మొక్కను నాటుతున్న రమణ
పలాస: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని టెక్కలి డివిజన్ పంచాయతీ విస్తరణ అధికారి ఐ.వి.రమణ ఆదేశించారు. మండలంలోని రెంటికోట సచివాలయాన్ని గురువారం సందర్శించి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు, ఇంటి పన్ను వసూళ్లు వేగవంతంపై సమీక్షించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తడి, పొడి చెత్త నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ శాసనపురి తిరుమలరావు, మండల పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, కార్యదర్శి సద్గుణబాబు పాల్గొన్నారు.