మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక
- అధికారులతో సమన్వయం పనిచేయాలి
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్‌పి రాధిక
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లాలోమాదకద్రవ్యాల వినియోగం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్‌పి జి.ఆర్ రాధిక అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ (నార్కో కోఆర్డినేషన్) సమావేశాన్ని నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, నియంత్రణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ అవగాహన లేకపోవడంతో మాదకద్రవ్యాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాల వినియోగంపై కళాశాలల యాజమాన్యాలు దృష్టిసారించాలన్నారు. తల్లిదండ్రులకు పిల్లలపై నియంత్రణ లేక డ్రగ్స్, గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారని తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని సూచించారు.కమిటీ కన్వీనర్, ఎస్‌పి రాధిక మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా లాడ్జీలు, హోటళ్లలో బస చేసే కొత్త వ్యక్తుల వివరాల నమోదు కోసం లాడ్జి విజిటర్ మోనటరింగ్ సిస్టం అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దు కేంద్రాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, గత నెలలో ఇచ్ఛాపురం పరిధిలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు వివరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, స్పెషల్ ఎన్‌ఫోర్సమెంట్ విభాగం సమన్వయంతో 21 కేంద్రాల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జెడి ఎన్.మణికంఠ, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్‌డిఒలు, డిఇఒ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ బి.మీనాక్షి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, డిఎస్‌పి విజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.