ప్రజాశక్తి-విజయనగరం టౌన్
దేశంలో మహిళలపై జరుగుతున్న హింస నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ డిమాండ్ చేశారు. హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో 46 డివిజన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, అశ్లీల సాహిత్యం, చానళ్లలో ప్రచారాలు, సెల్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలు, వీడియోలు, పాశ్చాత్య సంస్కృతి విస్తరించి నేటి యువత దారి తప్పుతోందన్నారు. ఫలితంగా రోజురోజుకూ మహిళలపై ఆత్యాచారాలు, హత్యలు, గృహహింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని నివారించేందుకు పాలకులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న పోర్న్‌ను నిషేధించాలని, అందాల పోటీలు నిర్వహించరాదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు పుణ్యవతి, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.