నీటిమూటగా వాటర్‌ గ్రిడ్‌

Nov 20,2023 23:38 #palnadu district

 

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆర్భాటంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తరువాత ఉత్త చేతులు చూపడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కరిచేందుకు వాటర్‌ గ్రిడ్‌ పేరుతో రూ.2665 కోట్ల అంచనాలతో పరిపాలన ఆమోదం తెలుపుతూ 2017 జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు వచ్చి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఇంత వరకు కదలిక లేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 9 నియోజకవర్గాల పరిధిలో 450 గ్రామాలకు రక్షిత తాగునీటి వసతి కల్పించేందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చినా ఇంత వరకు పనులకు సంబంధించి టెండర్లు ఖరారు కాలేదు. మరో మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది. వైసిపి ప్రభుత్వ హయంలో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది.
నిధులివ్వకుండా, పనులు చేపట్టకుండా ఉత్తుత్తి జీవోలు ఇవ్వడం వల్ల ప్రజల్లో అభాసుపాలవుతున్నామని వైసిపి నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి మాట్లాడటానికి ధైర్యం చేయకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఐదేళ్ల కాలపరిమితికి కూడా పూర్తికాకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వైసిపి నేతలకు ఇరకాటంగా మారింది.
పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, గుంటూరు జిల్లా పరిధిలో తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు కలిపి తాగునీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌పేరుతో పైపు లైను పనులు చేపట్టాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్‌ నుంచి బుగ్గవాగు ద్వారా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీటిని అందజేసేందుకు ఈ నిధులు కేటాయించారు. బుగ్గవాగులో వేసవిలో సైతం నీటికి ఇబ్బంది ఉండదు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లె, పెదకూరపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో 450 గ్రామాల్లో రక్షితనీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
రోజూ ప్రతి మనిషికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 135 లీటర్లు నీరు సరఫరా చేసేలా మార్గదర్శకాలు రూపొందించారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు నాగార్జున సాగర్‌ జలాశయం అందుబాటులో ఉన్నా తాగునీరు లభించని పరిస్థితి నెలకొంది. వినుకొండ నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్యా తీవ్రంగా ఉంది. రక్షిత నీటి పథకాలు నిర్వహణలో గ్రామపంచాయతీల అలసత్వం వల్ల తరచూ మరమ్మతులకు గురై సకాలంలో తాగునీరు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో 600 నుంచి వెయ్యి అడుగుల వరకు బోర్లు నిర్మించినా తాగు నీరు రావడం లేదు. సాగర్‌ చెంతనే ఉన్న కృష్ణా జలాలను సరఫరా చేయటానికి ఇప్పటివరకు నిధుల కొరతతో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
పులిచింతల జలాశయంపై ఎత్తిపోతల నిర్మాణం చేపట్టడం ద్వారా గురజాల, పెదకూరపాడు, నియోజకవర్గాలతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు అందించాలని గత ప్రభుత్వంలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రతిపాదనను వైసిపి ప్రభుత్వం కనీసం పరిశీలన కూడా చేయలేదు. చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజక వర్గాల్లోని గ్రామాలకు కూడా నిత్యం తాగు నీరు లభించని పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా వేసవిలో చిలకలూరిపేట, వినుకొండ పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి ఎదురవుతోంది. వినుకొండ గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధుల కోసం వత్తిడి చేయడంలో ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించడం లేదు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు తాగునీటి వసతి కల్పించుకోవాలని కేంద్రం సూచిస్తుంది. జలజీవన్‌ మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు.

➡️