మెళియాపుట్టి : పట్టాలను అందజేస్తున్న ఎమ్మెల్యే, జెసి, సబ్ కలెక్టర్
ప్రజాశక్తి- మెళియాపుట్టి
మెళియాపుట్టిలోని కమలా కళ్యాణ మండపంలో జగనన్న వ్యవసాయ భూమి పట్టాలను ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జెసి ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమల్‌లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,100 మందికి 1,200 ఎకరాలను సంబంధించి భూ పట్టాలను అందజేశామని అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 869 మందికి 450 ఎకరాలకు సంబంధించి పట్టాలను అందించామని తెలిపారు. జిల్లాలో మంజూరైన పట్టాలు సంబంధించి నియోజకవర్గంలోనే 40 శాతం పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. మెళియాపుట్టి మండలానికి 241 మందికి గాను 134 ఎకరాలు అందించామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.సరోజని, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు ఉల్లాన బాలరాజు, మాజీ ఎంపిపి మాడుగుల రామారావు, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ ఎస్.సుభాష్ పాల్గొన్నారు. జి.సిగడాం: మండలంలోని బాతువలో ప్రభుత్వానికి సంబంధించిన సర్వే నంబర్ 95లో 12 మంది రైతులు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. పట్టాలు కావాలని ఇటీవల తహశీల్దార్ వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ పట్టాలను పంపిణీ చేశారు. మూడెకరాల సెంటు డీపట్టా భూమిని పంపిణీ చేశామని తహశీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో విఆర్‌ఒ రాజు, ఎంపిపి ప్రతినిధి మీసాల వెంకటరమణ పాల్గొన్నారు. రణస్థలం : పేదల పక్ష పాతి సిఎం జగన్ అని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిల్లపేటరాజాం పంచాయతీలో పది మంది పేదలు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జెడ్‌పిటిసి టొంపల సీతారాం, తహశీల్దార్ కిరణ్ కుమార్, సిగడాం ఎంపిపి ప్రతినిధి మీసాల వెంకటరమణ, జి.సిగడాం తహశీల్దార్ పప్పల వేణుగోపాలరావు, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు పాల్గొన్నారు.