సెక్టార్‌ అధికారులదే కీలకపాత్ర

ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసు అధికారులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్‌ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. రిటర్నింగ్‌ అధికారులకు సెక్టార్‌ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒకొక్క రిటర్నింగ్‌ అధికారికి 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని పేర్కొన్నారు. ఒకో సెక్టార్‌ అధికారికి 10 నుంచి 15 పోలింగ్‌ కేంద్రాల పరిధి ఉంటుందని చెప్పారు. సెక్టార్‌ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్‌ అధికారాలు కల్పిస్తున్నట్టు వివరించారు. సెక్టార్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రాన్నీ స్వయంగా సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని అన్నారు. సమస్యాత్మక అంశాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే తమ పరిధిలో సోషల్‌, కమ్యూనిటీ, పొలిటికల్‌, లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బూత్‌ లెవల్‌ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎస్‌హెచ్‌వోలను ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్‌, ఇవిఎం, పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సిబ్బంది కీలకమన్నారు. ప్రతి ఎన్నికలనూ కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్‌ అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణకు 139 అధికారులకు 21 మంది గైర్హాజరయ్యారని, వారంతా ఈ నెల 28న జరిగే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ జరగాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు మాస్టర్‌ ట్రైనీ జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం ఇవిఎంల ద్వారా ఓటింగ్‌ విధానాన్ని వివరించారు. శిక్షణా కార్యక్రమం లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీస్‌ అధికారులు హాజరయ్యారు.

 

➡️