ప్రభుత్వం పెట్టుకున్న ప్రమాణం ప్రకారం చూసినా నెలకు రూ.6,000 కన్నా తక్కువ ఆదాయం వస్తూంటే అటువంటి కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు లెక్క. ఐతే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దారిద్య్ర రేఖ ఊసే ఎత్తడం లేదనుకోండి. వేరే ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ ”బహుళ ప్రమాణ” దారిద్య్ర రేఖ అన్న భావనను ముందుకు తెచ్చింది. దానిని పట్టుకుని మన ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయి. ఆ ప్రాతిపదిక ప్రకారం మన దేశంలో కేవలం 15 శాతమే దారిద్య్ర రేఖ కన్నా దిగువన ఉన్నారు! దరిద్రం అనేది ఒక్క బీహార్ సర్వే ప్రకారమే నిర్ధారించదగ్గది కాదనుకోండి. కాని ఆ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం దారిద్య్రం ఎంత ఎక్కువగా ఉన్నదంటే దానిని బట్టి దేశం మొత్తంగా దారిద్య్రం విస్తరించిందని నిర్ధారించవచ్చు.
భారతదేశంలో పేదరికం నికరంగా విస్తరించిన వైనాన్ని ఇటీవల జరిపిన బీహార్ కులగణన సర్వే వెల్లడించింది. అధికారం చెలాయించిన ఆ యా పార్టీలు పేదరికం తగ్గిపోయి ందని చెప్పినదంతా వాస్తవం కాదని ఈ సర్వే ధృవీకరించింది. ఈ అంశం మీద వామపక్ష పార్టీలు ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే వున్నాయి. ఈ సర్వే ప్రకారం బీహార్‌లో 34.1 శాతం ప్రజానీకం కుటుంబ నెలవారీ ఆదాయం రూ.6,000 కన్నా తక్కువగానే ఉంది. ప్రభుత్వం పెట్టుకున్న ప్రమాణం ప్రకారం చూసినా నెలకు రూ.6,000 కన్నా తక్కువ ఆదాయం వస్తూంటే అటువంటి కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు లెక్క. ఐతే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దారిద్య్ర రేఖ ఊసే ఎత్తడం లేదనుకోండి. వేరే ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ ”బహుళ ప్రమాణ” దారిద్య్ర రేఖ అన్న భావనను ముందుకు తెచ్చింది. దానిని పట్టుకుని మన ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయి. ఆ ప్రాతిపదిక ప్రకారం మన దేశంలో కేవలం 15 శాతమే దారిద్య్ర రేఖ కన్నా దిగువన ఉన్నారు! దరిద్రం అనేది ఒక్క బీహార్ సర్వే ప్రకారమే నిర్ధారించదగ్గది కాదనుకోండి. కాని ఆ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం దారిద్య్రం ఎంత ఎక్కువగా ఉన్నదంటే దానిని బట్టి దేశం మొత్తంగా దారిద్య్రం విస్తరించిందని నిర్ధారించవచ్చు. దారిద్య్ర రేఖ నిర్ధారణ కోసం రూ.6,000 కుటుంబ ఆదాయం అనే ప్రమాణాన్ని ఎందుకు ఎంచుకున్నామో ఇప్పుడు చెప్పాలి. 2011-12 సంవత్సరానికి గాను గ్రామీణ భారతంలో రోజుకు తలసరి ఆదాయం రూ.29 కనీసం వచ్చేవారంతా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నట్టే పరిగణించాలని ప్రభుత్వం నియమించిన టెండూల్కర్ కమిటీ సిఫార్సు చేసింది. 2011-12 నుంచి 2021-22 మధ్య కాలంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన ధరల సూచీ 77.5 శాతం పెరిగింది. ఆ లెక్కన సవరించితే 2021-22 నాటికి రోజువారీ కనీస తలసరి ఆదాయ ప్రమాణం రూ.51.475 అవుతుంది. