భారతదేశ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చింది. రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడి ఆ నల్ల చట్టాలను రద్దు చేయించారు. కాని మోడీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించలేదు. వారిపై మోపిన 45 వేల అక్రమ కేసులు నేటికీ రద్దు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బడ్జెట్‌లో ఉపాధి పథకం నిధులకు 25 శాతం కోత కోసి ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. వ్యవసాయ కూలీల పని రోజులు పడిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది. కౌలుదారులకు కనీస రుణాల చెల్లింపు అవకాశం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలకుపైగా కార్మిక, కర్షక వ్యతిరేక…కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తున్నది. స్వాతంత్య్రం అనంతరం ఎన్నడూ లేనటువంటి ముప్పేట దాడిని కార్మిక, కర్షక వర్గాలు ఎదుర్కొంటున్నాయి. ఈ విధానాలను ఓడించాలని, మోడీని అధికారం నుంచి దించాలనే నినాదంతో మహా ధర్నా జరగబోతున్నది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో మహా ధర్నా నిర్వహించాలని 500 రైతు సంఘాలకు నాయకత్వం ఇస్తున్న ‘కిసాన్ సంయుక్త మోర్చా’ మరియు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి 28 సాయంత్రం 6 గంటల వరకు నిరవధిక నిరసన ధర్నా జరుగుతుంది. భారతదేశం వ్యవసాయ దేశం. 65 శాతం జనాభా ఉపాధి వ్యవసాయంపైనే ఆధారపడి వుంది. ఇదే అమెరికాలో కేవలం 2 శాతం మాత్రమే. భారతదేశ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చింది. రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడి ఆ నల్ల చట్టాలను రద్దు చేయించారు. కాని మోడీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించలేదు. వారిపై మోపిన 45 వేల అక్రమ కేసులు నేటికీ రద్దు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బడ్జెట్‌లో ఉపాధి పథకం నిధులకు 25 శాతం కోత కోసి ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. వ్యవసాయ కూలీల పని రోజులు పడిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది. కౌలుదారులకు కనీస రుణాల చెల్లింపు అవకాశం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలకుపైగా కార్మిక, కర్షక వ్యతిరేక…కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తున్నది. స్వాతంత్య్రం అనంతరం ఎన్నడూ లేనటువంటి ముప్పేట దాడిని కార్మిక, కర్షక వర్గాలు ఎదుర్కొంటున్నాయి. ఈ విధానాలను ఓడించాలని, మోడీని అధికారం నుంచి దించాలనే నినాదంతో మహా ధర్నా జరగబోతున్నది. గత రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానాలపై ఉమ్మడి ప్రచారం సాగుతున్నది. గత ఏప్రిల్ 5వ తేదీన ‘చలో ఢిల్లీ’ సందర్భంగా కార్మిక కర్షక సంఘాలు ఐక్యతను ప్రదర్శించాయి. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, సామాజిక అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించడం, అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుగొమ్మలుగా తోడ్పడ్డాయి. చంద్రయాన్-2 విజయంలో భారతదేశ పారిశ్రామిక స్వయం సమృద్ధి స్పష్టంగా తెలుస్తుంది. కానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేస్తాం లేదా మూసేస్తాం అనే తప్పుడు విధానాన్ని కేంద్ర బిజెపి చేపట్టింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఐక్యతతో జరిగే పోరాటమే నేటి మహా ధర్నా. కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలను పరిశీలిద్దాం. ఒక్క 2023 సంవత్సరంలోనే కార్పొరేట్ కంపెనీలు ఇంతవరకు ప్రభుత్వ బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు రూ.2.14 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనితో కేంద్రం ఇప్పటి వరకు మొత్తం రూ.15.32 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను రద్దు చేసింది. ఇదే కాలంలో సాంసంగ్, విస్ట్రాన్ మరియు అనేక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరుతో రూ.1.97 లక్షల