రీ సర్వేలో లోపాలు సరిదిద్దాలి

జిల్లాలో చేపట్టిన భూ సమగ్ర రీ సర్వేలో అనేక లోపాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు రైతులు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు ఫిర్యాదు

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • ‘స్పందన’కు 182 వినతులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో చేపట్టిన భూ సమగ్ర రీ సర్వేలో అనేక లోపాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు రైతులు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 182 వినతులు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఉప కలెక్టర్‌ జయదేవి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌తో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఏళ్ల తరబడి సాగుహక్కు పొంది ఉన్న రైతులకు బదులు రీ సర్వే అనంతరం రికార్డుల్లో కొత్త పేర్లు ఉంటున్నాయని, లోపాలను సరిదిద్దాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, గురుస్వామి, గణేష్‌ వినతిపత్రం అందజేశారు. నగరపాలక సంస్థ పరిధి పెరగడంతో పాటు రోడ్లు, కాలువలు పెరిగాయని, దీనివల్ల కార్మికులపై పనిభారం బాగా పెరిగిందన్నారు. మృతి చెందిన, రిటైర్మెంట్‌ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కార్మికులను కాదని రాజకీయ నాయకులు తమ అనుచరులకు ఉద్యోగాల్లో నియమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆపాలన్నారు.జిల్లాలో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు వినతిపత్రం అందించారు. వంశధార, నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టులపై నిర్మించిన వ్యవసాయ కాలువల్లో పూడికతీత పనులకు రాష్ట్ర ప్రభుత్వం పుల్‌ స్టాప్‌ పెట్టిందని, ఫలితంగా ఎగువ ప్రాంతాలకు నీరు వెళ్లడం లేదన్నారు. కాలువల్లో ఉన్న షట్టర్లు పూర్తిగా తుప్పుపట్టి కొట్టుకుపోయాయని చెప్పారు. నీటి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన లస్కర్‌ వ్యవస్థను ప్రభుత్వం ధ్వంసం చేసిందని వారి స్థానే కనీసం సచివాలయం ఉద్యోగుల్లో ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి కృష, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు కె.వి.ఎల్‌.ఎస్‌ ఈశ్వరి తదితరులు ఉన్నారు.సంతృప్తిస్థాయిలో సత్వరం పరిష్కారం స్పందన, జగనన్నకు చెబుదాంలో వచ్చే ఫిర్యాదులపై అలసత్వం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. స్పందన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్జీదారునికి ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలన్నారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, మెప్మా, డ్వామా పీడీలు కిరణ్‌, చిట్టిరాజు, డిఎస్‌ఒ వెంకటరమణ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

➡️