రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, జిల్లా అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం
భారత రాజ్యాంగంలో ఉద్యోగులకు కార్యనిర్వహణలో కీలకమైన బాధ్యత ఉందని, వారంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు పైస్థాయి నుండి కింది స్థాయి వరకూ విధులు రాజ్యాంగ బద్ధంగా, సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నో సవరణలు చేసినా పీఠిక స్వరూపం మారలేదని, అంత ఉన్నతంగా మన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిఆర్‌ఒ అనిత సభాధ్యక్షత వహించగా, మెప్మా పీడీ సుధాకర్‌ తదితరులు రాజ్యాంగ విశిష్టతపై మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్‌ పొటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి కె.సందీప్‌ చదవగా, పాల్గొన్న వారంతా వారిని అనుసరించి చదివారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎఒ దేవ్‌ప్రసాద్‌, సిబ్బంది, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరంటౌన్‌ : రాజ్యాంగ స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించి సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిదేనని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్తు కార్యాలయంలో బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, కె.వి.సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు నివాసంలోని చిన్న శ్రీను సోల్జర్స్‌ అధ్యక్షులు సిరిసహస్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాజ్యాంగాన్ని రక్షించాలంటే వైసిపిని గద్దెదించాలి
విజయనగరం టౌన్‌ : వైసిపి సర్కారును ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ప్రజా పాలన రావాలి.. సైకో రాజ్యం పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్‌ రావు, పితాల లక్ష్మి, దుప్పాడ జ్యోతి, ఏంటి రాజేష్‌, పిడుగు సతీష్‌, గొల్లపల్లి మహేష్‌ పాల్గొన్నారు.

➡️