ధిక్కారమే !

Dec 1,2023 07:20 #Editorial

           ప్రజలెన్నుకున్న శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నప్పటికి కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లుల్లో ఏళ్ల తరబడి తొక్కిపట్టిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వాటిలో ఒక్కటి మాత్రమే ఆమోదించి మిగతా ఏడింటిని రాష్ట్రపతికి నివేదించడం సుప్రీం ఆదేశాలను ధిక్కరించడంగానే భావించాలి. రాజ్యాంగ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దారుణం. గవర్నర్‌ తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించడం, ఇటువంటి చర్యలను ఎంతమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పడం సరైన స్పందన. ”రెండేళ్లుగా గవర్నర్‌ ఏం చేస్తున్నారు? బిల్లులు ఎందుకు నిలిపి ఉంచారు? ఇంతకాలం పాటు బిల్లులను తొక్కిపట్టడానికి కారణం ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించింది. కోర్టు జోక్యం చేసుకోవడంతో బిల్లులను రాష్ట్రపతికి పంపారు. చట్టాలను రూపొందించే శాసనసభల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగం చేయరాదు. గవర్నర్‌కు రాజ్యాంగ బాధ్యత ఉంది. అది నెరవేరలేదని తేలితే కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.” అని సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సబబుగా ఉంది.

రాష్ట్ర అసెంబ్లీ అమోదించిన బిల్లులకు అంగీకారం తెలపకుండా గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారన్నది సుస్పష్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం బిల్లులపై గవర్నర్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామన్న ధర్మాసనం గవర్నర్‌ తీరులో మార్పు రాకుంటే ఆయనకు మార్గదర్శకాలు జారీ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. బిల్లులను తొక్కిపట్టిన పంజాబ్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ల తీరుపై ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం గడప తొక్కవలసివచ్చింది. అందులో తొలుత పంజాబ్‌ కేసులో తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన, విధానపరమైన అంశాలను, గవర్నర్ల పరిధి, పరిమితులను స్పష్టంగా పేర్కొంది. అయినా కేరళ గవర్నర్‌ సక్రమంగా స్పందించకపోవడంతో ‘పంజాబ్‌ విషయంలో ఇచ్చిన తీర్పును చదవమనండి’ అని సుప్రీం ధర్మాసనం గట్టిగా చెప్పడం గమనార్హం. ఆ తరువాత సైతం నిబంధనలు పాటించకుండా గవర్నర్‌ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడమేగాక అందుకు ఎలాంటి కారణం కూడా చెప్పకపోవడం బాధ్యతా రాహిత్యమే! తొక్కిపట్టినవాటిలో మనీ బిల్లు ఒకటి ఉందని కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది లేవనెత్తాకనే ‘ఆ మనీ బిల్లుపై గవర్నరు వెంటనే నిర్ణయం తీసుకునేలా చూస్తాన’ని అటార్నీ జనరల్‌ చెప్పడం చూస్తుంటే ప్రజా సంక్షేమానికి కీలకమైన బిల్లుల పట్ల రాజ్‌భవన్‌ ఎంత యథాలాపంగా వ్యవహరిస్తోందో తేటతెల్లమవుతోంది. బిల్లులో ఏముందో కాదు, దాన్ని ఎన్నాళ్లు ఎలా ఆపాలన్నదే ఆరిఫ్‌ ఖాన్‌ విధానంగా ఉందన్నమాట.

శాసనసభల ఎన్నికల్లో బిజెపి యేతర పార్టీలకు మెజార్టీ వచ్చినా గవర్నర్లను ప్రయోగించి దొడ్డిదారిన తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కాషాయ పాలకులకు వెన్నతోపెట్టిన విద్యగా ఉంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల ద్వారా అడ్డంకులు కల్పించి, పాలన సాగనీయకుండా చేయడం మరో దుర్నీతి. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకందించాల్సిన అభివృద్ధి, సంక్షేమ చర్యలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే! రాజ్‌భవన్‌ ద్వారా రాజకీయాలు నడిపే విధానాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. భారత రాజ్యాంగ మూలస్తంభాల్లో ముఖ్యమైన ఫెడరల్‌ వ్యవస్థను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం పూనుకోవడం అవసరం. గవర్నర్లు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కారన్న భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య ఎంతో అర్థవంతమైనది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడడానికి, బరితెగించిన గవర్నర్లకు ముకుతాడు వెయ్యడానికీ సుప్రీంకోర్టు కట్టుదిట్టమైన మార్గ నిర్దేశనం చేస్తుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

➡️