫూర్తిని మంటగలుపుతోంది. కార్తీక వన సమారాధనలు కాస్తా కుల సమారాధనలుగా, రాజకీయ ప్రచార వేదికలుగా మారుతున్నాయి.అన్నానికి, ఆకలికి కులం ఉండదని అంటారు. కానీ… ఫ్లెక్సీలు కట్టి మరీ కులాలవారీగా ఈ వన భోజనాల తంతు నిర్వహిస్తున్నారు. చక్కని వాతావరణంలో అందరూ కలిసి భోజనం చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా యాంత్రికతను వదిలించుకొని ఉత్తేజాన్ని పొందాలే తప్ప…కులం పేరుతోనో, మతం పేరుతోనో సమీకరణలు మంచిదికాదు. సమైక్యతా భావం, సామాజిక స్పృహ ఈ సహపంక్తి భోజనాల్లో వెల్లివిరియాలి. కులంతో పనిలేకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో వన భోజనాలు జన భోజనాలుగా జరగాలి. వాస్తవానికి వన భోజనాలు ప్రకృతి ఆరాధన కోసం ఏర్పడ్డాయి. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది కనుకనే ‘వృక్షో రక్షతి రక్షిత:’ అంటారు. బహుశా ఈ నేపథ్యంలోనే వనభోజన సంస్కృతి ఏర్పడివుండొచ్చు. ‘కనిపించని చేతులతో హత్తుకుని/ మనిషికి మరింత దగ్గరవుతుంది చెట్టు/ చెట్టుపై మమకారం పెంచుకుంటాడు మనిషి/ మనుషుల గుండె చప్పుడుని/ వనమంతా చెవులు రిక్కించి వింటూ/ తన ప్రతిస్పందనను/ పున్నాగపూల వర్షంలా/ మనుషులపై చిలుకరిస్తుంద’ని చెబుతారో కవి. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన కార్తీకమాసంలో జరిగే వన భోజనాలను కుల భోజనాలుగా మార్చకుండా… ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించుకునే జన భోజనాలు కావాలి!