గాజాలో అమాయక పౌరులపై యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం ఆరువారాలుగా సాగిస్తున్న మారణ హౌమానికి స్వల్ప విరామం ప్రకటించడం ప్రపంచవ్యాపిత శాంతి ఉద్యమకారులకు లభించిన విజయమనే చెప్పాలి. కాల్పుల విరమణ’ లేదా. ‘మానవతా విరామం’ ఏ పేరుతో పిలిచినప్పటికీ గాజా ప్రజలు నాలుగు రోజుల పాటు ఊపిరిపీల్చుకోడానికి, మరణాలు, విధ్వంసాలు నివారించేందుకు ఇదొక అవకాశం. అయితే, తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత కాల్పుల విరమణగా మారాలి. పాలస్తీనా సమస్యకు రాజకీయ పరిష్కారం చూపేవరకు కాల్పుల విమరణ కొనసాగించేలా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచాల్సిన అవసరముంది. ఖతార్ మధ్యవర్తిత్వంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే ఇది కాల్పుల విరమణ కాదు, మానవతా విరామం మాత్రమే, నాలుగు రోజుల తరువాత మళ్లీ యుద్ధం కొనసాగిస్తామంటూ యుద్ధోన్మాది, యూదు దురహంకార నేత నెతన్యాహు హూంకరించడంలో ఆశ్చర్యం లేదు. కాల్పుల విరమణ డిమాండ్‌ను ఇజ్రాయిల్ కానీ, దానికి వెనక నుండి డబ్బు , ఆయుధాలు అందిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ మొదటి నుంచి తిరస్కరిస్తూ వస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాలకు, గాజాలో ఇజ్రాయిల్ అమానుష దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు సంఘీభావంగా ప్రపంచవ్యాపితంగా పెల్లుబికిన ఉద్యమాల ఒత్తిడికి బైడెన్, నెతన్యాహులు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెతన్యాహు యుద్ధోన్మాదాన్ని ఇజ్రాయిలీయులంతా సమర్థించడం లేదు. నెతన్యాహు అవినీతి, అసమర్థ నిర్వాకం, అమాయక పౌరులపై సాగిస్తున్న హత్యాకాండకు వ్యతిరేకంగా చాలా మంది ఇజ్రాయిల్ పౌరులు ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పాశ్చాత్య మీడియా వీటిని బయటకు రానీయకుండా తొక్కిపట్టేస్తున్నది. ఏడాది లోపు అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలోనూ బైడెన్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, కార్మికుల నిజ వేతనాలు పడిపోవడం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యానికి తోడు గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు వందల కోట్ల డాలర్ల నగదు, ఆయుధాలను రహస్యంగా అందజేయడంపై అమెరికన్లలో ఆగ్రహం ఎంతగా గూడుకట్టుకుని ఉందో వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఎదుట లక్షలాది మందితో జరిగిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీయే తెలియజేస్తోంది. చికాగో, న్యూయార్క్, అట్లాంటా ఇలా అమెరికాలోని ప్రధాన నగరాలన్నీ నిరసనలతో హౌరెత్తాయి. చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వడం వీటన్నిటి ఫలితంగా ఇజ్రాయిల్, అమెరికా దిగిరాక తప్పలేదు. ఈ నాలుగు రోజుల విరామాన్ని తన సైనిక శక్తిని మరింతగా కూడదీసుకుని గాజాతో బాటు , దానిని ఆనుకుని వున్న సిరియా, లెబనాన్, ఇరాన్‌లపై దాడులకు దిగడం ద్వారా దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలన్న దుష్ట తలంపు ఉన్నట్లు వస్తున్న వార్తా కథనాలను కూడా కొట్టిపారేయలేం. కాల్పుల విరమణ ఒప్పందం సవ్యంగా సాగితే హమాస్ తన వద్ద ఉన్న 236 మంది బందీల్లో మహిళలు, పిల్లలు 50 మందిని విడుదలజేస్తుంది. దీనికి బదులుగా ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న 10 వేల మందిలో 150 మందిని 19 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను విడుదలజేస్తుంది.ప్రతిరోజూ గాజాలోకి 300 సహాయక ట్రక్కులను ఇజ్రాయిల్ సైన్యం అనుమతిస్తుంది. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు, అమెరికా నిఘా డ్రోన్లను పరిమితం చేస్తారు. దీనిని నెతన్యాహు ప్రభుత్వం ఏ మేరకు గౌరవిస్తుందో చూడాలి. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఇంధనం, మందులు వంటి అత్యవసరాలను నిలిపివేసి, వారిని అశక్తులను చేయడం, టన్నుల కొద్దీ బాంబులు కురిపించడం ద్వారా జాతి నిర్మూలన చేయడమే నెతన్యాహు లక్ష్యంగా ఉంది. గత ఆరువారాల్లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 14,500 మందికిపైగా బలయ్యారు. వారిలో చిన్నారులే ఆరు వేల మంది వరకూ ఉన్నారు. 6,800 మంది ఆచూకీ లేదు. ఈ మారణకాండను ఆపాలని బ్రిక్స్ కూటమిలో సహచర సభ్య దేశాలన్నీ డిమాండ్ చేసినా భారత్ మాత్రం అమెరికాతో కలసి నెతన్యాహుకే మద్దతు పలకడం సిగ్గు చేటు. ఆన్‌లైన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు ఆయన ముఖం చాటేశారు. భారత విదేశాంగ విధానాన్ని మోడీ రివర్స్ చేస్తున్నారు. పాలస్తీనాకు సంఘీభావం తెలపకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు, నియంత్రణలు, నిషేధాలను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో యూదు దురహంకారానికి బిజెపి, ఆరెస్సెస్ పూర్తి మద్దతునిస్తున్నాయి. విడి సావర్కర్ నుంచి నేటి దాకా వీటిది ఇదే వైఖరి. దీనికి వ్యతిరేకంగా కలకత్తాలోను, కేరళలోని కొచ్చి, ఇతర ముఖ్య పట్టణాల్లోను, వివిధ రాష్ట్రాల్లోను వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ర్యాలీలు నిర్వహించడం మంచి పరిణామం. పాలస్తీనా సమస్యకు ఒక్కటే పరిష్కారం. తూర్పు జెరూసలెం రాజధానిగా 1967 నాటికి ముందున్న సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా ఏర్పడాలి. ఇందుకు యుద్ధం కాదు, చర్చలే ఏకైక మార్గం. అంతవరకు కాల్పులవిరమణ కొనసాగించాలి.