నందిగార మండలం నరేంద్రపురం వద్ద షట్టరు దుస్థితి
- 2009లో షట్టర్ల కొనుగోళ్లలో అవినీతిపై సిఐడి కేసు
- కొత్త షట్టర్ల ఏర్పాటుకు అడ్డంకిగా కోర్టు కేసులు
- పలుచోట్ల శిథిలావస్థకు చేరిన షట్టర్లు
- శివారు భూములకు సాగు నీరందని పరిస్థితి
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
వంశధార శివారు భూములకు షట్టర్ల కుంభకోణం కేసు అడ్డంకిగా మారింది. షట్టర్ల కొనుగోళ్లలో అవినీతిపై 2009లో సిఐడి కేసు నమోదు చేసింది. దీనిపై నేటికీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఘటన జరిగి 14 ఏళ్లు అవుతున్నా, నేటికీ విచారణ ఒక కొలిక్కి రాలేదు. విచారణ పెండింగ్‌లో ఉండడంతో, కాలువలపై కొత్త షట్టర్లను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు సీజ్ చేసిన షట్టర్లు తుప్పు పట్టిపోవడంతో కోట్లాది రూపాయాల ప్రజాధనం వృథా అవుతోంది. సాగునీటి సలహా మండలి, జిల్లా సమీక్షా కమిటీ సమావేశాలు తదితర సందర్భాల్లో జలవనరులశాఖ అధికారులు పలు పర్యాయాలు ప్రస్తావిస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. దీంతో కొత్తగా షట్టర్లు ఏర్పాటు చేసుకోలేక, పాడైన వాటితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.నరసన్నపేట వంశధార ఇంజినీరింగ్ అధికారులు 2009లో కొనుగోలు చేసిన షట్టర్లలో బయటపడ్డ అవినీతి సాగు రంగానికి శాపంగా మారింది. అధిక ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సిఐడి రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో పెండింగ్‌లోనే ఉంది. 13 ఏళ్లు గడచినా కేసు తేలకపోవడంతో, కాలువలపై ఏర్పాటు చేయాల్సిన షట్టర్లు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. హిరమండలం, టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కార్యాలయాల్లో సుమారు రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల విలువ చేసే షట్టర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి పాడైపోవడంతో కాలువలపై బిగించడానికి అవకాశం లేకుండా పోయింది. వీటిని వేలం వేసి కొత్తగా కొనుగోళ్లు చేయాల్సి ఉంది. అలా చేయాలంటే ప్రభుత్వం కేసును సాధ్యమైనంత తొందరగా ముగింపు పలకాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు కొంతమంది జైలుకు వెళ్లారు. ఒకరిద్దరు మరణించారని కూడా అధికారులు చెప్తున్నారు. కేసును ఇంకా కొనసాగించినా ఫలితమేమీ ఉండదని, పైగా శివారు భూములకు సాగునీటి సమస్య పునరావృతమవుతూనే ఉంటుందని పలువురు ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు.శిథిలావస్థలో షట్టర్లుహిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. దాదాపుగా అన్నిచోట్ల షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని చోట్ల కొత్తగా షట్టర్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలూ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. సాగునీటి ప్రవాహంపై నియంత్రణ లేకపోవడంతో ఎడమ కాలువకు సంబంధించి పోలాకి, సంతబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని భూముల వరకు వంశధార పారడం లేదు. కుడి కాలువకు సంబంధించి గార మండలంలోని భూములు ఎండిపోతున్నాయి.సాఫీగా సాగని సాగునీటి ప్రవాహంవంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,450 క్యూసెక్కులు కాగా, కాలువ గట్లు బలహీనంగా ఉండడంతో 1800 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. కుడి కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా, 500 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. కాలువల ఆధునీకరణ జరగకపోవడంతో గట్లు బలహీనంగా ఉన్నాయి. కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత బాగా పేరుకుపోవడంతో సాగునీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదు. కాలువల్లోకి విడిచిపెడుతున్న నీరు సామర్థ్యం కంటే తక్కువగా ఉండడం, మరో షట్టర్లు లేకపోవడంతో సాగునీటి ప్రవాహం సాఫీగా సాగడం లేదు. షట్టర్ల అవినీతిపై ఉన్న కేసుకు ప్రభుత్వం సత్వరమే స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు.