ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/భోగాపురం : ఆమె అధికారి కాదు… ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు… ఎన్‌జిఒనా అని ప్రశ్నిస్తే అబ్బబ్బే కాదంటూ ఖండించారు. అధికారులు కూడా తమకు ఎలాంటి సమాచారమూ లేదని చెబుతున్నారు. కానీ, ఆ అజ్ఞాత వ్యక్తి ఉపాధి హామీలో భాగంగా చేపట్టిన అమృత సరోవర చెరువును పరిశీలించారు. చుట్టుపక్కల ఉపాధి హామీ నిధులతో నాటిన తోటలను కూడా చూశారు. అంతటితో ఆగలేదు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచి, ఎపిఒ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉపాధి పనులపై సమీక్షించారు. మొక్కలు ఎక్కువగా పెంచాలంటూ తెగేసి సూచనలు చేశారు. చెరువుల్లో నీరు చేరాలంటే ఎలాంటి పనులు చేయాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకుడు గుంతలు, ఫిష్ పాండ్స్ తవ్వాలని కూడా సూచనలు చేశారు. డ్వాక్రా రుణాలు, ప్రభుత్వ పథకాలపైనా ఆరా తీశారు. భోగాపురం మండలం నందిగాంలో ప్రత్యక్షమైన ఆమె హడావుడిపై జిల్లాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయమై డ్వామా పీడీ ఉమాపరమేశ్వరిని ప్రజాశక్తి వివరణ కోరగా ఫీల్డ్ విజిట్‌కు వస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారమూ లేదని తేల్చిచెప్పారు. అమృత సరోవర చెరువు గురించి ఫోన్‌లో అడిగిన వ్యక్తికి సమాచారం మాత్రమే ఇచ్చానని చెప్పారు. పీడీకి తెలియకుండా ఉపాధి హామీ పనుల పరిశీలన, సూచనలు ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతు న్నాయి. ఎవరికీ సంబంధం లేకుండా ఇన్ని వివరాలు సేకరిస్తున్న ఆ మహిళ ఎవరు?. ఇదే విషయమై ఆ మహిళను ప్రజాశక్తి ప్రశ్నించగా ‘నా పేరు లీలావతి, నన్ను కమిషనర్ మేడమ్ పంపారు. ఫొటోలు గట్రా తీయవద్దు’ అంటూ సమాధానం చెప్పారు. ఇదే నిజమైతే డ్వామా పీడీకి లిఖిత పూర్వక ఆదేశాలు తప్పనిసరిగా అందాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్‌కు కూడా సమాచారం ఉండి తీరే ఉంటుంది. అటువంటిదేమీ లేకపోవ డంతో ఆ అజ్ఞాత మహిళ సమాధానం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచుతున్నట్టు, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితరాలపై వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు, దాన్ని ఏమాత్రమూ నమ్మవద్దని పిఆర్ అండ్ ఆర్‌డి కమిషనర్ గత నెల 13న 2783 నంబర్‌తో ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేశారు. తాజాగా తిరిగి కమిషనర్ పంపారంటూ లీలావతి అనే మహిళ చెప్పడంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు పెనుభూతాలుగా వ్యక్తమౌతున్నాయి.