విద్యా వ్యవస్థ నిర్వీర్యం

రాష్ట్రంలో చదవురాని వారంతా మంత్రులు, ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారని, చదువు విలువ తెలియక పోవడం వల్లే విద్యావ్యవస్థను సిఎం

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రవికుమార్‌

  • ‘విద్యార్థి మేలుకో-భవిష్యత్‌ను కాపాడుకో’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రవికుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో చదవురాని వారంతా మంత్రులు, ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారని, చదువు విలువ తెలియక పోవడం వల్లే విద్యావ్యవస్థను సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు. నగరంలో జిల్లా టిడిపి కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యాన ‘విద్యార్థి మేలుకో-భవిష్యత్‌ను కాపాడుకో అనే పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్‌ పదో తరగతి తప్పారని, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దొడ్డి దారిన న్యాయ కళాశాల ధ్రువపత్రం పొందారని అన్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యన్నారాయణ ఎంత వరకు చదువుకున్నారో వారి ఆత్మసాక్షిరే తెలుసని అన్నారు. అటువంటి వారు పాలన సాగిస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు మేనమామగా ఉంటానని హామీలు ఇచ్చిన జగన్‌… కంసమామగా మారి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ వల్ల ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఉపాది లేక 120 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చి ఉద్యోగాల విప్లవం తెస్తానని మాయమాటలు చెప్పిన జగన్‌… కేంద్రం ముందు మోకరిల్లి యువత విద్యార్థుల జీవితాలను బలిపీఠం పైకి నెట్టారన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని నమ్మించి వాటికి రెట్టింపు దోచుకుంటున్నారని, ధరలను నియంత్రించడంలో పూర్తి వైఫల్యం చెందారని అన్నారు. యువత, విద్యార్థుల పాలిట శాపంగా మారిన జగన్‌పై డిసెంబరు 7న అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకులు వజ్జ బాబూరావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గోర అనిల్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహర్ష, రెడ్డి శంకర్‌, యాల వరుణ్‌, శ్యామలరావు, సాధు అజరు, ఎన్ని శ్రీకాంత్‌, అనిల్‌, కోల సింహాచలం, ధర్మేంద్ర పాల్గొన్నారు.

 

➡️