కోట్లను నేరుగా చెల్లించింది. ఈ డబ్బంతా సాధారణ ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నవే. అదానీ, అంబానీలతో సహా ఈ రుణ మాఫీలో భాగస్వాములే. పేద ప్రజల పొట్టలు కొట్టి కార్పొరేట్లను మేపే విధానాన్ని మోడీ అనుసరిస్తున్నారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే. భారతదేశ సముద్ర భాగంలో 2.23 లక్షల కిలోమీటర్ల పరిధిలో చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడానికిగాను 26 బ్లాకులను ఈ నవంబర్‌లో ప్రైవేటీకరించనుంది. గనుల చట్టాన్ని సవరించి గనులలోని ఖనిజాలను వెలికి తీయడానికి ప్రైవేటు వారికి కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అనుమతులు ఇచ్చింది. గనులు తవ్వి ఖనిజాలు తీయడానికి ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికే తవ్విన గనుల నుంచి ప్రైవేటు వారు ఖనిజాలు తీసుకునే అవకాశాలు కల్పిస్తూ ఇటీవల సవరణలు చేశారు. భూగర్భంలోని బొగ్గును తవ్వడానికి ప్రైవేటు వారికి 25 శాతం నిధులను ప్రోత్సాహకంగా ఇస్తామన్నారు బొగ్గు శాఖా మంత్రి. రాయల్టీ 12 శాతం నుంచి 3 శాతానికి తగ్గించారు. సముద్ర గర్భంలోని పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలను మరియు గనుల నుంచి అన్ని ఖనిజాలను హారతి కర్పూరంలా బంగారు పళ్లెంలో పెట్టి మరీ బడా పెట్టుబడిదారులకు బిజెపి ప్రభుత్వం అప్పగిస్తున్నది. దేశ సంపద ఎవరబ్బ సొమ్ము? బిజెపి 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడమంటే దేశ సంపదకు బాధ్యత వహించాలి. ప్రజల సంపదను కాపాడాలి. అంతేగాని ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం దుర్మార్గం. భారత రైల్వేలో ప్రయాణం ప్రపంచంలోకెల్లా అతి చౌకయినది. ఇప్పటి వరకు 43 శాతం రైల్వే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణ ఖర్చులో రాయితీ ఇస్తున్నది. సరుకులను ప్రజలకు చౌకగా రవాణా చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైళ్లను ప్రజా సంక్షేమం కోసం నడిపిస్తున్నది. కానీ నేడు వ్యాపారం కోసమే నడపాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్యాసింజర్ రైళ్లను ఎత్తివేయడం, ఏసి కోచ్‌లను పెంచడం, 400 రైల్వే స్టేషన్లను, చుట్టూ ఉన్న స్థలాలతో సహా ప్రైవేటు వారికి అప్పగించడం రైల్వే ప్రైవేటీకరణలో భాగమే. దీనివలన ప్రజలకు రైల్వే సౌకర్యాలు తగ్గిపోతాయి. ప్రజలపై భారాలు పెరుగుతాయి. అలాగే విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దేశమంతా 80 లక్షల కోట్ల విలువ కలిగిన విద్యుత్ పంపిణీని అదానీ, టాటా, జిందాల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మన రాష్ట్రంలో ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను ఎత్తివేయబోతున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించి పూర్తి చార్జీలు వసూలు చేస్తారు. ఇప్పటికే పాత బకాయిలు, ట్రూఅప్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డిపాజిట్ పేరుతో నెలకు ప్రతి యూనిట్‌కు అదనంగా 2 రూపాయలు పెంచుతున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలలో భాగమే.కార్మిక, కర్షక వర్గాలు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు జమ్ము-కాశ్మీర్‌లో లేబర్ కోడ్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్నే దేశమంతా అమలు చేయడానికి సిద్ధపడుతున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ లు జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభం పేరుతో దేశమంతటా ఉత్సవాలు జరపాలని చూస్తున్నాయి. మణిపూర్ మారణహోమాన్ని కప్పిపెట్టేందుకు గాను మతోన్మాద కార్యక్రమాలను రెచ్చగొడుతున్నది. పాలస్తీనాకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రగులుస్తున్నది.కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాల ద్వారా కేంద్ర బిజెపి విధానాలను ఓడించడమే నేడు ఏకైక లక్ష్యంగా ముందుకు సాగాలి. మహా ధర్నాను జయప్రదం చేయాలి.
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి / సిహెచ్. నరసింగరావు