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారనుకుంటే అప్పుడు వారి కనీస కుటుంబ ఆదాయ ప్రమాణం రూ.6,177 అవుతుంది. అందుచేత ప్రభుత్వం నిర్ణయించుకున్న కనీస ప్రమాణాల ప్రకారమే చూసినా రూ.6,000 కనీస కుటుంబ ఆదాయం అనేది సమర్ధించుకోవచ్చు. ఇక పట్టణ ప్రాంతాలవరకు చూస్తే ఈ కనీస ప్రమాణం బాగా ఎక్కువగానే ఉండాలి. ఐనప్పటికీ మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలను రెండింటినీ కలిపి రూ.6,000 కనీస కుటుంబ ఆదాయ ప్రమాణంగా తీసుకుందాం. వాస్తవానికి ఇది దారిద్య్రాన్ని సరిగ్గా అంచనా వేయడానికి చాలదు. ఉన్న వాస్తవ దారిద్య్రం కన్నా తక్కువే ఉన్నట్టు చూపుతుంది. ఐనా మనం రూ.6,000 ప్రమాణాన్నే ఎంచుకున్నాం. మనం లేని దరిద్రాన్ని ఉన్నట్టుగా అతిగా చిత్రిస్తున్నామంటూ మన మీద ఎవరూ విమర్శలు గుప్పించడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే ఇలా చేస్తున్నాం. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టెండూల్కర్ కమిటీ ఆ దారిద్య్ర రేఖ ప్రమాణాన్ని ప్రతిపాదించింది. మనం మరో కోణం నుండి ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ప్రణాళికా సంఘం మొదట్లో గ్రామీణ భారతంలో పేదరికాన్ని నిర్ధారించడానికి తలసరి ఆహార ధాన్యాల లభ్యతను ప్రాతిపదికగా అంగీకరిచింది. గ్రామాల్లో రోజుకు తలసరి 2200 కేలరీల కన్నా తక్కువ శక్తినిచ్చే ఆహారం మాత్రమే పొందగలుగుతున్నవారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టేనని ఒప్పుకుంది. 2017-18లో జరిగిన జాతీయ శాంపిల్ సర్వే బట్టి చూస్తే ఆ ఏడాదిలో తలసరి రోజువారీ ఆదాయం రూ.70 కన్నా తక్కువ ఉంటే వారు 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కొనుగోలు చేయలేరు. ఆ లెక్కన కుటుంబంలో సగటున నలుగురు సభ్యులు ఉంటారనుకుంటే ఆ కుటుంబ నెలసరి ఆదాయం రూ.8400 కన్నా తక్కువ ఉంటే వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు భావించాలి. 2017-18 నుంచి 2021-22 మధ్య కాలంలో వ్యవసాయ కార్మికుల ధరల సూచీ 21 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఆ ప్రకారం లెక్కిస్తే కనీస కుటుంబ ఆదాయం నెలకు రూ.10,164 కన్నా తక్కువ ఉంటే అట్టి కుటుంబాలన్నీ దారిద్య్ర రేఖకన్నా దిగువన ఉన్నట్టే. ఇక దానికన్నా పట్టణ ప్రాంతాలలో ప్రమాణం ఇంకా బాగా ఎక్కువగా ఉండాలి. ఐనప్పటికీ మనం ఎవరికీ విమర్శించే అవకాశం లేకుండా చేయడానికి రూ.6,000 ప్రమాణాన్నే పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి ఉమ్మడిగా తీసుకుంటున్నాం. ఈ ప్రమాణం ప్రకారం చూస్తే బీహార్ లో 34 శాతం ప్రజానీకం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు అక్కడ చేపట్టిన కులగణన సర్వే వెల్లడించింది. 