- టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి – ఆమదాలవలస
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ విమర్శించారు. మండలంలోని కొత్తవలసలో టిడిపి, జనసేన ఆధ్వర్యాన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పోస్టర్లను పంపిణీ చేస్తూ టిడిపి పాలనకు, ప్రస్తుత వైసిపి పాలనకు తేడా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసకర పాలనను కొనసాగిస్తూ సైకో ఆనందం పొందుతున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వంలో వనరుల దోపిడీ, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనను ప్రశ్నిస్తే ఎంతటి వారిపైనైనా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వైసిపి పాలనలో హంగు, ఆర్భాటమే తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకో పాలనకు చరమగీతం పాడి, సైకిల్ పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షులు మెట్ట సుజాత, టిడిపి మండల అధ్యక్షులు నూక రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సనపల ఢిల్లేశ్వరరావు, ఎంపిటిసి అన్నెపు భాస్కరరావు, మాజీ సర్పంచ్ జి.మోహనరావు, తమ్మినేని చంద్రశేఖర్, బొడ్డేపల్లి గౌరీపతి, జనసేన నాయకులు వి.బాలమురళీకృష్ణ, మురపాక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను పంపిణీ చేస్తున్న కూన రవికుమార్