పాఠశాలలు మూసివేతకు కారకులెవరు

Nov 27,2023 16:23 #Kurnool
utf meeting on school

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యారంగానికి పెద్దపీఠవేశామని చెబుతున్న ప్రభుత్వం గత నాలుగేళ్ళలో 4709 పాఠశాలలు ఎలా మూతబడ్డాయో సమాధానం చెప్పాలని ప్రభుత్వపాఠశాలలను మూసేసి కార్పోరేట్లకు పరోక్షంగా రెడ్ కార్పేట్లను పరుస్తోందని సాహితీస్రవంతి రాష్ట్రఅధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. సోమవారం ఉదయం కెకె భవన్ లో జరిగిన క్రిష్ణగిరి యూటిఎఫ్ శాఖ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా నాయకులు యూఆర్ ఏ రవి కుమార్ అధ్యక్షతన జరిగిన తొలి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించడం పరిష్కారం కాదని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టులను భర్తీచేయడం ద్వారానే ప్రభుత్వ బడుల మనుగడ సాధ్యమన్నారు. మానవ వనరుగా పేర్కేనబడే విద్యలో సంస్కరణల పేరుతో విద్యారంగం నిర్విర్యమైందన్నారు. ఉద్యోగులకు గుదిబండగా మారిన సీపియస్ ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం సీపియస్ స్థానంలో జీపియస్ తెచ్చి మోసం చేసిందన్నారు. ప్రస్తుతం విద్యా, ఉపాధ్యాయ రంగాలు ప్రమాదం ఉన్నాయని వాటిని కాపాడుకుని మెరుగైన సమాజం నిర్మించాలంటే ఉద్యమాలే శరణ్యమని ఉపాధ్యాయులు మిలిటెంట్ పోరాటాలకు సన్నద్దమవ్వాలని పిలుపునిచ్చారు. హక్కులు-బాధ్యతలు రెండుకళ్ళుగా యూటిఎఫ్ పోరాటాలు చేస్తున్న సందర్భంలో మరింత ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో క్రిష్ణగిరి మండల అధ్యక్షకార్యదర్శులు రామ్మూర్తి, నాగరాజు, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, శేషారెడ్డి, దొంతుల .రాములు, నవీన్ పాటి, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️