2022-23 సంవత్సరానికి ఒక పెద్ద రాష్ట్రం అయిన బీహార్‌లో ఏకంగా 34 శాతం జనాభా దారిద్య్రంలో మగ్గుతున్నారంటే అది ఎంత తీవ్రమైన విషయం! ఒకవైపు ప్రభుత్వ అధికార ప్రతినిధులేమో దేశంలో జిడిపి వృద్ధిరేటు పెరుగుతూ వుంటే చాలునని, దానివల్లనే అన్ని ఆర్థిక సమస్యలూ తీరిపోతాయని తెగ చెప్పుకుంటున్నారు. పైగా త్వరలోనే మన దేశ జిడిపి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరబో తోందని అదే సర్వరోగ నివారణి ఔతుందని పదే పదే డబ్బా కొట్టుకుంటున్నారు. కాని ఈ ప్రచారం ఎంత పనికిమాలినదో బీహార్ సర్వే వెల్లడించింది. బీహార్ సర్వే ఫలితాలనే దేశం మొత్తానికి గనుక వర్తిస్తే దేశంలో మూడింట రెండొంతుల జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు భావించాలి. కొన్ని ఇతర సూచికలు సైతం మనదేశంలోని దారిద్య్ర తీవ్రతను నిర్ధారిస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 125 దేశాలను పరిశీలిస్తే వాటిలో మన దేశం ప్రజల ఆకలి తీర్చే విషయంలో 111వ స్థానంలో ఉంది. అటువంటి సర్వేలన్నీ అర్ధం లేనివిగా పరిగణిస్తూ ప్రభుత్వం వాటిని పక్కన పెడుతోంది. బీహార్ కులగణన సర్వే వేరే అవసరం కోసం చేపట్టినా, అది దారిద్య్ర తీవ్రతను ధృవీకరిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో బిజెపి అనుసరిస్తున్న అర్ధం లేని వైఖరిని ఈ చేదు వాస్తవాలు బట్టబయలు చేస్తున్నాయి. ఆర్థిక విషయాలలో బిజెపి వాస్తవాలను కప్పిపెట్టేవిధంగా ఎందుకు వ్యవహరిస్తోంది? బిజెపి గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలను, అందునా ముఖ్యంగా ఆశ్రిత గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చే పనిలోనే ఉందన్న వాస్తవాన్ని ఇప్పుడు అందరూ గ్రహిస్తున్నారు. వాస్తవానికి అన్ని తరహాల ఫాసిస్టు రాజకీయ శక్తులూ ఇదే విధంగా ఉంటాయి. ఐతే బిజెపి ప్రభుత్వం ఇక్కడ తన విధానాన్ని సమర్ధించుకోడానికి ”జిడిపి వృద్ధి” మంత్రాన్ని జపిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధికి జిడిపి వృద్ధి ఒక్కటే కీలకంఅని, ఆ వృద్ధి సాధించడానికి పెట్టుబడిదారులే కీలకం అని, అందునా గుత్త పెట్టుబడిదారులు మరీ కీలకం అని చెప్తోంది. అందుకోసమే ఆ గుత్త పెట్టుబడిదారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలనూ అందించడం అవసరం అని, అది కేవలం దేశ ప్రయోజనాల కోసమే చేస్తున్నాం అని చెప్పుకుంటోంది. ప్రపంచంలోనే అతివేగంగా జిడిపి వృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందుపీఠిన ఉందని గొప్పలు చెప్పుకుంటోంది. అటువంటి దేశంలో మూడింట రెండొంతుల జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్న వాస్తవం బిజెపి వాదనల డొల్లతనాన్ని, మోసకారితనాన్ని బట్టబయలు చేస్తోంది. మరి ఈ బహుళ ప్రమాణ దారిద్య్ర సూచిక సంగతేమిటి? ఈ సూచిక ఒక మేధోపరమైన గందరగోళం మీద ఆధారపడి రూపొందింది. ప్రతీ ఉత్పత్తి విధానంలోనూ పేదలుంటారు. ప్రతీ ఉత్పత్తి విధానంలోనూ వారు ప్రత్యేక తరహాలో ప్రవర్తిస్తారు. కాబట్టి ప్రతీ ఉత్పత్తి విధానానికీ దానికే ప్రత్యేకమైన ప్రాతిపదికను రూపొందిస్తేనే ఆ విధానంలోని పేదరికాన్ని నిర్ధారించగలుగుతాం. ఉదాహరణకు: భూస్వామ్య సమాజంలో పేద పిల్లలు ఆకలితో మాడతారు. వారికి చదువు దూరం. పైగా చిన్నతనంలోనే శారీరక శ్రమలోకి బలవంతంగా ఈడ్చబడతారు. అదే పెట్టుబడిదారీ విధానంలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానంలో