ఆమదాలవలస : వినతిపత్రాన్ని అందజేస్తున్న సత్యవతి
ప్రజాశక్తి- ఆమదాలవలస
రైతు సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. సోమవారం రైతు సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్ ఎస్.గణపతికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయి కరువు కోరల్లో చిక్కుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కరువు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఒక్క మండలం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సాగునీటి కాలువల్లో పూడికలు తీయకపోవడం వలన రైతులే తీసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, అప్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణం అర్ధాంతరంగా పనులు నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నారాయణ పురం ఆనకట్టు షట్టర్లు మూలకు చేరడంతో నీరు సముద్రం పాలవుతుందన్నారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, మాజీ ఎంపిపి బొడ్డేపల్లి గోవింద గోపాల్, జిల్లా కార్యదర్శి లఖినేని నారాయణరావు, సాయిరాం, బొత్స రవణ, జి.దాలయ్య, షణ్ముఖరావు కృష్ణమూర్తి, నాయకులు పాల్గొన్నారు.రణస్థలం రూరల్: ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కొత్తకోట్ల సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ సనపల కిరణ్ కుమార్‌కు పలు అంశాలపై వినతిపత్రం అందించారు. పంట కాలువల్లో పూడికతీతకు నిధులు కేటాయించి, మరమ్మతులు జరపాలని, కాలువల కూడలి ప్రాంతాల్లో తుప్పుపట్టి పాడైన షట్టర్ల స్థానంలో కొత్త వాటిని బిగించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ కో- ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కె. లక్ష్మీ, కె.జోగినాయుడు, వై.సూర్యనారాయణ, ఎ.జగదీష్ నాయుడు, ఎం. గణేష్, డి.బోగినాయుడు, ఎ.రాము నాయుడు ఎ.వెంకటనాయుడు పాల్గొన్నారు.పలాస : పలాస నియోజకవరాన్ని కరువు నియోజకవర్గంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు సాసుమాన శ్యామసుందరరావు, మజ్జి బాబూరావులు కోరారు. ఈ మేరకు ఆర్‌డిఒ భరత్ నాయక్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్ సాహు పాల్గొన్నారు.