ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 25 నుంచి డిసెంబర్ 5 వరకు బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి మరోసారి తనిఖీ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులకు సూచించారు. రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు మరణించిన వారి ఓట్లను తొలగించడానికి, పొరపాటున తొలగించిన వారిని చేర్పించడానికి బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లాలని తెలిపారు. బుధవారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమ్మరీ రివిజిన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 2, 3 తేదీల్లో బూత్ స్థాయిలో స్పెషల్ కాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుండి 21 వరకు వారం రోజుల్లో ఫారం-6 చేర్పుల కోసం 3158 , ఫారం-7 తొలగింపుల కోసం 2861, ఫారం-8 సవరణ కోసం 3879 మొత్తం 9898 దరఖాస్తులు అందాయని తెలిపారు. జంక్ క్యారెక్టర్లు 4047 ఉండేవని, అవి 778కు తగ్గాయని చెప్పారు. 18, 19 ఏళ్ల వయసుగల ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో 17 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా చేర్పించేందుకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌తో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. వారి నుండి స్పందన బాగుందని, ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చామని వెల్లడించారు. ఇపి రేషియో, జెండర్ రేషియోలపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఓటర్లకు లక్షా 3 వేల ఎపిక్ కార్డులను జనరేట్ చేశామన్నారు. ఇప్పటికే 25 వేల వరకు డిస్పాచ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ అనిత, ఇఆర్‌ఒలు వెంకటేశ్వరరావు, దొర, సుధారాణి, నూకరాజు, వైసిపి ప్రతినిధి రొంగలి పోతన్న, టిడిపి ప్రతినిధి కిమిడి నాగార్జున, ఆప్ ప్రతినిధి దయానిధి, బిజెపి ప్రతినిధి రాజేష్ వర్మ, బిఎస్‌పి ప్రతినిధి సోములు పాల్గొన్నారు.పారదర్శకంగా ఓటర్ జాబితా తయారుచేయాలివిజయనగరం కోట : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమగ్రమైన, పారదర్శకంగా ఓటరు జాబితా తయారు చేయాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున.. కలెక్టర్ నాగలక్ష్మికి వినతి అందించారు. జిల్లాలో జీరో డోర్ నంబర్‌తో ఉన్న ఓట్లకు సరైన డోర్ నెంబర్ ఇవ్వాలని కోరారు. ఒకే డోర్ నెంబర్‌తో 10 కన్నా ఎక్కువ ఉన్న ఓట్లను సరి చేయాలన్నారు. జిల్లాలో డబుల్ ఎంట్రీలతో ఉన్న ఓట్లను గుర్తించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, మరణించిన వారి ఓట్లను పూర్తి స్థాయిలో తొలగించాలని కోరారు.