బాలకార్మికులు ఉండరు. వారికి పేద పిల్లలు చదివే నాసిరకం స్కూళ్ళు అందుబాటులో ఉంటాయి. పేదలకు వైద్యం అందించే నాసిరకం ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. వారిదగ్గర నాసిరకం ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉంటుంది. వారిలో చాలామంది నేరాలు చేయడానికి తయారౌతారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికానికి, నేరాలకు సన్నిహిత సంబంధం ఉంటుంది. అందుచేత జైళ్ళలో మగ్గేవారిని మినహాయిస్తూ చేసే సర్వేలు వాస్తవ పరిస్థితుల్ని సంతృప్తికరంగా వివరించలేవు. పిల్లలు స్కూళ్ళకి పోతున్నారా లేదా అన్న కొలబద్ద ప్రకారం ఒక భూస్వామ్య సమాజంలోని పేదరికాన్ని అంచనా వేయవచ్చు. కాని అదే ప్రమాణం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ సమాజానికి వర్తించదు. అక్కడ చాలా నాసిరకంగా నడిచే స్కూళ్ళకు పేదపిల్లలు పోతారు. స్కూళ్ళకు పోతున్నారు గనుక వాళ్ళు పేదరికాన్ని అధిగమించినట్టే అని అనుకోలేం. కాబట్టి పేదరికాన్ని ఆ సమాజపు ఉత్పత్తి విధానం బట్టి నిర్ణయించాలి. ఒక్కో ఉత్పత్తి విధానానికీ ఒక్కోవిధంగా ప్రమాణాలు ఉంటాయి. మన దేశం మాదిరిగా వివిధ ఉత్పత్తి విధానాలన్నీ కలగలిసిపోయి వున్న చోట ఇక కనీస ఆదాయం ఒక్కటే మనకి ఉన్న ప్రమాణం. ఈ ఆదాయాన్ని లెక్కించడం కూడా అంత సులువేమీ కాదు. అందుచేత ఇతర ప్రమాణాలను తెరమీదకు తెచ్చారు. పోషకాహార లభ్యత అన్న ప్రమాణం అటువంటిదే. పోషకాహార స్థాయి దానంతట అదే ఒక కీలకమైన అంశం అయినా, దారిద్య్రాన్ని కొలవడానికి అది పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఒక భూస్వామ్య వ్యవస్థలో స్కూలుకు పోకుండా బాలకార్మికుడిగా ఉన్న పిల్లవాడైనా, ఒక అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థలో నాసిరకం స్కూల్లో చదువుతున్న పిల్లవాడైనా పేదరికంలో ఉంటే తగినంత పోషకాహారం అతడికి లభించదు. ఈ బహుళ ప్రమాణ పేదరిక అంచనాతో వచ్చిన సమస్య ఏమంటే అది పోషకాహార లభ్యత అన్న అంశానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అది నాసిరకం స్కూలా లేక ప్రమాణాలు ఉన్న స్కూలా అన్న తేడాను అది చూడదు. ఎలక్ట్రానిక్ వస్తువులు (స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ వంటివి) అందుబాటులో ఉన్నాయా లేవా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు పేదరికాన్ని తొలగించవు. మహా అయితే భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వైపు జరుగుతున్న మార్పుకు అవి సంకేతాలుగా ఉంటాయి అంతే. ఇటువంటి అస్పష్టమైన ప్రమాణాలతో ఉన్న బహుళ ప్రమాణ దారిద్య్ర రేఖనే బిజెపి సాధికారమైనదిగా ఎంచుకుంది. దాని ప్రకారమే దేశంలో జిడిపి పెరుగుతున్నకొద్దీ పేదరికం ఆటోమేటిక్‌గా తగ్గిపోతోందని ప్రచారం చేసుకుంటోంది. ఇటువంటి తప్పుడు ప్రచారం ప్రభావంలో పడి కొట్టుకుపోయేవారి కళ్ళు బీహార్ కులగణన సర్వే వెల్లడించిన వాస్తవాలతో తెరుచుకుంటాయని ఆశిద్దాం.
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్ పట్నాయక్