విద్యార్థినులు విద్యలో రాణించి చరిత్ర సృష్టించాలి : ఆర్‌కె రోజాశ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో పూర్వవిద్యార్థినుల సమ్మేళనంప్రజాశక్తి – క్యాంపస్: విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్రమంత్రి ఆర్‌కె.రోజా పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో మంగళవారం వార్షిక పూర్వవిద్యార్థినుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థిని, రాష్ట్రమంత్రి ఆర్‌కె.రోజా విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీవారి పాదాల చెంతగల ఈ కళాశాలలో చదువుకోవడం విద్యార్థినుల పూర్వజన్మ సుకతమన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత తిరిగి కళాశాలలో తన గురువులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళావిద్యను ప్రోత్సహిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. ప్రతిఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దాన్ని సాధించేందుకు అహర్నిశలు శ్రమించాలన్నారు. అనుకున్న స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, కళాశాలకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తాను ఈ స్థాయికి రావడానికి సహకరించిన కళాశాల అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. మరో పూర్వవిద్యార్థి, తిరుపతికి చెందిన ప్రముఖవైద్యురాలు డాక్టర్ కష్ణప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థినులకు ఏకాగ్రత ముఖ్యమని, దాన్ని పెంపొందించుకుంటే ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్ డిఎం.ప్రేమావతి మాట్లాడుతూ 70 ఏళ్ల అపూర్వమైన చరిత్ర కళాశాల సొంతమని, వేలాది మంది విద్యార్థినులను విద్యావంతులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థినులు చాలా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కళాశాలకు ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిందని, అటానమస్ దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. అనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ, అల్యూమినీ ప్రెసిడెంట్ వసుధ, వార్డెన్ విద్యుల్లత, తెలుగు అధ్యాపకురాలు డా.కష్ణవేణి, పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, అధ్యాపకులు, పూర్వవిద్యార్థినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.